
Photo Courtesy: BCCI/IPL
యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal).. ఈ టీమిండియా స్టార్ క్రికెటర్ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. తన కెరీర్‌కు పునాది వేసిన ముంబై క్రికెట్‌ను వీడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తదుపరి దేశవాళీ సీజన్‌లో గోవాకు ఆడనుండటం చర్చకు దారితీసింది. ముంబై కెప్టెన్ అజింక్య రహానే, యాజమాన్యంతో విభేదాల వల్లే జైసూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు రావడం గమనార్హం.
వరుస వైఫల్యాలు..
ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా యశస్వి జైస్వాల్ ఫామ్‌లేమితో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో, ఇంగ్లండ్‌తో వన్డేలోనూ పరుగులు రాబట్టలేక ఇబ్బంది పడ్డాడు. ఇక ఐపీఎల్-2025 (IPL 2025)లోనూ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది.
రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంటే..
మెగా వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్ తమ ఓపెనర్ జైసూను ఏకంగా రూ. 18 కోట్లకు అట్టిపెట్టుకుంది. అయితే, ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ అతడు తేలిపోయాడు. తన స్థాయికి తగ్గట్లుగా ఒక్కసారీ బ్యాట్ ఝులిపించలేకపోయాడు. మూడు ఇన్నింగ్స్‌లో కలిపి 11.33 సగటుతో 34 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్ ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒక్కటే గెలిచింది. ఇక శనివారం నాటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో యశస్వి జైస్వాల్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అతడే ముఖ్యం
‘‘జైస్వాల్ ఇప్పటికీ పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. ఓపెనర్‌గా తను బ్యాట్ ఝులిపిస్తేనే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది. జట్టులో అతడు అత్యంత కీలక సభ్యుడు. తప్పక పరుగులు చేయాల్సిన బాధ్యత అతడిపై ఉంది. పంజాబ్‌తో మ్యాచ్‌లో అందరి దృష్టి అతడి మీదే కేంద్రీకృతమై ఉంటుందనడంలో సందేహం లేదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
సంజూ రాకతో
ఇక పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా సంజూ శాంసన్ కెప్టెన్‌గా విధుల్లో చేరనుండటం రాజస్తాన్‌కు సానుకూలాంశంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్‌గా, కీపర్‌గా రాయల్స్ సంజూను మిస్ అయింది.
పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవడంలో అతడు దిట్ట. కీపర్‌గానూ జట్టుకు అతడి సేవలు ముఖ్యం. కాబట్టి అతడి రాకతో జట్టులో సానుకూల వాతావరణం ఏర్పడింది’’ అని పేర్కొన్నాడు.