సీఎస్‌కే బౌలర్‌ ‘ఓవరాక్షన్‌’.. ఇచ్చిపడేసిన కోహ్లి! నవ్వేసిన జడ్డూ | Kohli Animated Chat with CSK Bowler As Jadeja Laughs But Looks | Sakshi
Sakshi News home page

సీఎస్‌కే బౌలర్‌ ‘ఓవరాక్షన్‌’.. ఇచ్చిపడేసిన కోహ్లి! నవ్వేసిన జడ్డూ

Published Sat, Mar 29 2025 6:00 PM | Last Updated on Sat, Mar 29 2025 7:35 PM

Kohli Animated Chat with CSK Bowler As Jadeja Laughs But Looks

Photo Courtesy: BCCI/IPL

ఐపీఎల్‌-2025లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB)- చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) మధ్య పోరు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖాముఖి పోటీలో సీఎస్‌కేదే పైచేయి అయినా.. ఈసారి మాత్రం ఆర్సీబీ అదరగొట్టింది. చెన్నై కంచుకోటను బద్దలు కొట్టి 2008 తర్వాత మొదటిసారి చెపాక్‌లో జయకేతనం ఎగురవేసింది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు సాధించింది. ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌(32), విరాట్‌ కోహ్లి (Virat Kohli- 31) ఫర్వాలేదనిపించగా.. దేవదత్‌ పడిక్కల్‌(14 బంతుల్లో 27), కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (32 బంతుల్లో 51), టిమ్‌ డేవిడ్‌ (8 బంతుల్లో 22 నాటౌట్‌) రాణించారు.

ఇక చెన్నై బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ మూడు వికెట్లు తీయగా.. మతీశ పతిరణకు రెండు వికెట్లు దక్కాయి. మిగతా వాళ్లలో ఖలీల్‌ అహ్మద్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై 146 పరుగులకే పరిమితం కావడంతో ఆర్సీబీ 50 పరుగుల తేడాతో గెలుపొందింది. 

 

చెన్నై బ్యాటర్లలో రచిన్‌ రవీంద్ర (31 బంతుల్లో 41), రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25), మహేంద్ర సింగ్‌ ధోని (16 బంతుల్లో 30 నాటౌట్‌) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.

జడేజాతో  ముచ్చట్లు
ఇదిలా ఉంటే.. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కోహ్లి.. చెన్నై స్టార్‌ రవీంద్ర జడేజాతో కలిసి ముచ్చట్లు పెట్టాడు. ఆ సమయంలో కోహ్లి కాస్త సీరియస్‌గా మాట్లాడుతున్నట్లు కనిపించగా.. జడ్డూ మాత్రం నవ్వులు చిందించాడు. 

ఇంతలో అక్కడికి చెన్నై పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ రాగానే కోహ్లి మరింత సీరియస్‌ అయినట్లు కనిపించింది. అతడితో వాదనకు దిగిన కోహ్లి.. ఖలీల్‌ ఏం చెప్తున్నా పట్టించుకోకుండా తన పాటికి తాను ఏదో మాట్లాడుతూనే కనిపించాడు.

కోహ్లి చేయి పట్టుకుని మరీ ఖలీల్‌ అతడిని అనునయించేందుకు ప్రయత్నించగా.. అతడు మాత్రం అందుకు సుముఖంగా కనిపించలేదు. ఇంతలో కోహ్లికి డ్రెస్సింగ్‌రూమ్‌ నుంచి పిలుపు రావడటంతో వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

సీఎస్‌కే బౌలర్‌ ‘ఓవరాక్షన్‌’
కాగా చెన్నై బౌలింగ్‌ అటాక్‌ను ఆరంభించిన ఖలీల్‌.. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్‌ కూడా తానే వేశాడు. ఆ ఓవర్‌ తొలి బంతికే కోహ్లిని ఎల్బీడబ్ల్యూ(లెగ్‌ బిఫోర్‌ వికెట్‌) చేసినట్లుగా భావించిన ఖలీల్‌.. సంబరాలు మొదలుపెట్టేశాడు. కానీ ఫీల్డ్‌ అంపైర్‌ మాత్రం నాటౌట్‌ ఇచ్చాడు.

అయితే, అంపైర్‌ నిర్ణయంతో సంతృప్తి చెందని ఖలీల్‌.. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఒప్పించి డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. కానీ అక్కడ చెన్నైకి విరుద్ధంగా థర్డ్‌ అంపైర్‌ తీర్పు వచ్చింది. 

బంతి లెగ్‌ స్టంప్‌ ఆవలి దిశగా పిచ్‌ అయినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో కోహ్లి సేవ్‌ అవ్వగా.. సీఎస్‌కే ఓ రివ్యూను కోల్పోయింది. ఈ నేపథ్యంలో కోహ్లి ఇదే విషయమై ఖలీల్‌తో సీరియస్‌గా చర్చించి ఉంటాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement