రూ. 20 కోట్లు లెక్కకాదు!.. ఎక్కువ డబ్బు ఇస్తే ప్రతి మ్యాచ్‌లో స్కోరు చేయాలా? | "Im The Highest Paid Player, But Rs 20 Cr Doesnt Matter Once...": Venkatesh Iyer Fires Back At His IPL Price Tag | Sakshi
Sakshi News home page

రూ. 20 లక్షలు.. రూ. 20 కోట్లు.. ఏదైనా ఒకటే.. ఎక్కువ డబ్బు ఇస్తే ప్రతి మ్యాచ్‌లో స్కోరు చేయాలా?

Published Fri, Apr 4 2025 12:30 PM | Last Updated on Fri, Apr 4 2025 1:53 PM

Im Highest Paid Player But Rs 20 Cr Doesnt Matter Once: Venkatesh Iyer

Photo Courtesy: BCCI/IPL

ఐపీఎల్‌ మెగా వేలం-2025లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లలో వెంకటేశ్‌ అయ్యర్‌ (Venkatesh Iyer)మూడోవాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) కోసం రూ. 27 కోట్లు ఖర్చు చేస్తే.. పంజాబ్‌ కింగ్స్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)ను ఏకంగా రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది.

రూ. 23.75 కోట్లు
అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్‌ అనూహ్య రీతిలో వెంకటేశ్‌ అయ్యర్‌ను దక్కించుకునేందుకు రూ. 23.75 కోట్లు కుమ్మరించింది. నిజానికి గతేడాది అతడు అంత గొప్పగా ఏమీ ఆడలేదు. పదిహేను మ్యాచ్‌లలో కలిపి 370 పరుగులు సాధించాడు.

అయితే, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో కీలకమైన ఫైనల్లో మాత్రం వెంకటేశ్‌ అయ్యర్‌ బ్యాట్‌ ఝులిపించాడు. కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టును చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్‌ అతడిని భారీ ధరకు దక్కించుకోవడం గమనార్హం.

ఆరంభ మ్యాచ్‌లో ఆరు..  ముంబైపై మూడు
అయితే, ఐపీఎల్‌-2025 ఆరంభ మ్యాచ్‌లలో మాత్రం వెంకటేశ్‌ అయ్యర్‌ తేలిపోయాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో కేవలం ఆరు పరుగులే చేసిన ఈ ఆల్‌రౌండర్‌.. రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగలేదు. ఇక ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కేవలం మూడు పరుగులకే పెవిలియన్‌ చేరాడు.

మెరుపు బ్యాటింగ్‌
ఈ క్రమంలో వెంకటేశ్‌కు కేకేఆర్‌ భారీ మొత్తం చెల్లించడం వృథా అయిందని పెద్ద ఎత్తున ట్రోల్స్‌ వచ్చాయి. అయితే, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో గురువారం నాటి మ్యాచ్‌ సందర్భంగా విమర్శకులందరికీ బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు వెంకటేశ్‌. ఇన్నింగ్స్‌ ఆరంభంలో టెస్టు మ్యాచ్‌ మాదిరి ఆడిన అతడు ఆఖర్లో మెరుపులు మెరిపించాడు.

 

కేవలం 29 బంతుల్లోనే వెంకటేశ్‌ అయ్యర్‌ 60 పరుగులు చేసి కేకేఆర్‌ టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. రైజర్స్‌పై కేకేఆర్‌ 80 పరుగుల తేడాతో గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం వెంకటేశ్‌ అయ్యర్‌ తన ‘ప్రైస్‌ ట్యాగ్‌’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రూ. 20 లక్షలు.. రూ. 20 కోట్లు.. ఏదైనా ఒకటే
‘‘ఒక్కసారి ఐపీఎల్‌ మొదలైందంటే.. ఓ ఆటగాడు రూ. 20 లక్షలకు అమ్ముడుపోయాడా? లేదంటే రూ. 20 కోట్లకు అమ్ముడుపోయాడా? అన్న విషయంతో సంబంధం ఉండదు. మనం ఎలా ఆడతామన్నది డబ్బు నిర్ణయించదు. మా జట్టులో అంగ్‌క్రిష్‌ రఘువన్షీ అనే కుర్రాడు ఉన్నాడు.

అతడు ఆరంభం నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు. ఆటగాడి ధరకు అనుగుణంగానే అంచనాలూ ఉంటాయని నాకు తెలుసు. కానీ జట్టు విజయానికి ఒక ఆటగాడు ఎంత మేర తోడ్పడుతున్నాడన్నదే ముఖ్యం. పరిస్థితులకు అనుగుణంగా నేను ఈరోజు బ్యాటింగ్‌ చేశాను.

ఎక్కువ డబ్బు ఇస్తే ప్రతి మ్యాచ్‌లో స్కోరు చేయాలా?
అంతేగానీ.. నేను అత్యధిక ధర పలికిన ఆటగాడిని గనుక ప్రతి మ్యాచ్‌లో స్కోరు చేయాలనే నిబంధన ఏమీ లేదు. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభావం చూపానా? లేదా? అన్నదే ముఖ్యం. ప్రైస్‌ ట్యాగ్‌ వల్ల ఒత్తిడి ఉంటుందన్న మాట నిజం.

ఈ విషయంలో నాకు అబద్ధం ఆడాల్సిన పనిలేదు. అయితే, ఆ ఒత్తిడి డబ్బు గురించి కాదు.. జట్టుకు నేను ఉపయోగపడుతున్నానా? లేదా? అన్న అంశం మీద ఆధారపడి ఉంటుంది’’ అని వెంకటేశ్‌ అయ్యర్‌ చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది సత్తా చాటిన అంగ్‌క్రిష్‌ను కేకేఆర్‌ తిరిగి రూ. 3 కోట్లకు సొంతం చేసుకుంది. ఇప్పటికే అతడు ఈ సీజన్‌లో ఓ హాఫ్‌ సెంచరీ బాదేశాడు. నాలుగు మ్యాచ్‌లలో కలిపి 128 రన్స్‌ చేశాడు.

ఐపీఎల్‌-2025: కోల్‌కతా వర్సెస్‌ హైదరాబాద్‌
👉కోల్‌కతా స్కోరు: 200/6 (20)
👉హైదరాబాద్‌ స్కోరు: 120 (16.4)
👉ఫలితం: 80 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై కేకేఆర్‌ విజయం.

చదవండి: జట్టు మారనున్న తిలక్‌ వర్మ?.. HCA స్పందన ఇదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement