
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. లక్నోలోని అటల్ బిహారి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో లక్నో ఓ కీలక మార్పుతో బరిలోకి దిగుతుంది. స్టార్ ఆటగాడు, ఇన్ ఫామ్ ప్లేయర్ మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు.
కారణం ఏంటి..?
నేటి మ్యాచ్‌కు మార్ష్ వ్యక్తిగత కారణాల చేత దూరంగా ఉన్నాడని టాస్ సందర్భంగా లక్నో కెప్టెన్ పంత్ చెప్పాడు. మార్ష్ కూతురు లైలా అనారోగ్యంతో బాధపడుతుందని పంత్ పేర్కొన్నాడు. మార్ష్ తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
మార్ష్ ప్రస్తుత సీజన్‌లో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. మార్ష్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 53.00 సగటున, 180.27 స్ట్రయిక్‌రేట్‌తో 265 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మార్ష్ ఈ సీజన్‌లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 హాఫ్ సెంచరీలు చేశాడు. పంజాబ్‌తో ఆడిన మ్యాచ్‌లో మాత్రమే మార్ష్ డకౌటయ్యాడు.
ఈ సీజన్‌లో మార్ష్ చేసిన స్కోర్లు..
ఢిల్లీపై 72 (36)
హైదరాబాద్‌పై 52 (31)
పంజాబ్‌పై 0 (1)
ముంబైపై 60 (31)
కేకేఆర్‌పై 81 (48)
మార్ష్ స్థానాన్ని భర్తీ చేసిన ఈ హిమ్మత్ సింగ్ ఎవరు..?
గుజరాత్‌తో మ్యాచ్‌లో మార్ష్ స్థానాన్ని భర్తీ చేస్తున్న హిమ్మత్ సింగ్ ఢిల్లీకి చెందిన కుడి చేతి వాటం విధ్వంసకర బ్యాటర్. నేటి మ్యాచ్‌లో హిమ్మత్ ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు. హిమ్మత్‌కు టీ20ల్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 47 మ్యాచ్‌ల్లో 28.65 సగటున 132.51 స్ట్రైక్ రేట్‌తో 917 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ హాఫ్ బ్రేక్‌తో సత్తా చాటగలడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌తో హిమ్మత్ వెలుగులోకి వచ్చాడు. ఈ సీజన్ మెగా వేలంలో లక్నో హిమ్మత్‌ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. నేటి మ్యాచ్‌లో హిమ్మత్ ఓపెనింగ్ లేదా మిడిలార్డర్‌లో రావచ్చు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిలకడగా ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (23 బంతుల్లో 35; 4 ఫోర్లు, సిక్స్), శుభ్‌మన్ గిల్ (31 బంతుల్లో 50; 5 ఫోర్లు, సిక్స్) తమ సహజ శైలిలో ఆడుతున్నారు. 9 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 88/0గా ఉంది.
తుది జట్లు..
లక్నో: ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్/వికెట్‌కీపర్), హిమ్మత్ సింగ్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్