
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఐపీఎల్-2025(IPL 2025) నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. గత డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రూ.6.25 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అయితే రాబోయే సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు బ్రూక్ తెలిపాడు.
కాగా ఈ ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఐపీఎల్ నుంచి వైదొలగడం ఇది వరుసగా రెండో సారి. కాగా బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం ..వేలంలో అమ్ముడుపోయిన ఆటగాడు సరైన కారణం లేకుండా ఐపీఎల్ నుంచి వైదొలిగితే రెండేళ్ల బ్యాన్ పడుతుంది. ఈ క్రమంలో అతడిపై కఠిన చర్యలకు భారత క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు తెలుస్తోంది. బ్రూక్‌పై రెండేళ్ల పాటు బీసీసీఐ నిషేధం విధించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ సస్పెన్షన్ గురించి బీసీసీఐ ఇప్పటికే ఇంగ్లండ్ వెల్స్ క్రికెట్ బోర్డుకు తెలియజేసినట్లు భారత క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
"ఐపీఎల్ మెగా వేలానికి ముందు కొత్త రూల్స్ గురించి ప్రతీ ఆటగాడికి స్పష్టంగా తెలియజేశాము. ఈ రూల్స్ ప్రకారం.. హ్యారీ బ్రూక్‌పై రెండేళ్లపాటు నిషేదం విధించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అధికారిక సమాచారాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో పాటు బ్రూక్‌కు అందించాము.
బోర్డు తీసుకున్న నిర్ణయాలకు ప్రతీ ఆటగాడు కట్టుబడి ఉండాలి" అని బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నారు. కాగా బీసీసీఐ నిర్ణయంతో ఐపీఎల్-2027 వరకు ఐపీఎల్‌లో ఆడే అవకాశం లేదు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.
చదవండి: IPL 2025: లక్నోకు గుడ్ న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు?