
దేశవాళీ క్రికెట్‌లో వచ్చే సీజన్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) కొత్త జట్టుకు ఆడబోతున్నాడు. ఇన్నాళ్లుగా తాను ప్రాతినిథ్యం వహించిన ముంబైని వీడి.. అతడు గోవా జట్టుతో జత కట్టనున్నాడు. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వెలువడగా.. జైస్వాల్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వీటిని నిర్ధారించాడు.
అందుకే ముంబైని వీడి.. గోవాకు ఆడబోతున్నా
‘‘నేను తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం ఇది. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు ముంబై కారణం. ఈ మహానగరం నాకంటూ ఓ గుర్తింపు వచ్చేలా చేసింది. నా జీవితాంతం నేను ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కు రుణపడి ఉంటాను.
అయితే, గోవా అసోసియేషన్ నాకు కొత్త అవకాశం కల్పిస్తామని చెప్పింది. గోవా జట్టు కెప్టెన్‌గా నాకు ఆఫర్ ఇచ్చింది. నేను ఏ జట్టుకు ఆడుతున్నా.. టీమిండియా తరఫున గొప్పగా రాణించడమే నా ఏకైక లక్ష్యం.
జాతీయ జట్టు విధుల్లో లేనపుడు మాత్రం తప్పక దేశీ క్రికెట్ ఆడతా. డొమెస్టిక్ టోర్నమెంట్లలో ఇకపై గోవాకు ఆడుతూ.. జట్టును ప్రగతిపథంలో నిలిపేందుకు కృషి చేస్తా. నా కెరీర్‌లో నాకు వచ్చిన ముఖ్యమైన అవకాశాల్లో ఇది ఒకటి. అందుకే వేరే ఆలోచనకు తావు లేకుండా వారి ప్రతిపాదనుకు అంగీకరించాను’’ అని యశస్వి జైస్వాల్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నాడు.
రహానే కిట్ బ్యాగ్‌ను తన్నిన జైస్వాల్?!
ఈ నేపథ్యంలో ఇండియా టుడే కథనం జైస్వాల్ వ్యాఖ్యలకు భిన్నంగా ఉంది. ముంబై జట్టులోని సీనియర్ సభ్యుడితో గొడవల కారణంగానే జైసూ ఆ టీమ్‌ను వదిలేశాడని సదరు కథనం పేర్కొంది. 2022 నాటి ఓ మ్యాచ్‌లో జైస్వాల్ ప్రత్యర్థి జట్టు ఆటగాడిని స్లెడ్జ్ చేయడంతో కెప్టెన్ అజింక్య రహానే అతడిని మైదానం నుంచి బయటకు పంపాడు.
అంతేకాదు.. ప్రతిసారి అతడి షాట్ సెలక్షన్ గురించి ముంబై యాజమాన్యం, రహానే ప్రశ్నించడం జైసూకు నచ్చలేదు. గత సీజన్‌లో జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్‌లో జైస్వాల్ విఫలమైనపుడు అతడిని కెప్టెన్ ప్రశ్నించగా.. అతడూ తిరిగి అదే ప్రశ్న వేశాడు.
దీంతో సీనియర్ సభ్యుడికి కోపం వచ్చింది. జైస్వాల్ కూడా సీరియస్‌గానే ఉన్నాడు’’ అని సదరు కథనాన్ని బట్టి తెలుస్తోంది. అంతేకాదు.. జైస్వాల్ కోపంతో రహానే కిట్ బ్యాట్ తన్నినట్లు వదంతులు వస్తున్నాయి. ఈ కారణాల వల్లే జైస్వాల్ గోవాకు ఆడేందుకు సిద్ధమయ్యాడని ప్రచారం జరుగుతోంది.
వారు జట్టు మారడం లేదు
ఇదిలా ఉంటే.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, నయా స్టార్ తిలక్ వర్మ కూడా జైస్వాల్ బాటలోనే తమ సొంత జట్లను వీడనున్నారని వదంతులు పుట్టుకొచ్చాయి. అయితే, సూర్య ముంబైని వీడటం లేదని ఎంసీఏ.. తిలక్ వర్మ హైదరాబాద్‌తోనే ఉంటానని చెప్పాడని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్. దేవరాజ్ స్పష్టం చేశారు.
చదవండి: రూ. 20 లక్షలు.. రూ. 20 కోట్లు.. ఏదైనా ఒకటే.. ఎక్కువ డబ్బు ఇస్తే ప్రతి మ్యాచ్‌లో స్కోరు చేయాలా?