
తాను జట్టు మారబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. జర్నలిస్టులు ఈ మధ్య స్క్రిప్టు రైటర్లుగా మారిపోయారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం కంటే చెత్త విషయం మరొకటి ఉండదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కాగా సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల నుంచి సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ వంటి నయా తారల వరకు.. ముంబై క్రికెట్ టీమిండియాకు ఎంతో మంది ఆటగాళ్లను అందించింది. అంతేకాదు అత్యధికంగా 42 సార్లు రంజీ ట్రోఫీ టైటిల్ గెలిచిన ఘనత కూడా ముంబైదే.
అయితే, టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబై జట్టును వీడి.. గోవా జట్టులో చేరబోతున్నాడని వార్తలు వచ్చాయి. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
అదే విధంగా.. సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబైని వీడి గోవా క్రికెట్‌తో జట్టు కట్టబోతున్నాడని.. హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ కూడా సూర్య బాటలో నడవనున్నాడనే ప్రచారం జరిగింది.
అంతేకాదు.. జైస్వాల్, తిలక్ గోవా జట్టులో చేరేలా సూర్యనే వారిని ప్రోత్సహించాడని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ఘాటుగా స్పందించాడు. సదరు కథనానికి సంబంధించిన స్క్రీన్‌షాట్ ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ .. ‘‘ఇతను స్క్రిప్టు రైటరా? లేదంటే జర్నలిస్టా?
ఇకపై నేను నవ్వుకోవాలంటే కామెడీ సినిమాలు చూడటం మానేసి.. ఇలాంటి ఆర్టికల్స్ చదవడం మొదలుపెట్టాలేమో!.. అర్థంపర్థంలేని చెత్త మాటలు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా సూర్య పోస్టుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
ఇదిలా ఉంటే.. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నారు. సూర్య, తిలక్‌లను మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ వరుసగా రూ. 16.35 కోట్లు, రూ. 8 కోట్లకు అట్టిపెట్టుకోగా.. రాజస్తాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్‌ను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది.
ఇక హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో సూర్య ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఇప్పటి వరకు ముంబై మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని కేవలం ఒకే ఒక్కటి గెలిచింది.
ఇక సూర్య ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లలో కలిపి 104 పరుగులు చేయగా.. తిలక్ వర్మ 70 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఇక రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జైస్వాల్ మూడు మ్యాచ్‌లలో కలిపి కేవలం 34 పరుగులే చేసి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా టీ20 విజయవంతమైన కెప్టెన్‌గా సూర్య కొనసాగుతుండగా.. తిలక్ టీ20లలో, జైస్వాల్ టెస్టుల్లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.
Script writer hai ya journalist? Agar hasna hai toh I will stop watching comedy movies and start reading these articles. Ekdum bakwas 🤣🤣🤣 pic.twitter.com/VG3YwQ5eYb
— Surya Kumar Yadav (@surya_14kumar) April 2, 2025