
టీమిండియా స్టార్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో ఇకపై ముంబైకి ఆడకూడదని ఈ యువ ఓపెనర్ నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కు జైసూ ఈ- మెయిల్ పంపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కాగా ఉత్తరప్రదేశ్‌లోని సురియాకు చెందిన యశస్వి జైస్వాల్.. దేశవాళీ క్రికెట్‌లో చాలా ఏళ్లుగా ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తన అండర్-19 కెరీర్ నుంచి ముంబైకి ఆడుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. విజయ్ హజారే (వన్డే) టోర్నీలో డబుల్ సెంచరీ బాదడం ద్వారా క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు.
డబుల్ సెంచరీలతో సత్తా చాటి
అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడే అవకాశం దక్కించుకున్న జైస్వాల్ 2020లో క్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. కెరీర్ ఆరంభం నుంచి రాజస్తాన్ రాయల్స్‌కు ఆడుతున్న 23 ఏళ్ల జైస్వాల్.. అక్కడసత్తా చాటడం ద్వారా 2023లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
టెస్టుల్లో సత్తా చాటుతున్న ఈ యువ ఓపెనర్.. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా జట్టులో పాతుకుపోయాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 19 టెస్టుల్లో 1798 పరుగులు చేసిన జైసూ ఖాతాలో నాలుగు శతకాలతో పాటు.. రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం సత్తా చాటలేకపోతున్నాడు. 23 టీ20లలో కలిపి 723 పరుగులు చేసిన జైస్వాల్.. ఒకే ఒక్క వన్డే ఆడి 15 పరుగులకే పరిమితమయ్యాడు.
ఇక జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాలన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు.. 2024 రంజీ బరిలో దిగాడు జైస్వాల్. ముంబై తరఫున రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసి విఫలమయ్యాడు.
గోవాకు ఆడేందుకు సిద్ధం
అయితే, వచ్చే సీజన్ నుంచి జైస్వాల్ గోవాకు ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇదే విషయాన్ని ఎంసీకేకు మెయిల్ ద్వారా తెలిపినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.
అర్జున్ టెండుల్కర్, సిద్దేశ్ లాడ్ మాదిరి జైస్వాల్ కూడా ముంబై జట్టును వీడి.. గోవాకు ప్రాతినిథ్యం వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ విషయం గురించి ఎంసీఏ వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘అతడు గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయమై నిరభ్యంతర పత్రం (No Objection Certificate) కోసం మెయిల్ పంపాడు.
వ్యక్తిగత కారణాల వల్లే గోవాకు ప్రాతినిథ్యం వహించాలని భావిస్తున్నట్లు తెలిపాడు’’ అని తెలిపాయి. కాగా గోవా జట్టుకు జైస్వాల్ కెప్టెన్‌గా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక జైసూ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు.
ఫామ్‌లేమితో సతమతం
గతేడాది ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో చతికిల పడ్డ యశస్వి జైస్వాల్.. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసి.. ఆడిన ఒకే ఒక్క మ్యాచ్‌లో పదిహేను పరుగులు మాత్రమే చేశాడు.
ఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-202 ప్రాథమిక జట్టులో అతడికి చోటు ఇచ్చిన సెలక్టర్లు.. ఆ తర్వాత ప్రధాన జట్టు నుంచి తప్పించారు. ఇక ఐపీఎల్-2025లోనూ ఈ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి జైస్వాల్ కేవలం 34 పరుగులే చేశాడు. కాగా రూ. 18 కోట్లకు రాజస్తాన్ అతడిని రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.
చదవండి: శ్రేయస్ అయ్యర్‌కు ఆ క్రెడిట్ దక్కలేదు: టీమిండియా దిగ్గజం