LSG Vs MI: నువ్విక మారవా?.. లక్నో జట్టుకు రెండు భారీ షాకులు.. పాపం పంత్‌! | Rishabh Pant Fined And Digvesh Singh Rathi Fined Again For Code Of Conduct Breach During LSG Vs MI IPL 2025, Know Reasons Inside | Sakshi
Sakshi News home page

LSG Vs MI: నువ్విక మారవా?.. లక్నో జట్టుకు రెండు భారీ షాకులు.. పాపం పంత్‌!

Published Sat, Apr 5 2025 11:58 AM | Last Updated on Sat, Apr 5 2025 1:06 PM

LSG Rishabh Pant Fined And Digvesh Singh Rathi Fined Again Reasons Are

Photo Courtesy: BCCI/ IPL

గెలుపు జోష్‌లో ఉన్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో లక్నో జట్టు తప్పిదానికి గానూ ఐపీఎల్‌ పాలక మండలి అతడికి జరిమానా విధించింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున రూ. 12 లక్షల ఫైన్‌ వేసింది.

దిగ్వేశ్‌కి మరోసారి షాక్‌
అదే విధంగా.. లక్నో స్పిన్నర్‌ దిగ్వేశ్‌ సింగ్‌ రాఠీకి ఐపీఎల్‌ పాలక మండలి మరోసారి షాకిచ్చింది. అనుచిత ప్రవర్తనకు గానూ మ్యాచ్‌ ఫీజులో యాభై శాతం మేర కోత విధించడంతో పాటు.. అతడి ఖాతాలో మరో డీమెరిట్‌ పాయింట్‌ జతచేసింది.

203 పరుగులు
ఐపీఎల్‌-2025 (IPL 2025)లో భాగంగా లక్నోలోని ఏకనా స్టేడియంలో ఎల్‌ఎస్‌జీ- ముంబై (LSG vs MI) ఇండియన్స్‌ మధ్య శుక్రవారం మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు సాధించింది.

ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌ (60), ఐడెన్‌ మార్క్రమ్‌ (53), ఆయుశ్‌ బదోని (30), డేవిడ్‌ మిల్లర్‌(27) రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అత్యధికంగా ఐదు వికెట్లు తీయగా.. విఘ్నేశ్‌ పుతూర్‌, అశ్వనీ కుమార్‌, ట్రెంట్‌ బౌల్ట్‌ ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

పన్నెండు పరుగుల తేడాతో
ఇక లక్ష్య ఛేదనలో ముంబై ఐదు వికెట్లు నష్టపోయి 191 పరుగులకే పరిమితమైంది. నమన్‌ ధీర్‌ (24 బంతుల్లో 46), సూర్యకుమార్‌ యాదవ్‌ (43 బంతుల్లో 67), హార్దిక్‌ పాండ్యా (16 బంతుల్లో 28 నాటౌట్‌) పోరాటం వృథాగా పోయింది. పన్నెండు పరుగుల తేడాతో లక్నో చేతిలో ముంబై ఓటమి పాలైంది.

అయితే, ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు నిర్ణీత సమయంలో 20 ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. ఫలితంగా ఆఖరి ఓవర్లో 30 యార్డ్‌ సర్కిల్‌లోకి అదనంగా ఓ ఫీల్డర్‌ను పిలవాల్సి వచ్చింది. ముంబై విజయానికి చివరి ఓవర్లో 22 పరుగులు అవసరమైన వేళ కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే రింగ్‌ బయట ఉంచాల్సి వచ్చింది. దీనితో పాటు.. స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసిన కారణంగా ఆ జట్టు కెప్టెన్‌ పంత్‌కు జరిమానా కూడా పడింది.

స్లో ఓవర్‌ రేటు 
‘‘లక్నోలోని భారత రత్న శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్‌ స్టేడియంలో శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసినందు వల్ల లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు జరిమానా విధించడమైనది’’ అని ఐపీఎల్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇదిలా ఉంటే.. దిగ్వేశ్‌ సింగ్‌ రాఠీ విషయంలోనూ ఐపీఎల్‌ పాలక మండలి మరో ప్రకటన జారీ చేసింది. ‘‘లక్నోలోని భారత రత్న శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్‌ స్టేడియంలో శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన లక్నో బౌలర్‌ దిగ్వేశ్‌ సింగ్‌ మ్యాచ్‌ ఫీజులో యాభై శాతం కోత విధిస్తున్నాం.

మళ్లీ అదే తప్పు
ఆర్టికల్‌ 2.5లోని లెవల్‌ 1 తప్పిదానికి అతడు పాల్పడ్డాడు. ఈ సీజన్‌లో అతడు నిబంధనలు అతిక్రమించడం ఇది రెండోసారి. మంగళవారం పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ దిగ్వేశ్‌ రూల్స్‌ ఉల్లంఘించాడు. 

అప్పుడు ఒక డీమెరిట్‌ పాయింట్‌తో పాటు తాజాగా మరో డీమెరిట్‌ పాయింట్‌ అతడి ఖాతాలో చేరింది’’ అని సదరు ప్రకటనలో పేర్కొంది. అయితే, దిగ్వేశ్‌కు ఫైన్‌ వేయడానికి గల కారణం.. నమన్‌ వికెట్‌ తీసిన తర్వాత.. మరోసారి నోట్‌బుక్‌లో రాస్తున్నట్లుగా సెలబ్రేట్‌ చేసుకోవడం అని తెలుస్తోంది.

నువ్విక మారవా? .. పాపం పంత్‌!
కాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో.. లక్నో జట్టులోని మిగతా బౌలర్లతో పోలిస్తే  దిగ్వేశ్‌ సింగ్‌ పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 21 పరుగులే ఇచ్చి.. నమన్‌ ధీర్‌ రూపంలో కీలక వికెట్‌ తీశాడు. ఈ క్రమంలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్నాడు. కానీ తన అనుచిత ప్రవర్తనతో ఇలా మరోసారి శిక్షను అనుభవించాల్సి వచ్చింది.  

ఈ నేపథ్యంలో నెటిజన్లు దిగ్వేశ్‌పై.. ‘‘మారవా.. నువ్విక మారవా?’’ అంటూ మీమ్స్‌ ట్రోల్స్‌ చేస్తున్నారు. మరోవైపు..బ్యాటర్‌గా విఫలమవుతున్న  పంత్‌కు ఇలా సారథిగానూ ఎదురుదెబ్బ తగలడం పట్ల.. ‘పాపం పంత్‌’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

చదవండి: హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్‌ను వెనక్కి పంపించాం: హార్దిక్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement