
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న అమెరికా ఆటగాళ్ల భద్రత విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తోంది. ముఖ్యంగా టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉగ్రముప్పు ఉందన్న వార్తల నేపథ్యంలో సెక్యూరిటీ ఆఫీసర్లు మరింత అప్రమత్తమయ్యారు.
డేగ కళ్లతో భారత ఆటగాళ్లకు పహారా కాస్తున్నారు. టీమిండియా స్టార్, గ్లోబల్ ఐకాన్ విరాట్ కోహ్లి విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి.. కాస్త ఆలస్యంగా న్యూయార్క్ చేరుకున్నాడు. అనంతరం టీమిండియాతో కలిసి ఒకే హోటల్‌లో బస చేస్తున్న కోహ్లికి ప్రత్యేకంగా భద్రత కల్పిస్తున్నారు అమెరికా పోలీసులు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. టీమిండియా జెర్సీ ధరించిన కోహ్లి.. బ్యాట్ చేతబట్టి సహచర ఆటగాళ్లను కలిసేందుకు వెళ్తుండగా.. దాదాపు ఆరు మంది భద్రతా సిబ్బంది అతడికి సెక్యూరిటీగా వచ్చారు.
మరో ఇద్దరు పోలీసులు గుర్రాలపై ముందు పహారా కాస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే.. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొంత మంది అభిమానుల అత్యుత్సాహం వల్ల భద్రతా సిబ్బందికి చిక్కులు తప్పడం లేదు.
ఇటీవల జూన్ 1న బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకువచ్చి కెప్టెన్ రోహిత్ శర్మను ఆలింగనం చేసుకున్నాడు. పోలీసులు వెంటనే స్పందించి అతడిని చుట్టుమట్టి బంధించేశారు.
ఈ క్రమంలో అతడి పట్ల కాస్త కఠినంగా వ్యవహరించారు. దీంతో రోహిత్ శర్మ జోక్యం చేసుకుని మరీ కాస్త దయ చూపాలంటూ రిక్వెస్ట్ చేయడం గమనార్హం. ఏదేమైనా వెస్టిండీస్‌తో కలిసి మెగా టోర్నీకి తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న యూఎస్‌ఏ తమ ప్రతిష్టకు ఎలాంటి భంగం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.
Even Salman Khan doesn’t have this kind of swag https://t.co/ar86RYwJ5i
— Nihari Korma (@NihariVsKorma) June 3, 2024