
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్ 5) రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాయల్స్ 50 పరుగుల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. రెండు వరుస విజయాల తర్వాత పంజాబ్‌కు ఈ సీజన్‌లో ఇది తొలి ఓటమి కాగా.. రెండు వరుస పరాజయాల తర్వాత రాయల్స్‌కు ఇది వరుసగా రెండో విజయం.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్.. యశస్వి జైస్వాల్ (45 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (26 బంతుల్లో 38; 6 ఫోర్లు), రియాన్ పరాగ్ (25 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
నితీశ్ రాణా 7 బంతుల్లో 12, హైట్‌మైర్ 12 బంతుల్లో 20, ధృవ్ జురెల్ 5 బంతుల్లో 13 (నాటౌట్) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో ఫెర్గూసన్ 2, అర్షదీప్ సింగ్, జన్సెన్ తలో వికెట్ తీశారు. ఈ సీజన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన జైస్వాల్.. ఈ మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్.. జోఫ్రా ఆర్చర్ (4-0-25-3), సందీప్ శర్మ (4-0-21-2), మహీశ్ తీక్షణ (4-0-26-2) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి ఓవర్‌లో ఆర్చర్ ఆకాశమే హద్దుగా చెలరేగి మొదటి బంతికే ప్రియాంశ్ ఆర్య (0), ఓవర్ చివరి బంతికి శ్రేయస్ అయ్యర్‌ను (10) క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఆతర్వాత కూడా రాయల్స్ బౌలర్లు చెలరేగిపోయారు. ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను (17) కుమార్ కార్తికేయ.. స్లోయినిస్‌ను (1) సందీప్ శర్మ పెవిలియన్‌కు పంపారు. తద్వారా పంజాబ్ 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో నేహల్ వధేరా (41 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్) పంజాబ్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేశారు.
అయితే మ్యాక్సీ, వధేరా వరుస బంతుల్లో (15వ ఓవర్ చివరి బంతికి, 16వ ఓవర్ మొదటి బంతికి) ఔట్ కావడంతో పంజాబ్ ఓటమి ఖరారైపోయింది. క్రీజ్‌లో కుదురుకున్న వధేరాను హసరంగ ఔట్ చేయగా.. మ్యాక్స్‌వెల్‌ను తీక్షణ బోల్తా కొట్టించాడు. ఆఖర్లో వచ్చిన శశాంక్ సింగ్ (13 బంతుల్లో 10 నాటౌట్), సూర్యాంశ్ షేడ్గే (2), జన్సెన్ (3), అర్షదీప్ (1), ఫెర్గూసన్ (4 నాటౌట్) ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా పంజాబ్ లక్ష్యానికి 51 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
షేన్ వార్న్ రికార్డును బద్దలు కొట్టిన శాంసన్
ఈ మ్యాచ్‌లో గెలుపుతో రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఓ భారీ రికార్డును తన ఖతాలో వేసుకున్నాడు. రాయల్స్‌ను అత్యధిక మ్యాచ్‌ల్లో గెలిపించిన కెప్టెన్‌గా షేన్ వార్న్ రికార్డును బద్దలు కొట్టాడు. వార్న్ 31 మ్యాచ్‌ల్లో (55 మ్యాచ్‌ల్లో) రాయల్స్‌ను గెలిపించగా.. తాజా గెలుపుతో శాంసన్ 32 సార్లు (62 మ్యాచ్‌ల్లో) రాయల్స్‌ను విజయపథాన నడిపించాడు. తద్వారా ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా అవతరించాడు.
రాయల్స్ కెప్టెన్‌గా అత్యధిక విజయాలు..
32 - సంజూ శాంసన్ (62 మ్యాచులు)*
31 - షేన్ వార్న్ (55 మ్యాచులు)
18 - రాహుల్ ద్రవిడ్ (34 మ్యాచులు)
15 - స్టీవెన్ స్మిత్ (27 మ్యాచులు)
9 - అజింక్య రహానే (24 మ్యాచులు)