
పంచ్‌కుల వేదికగా ప్రపంచ స్థాయి జావెలిన్ మీట్
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పేరుతో మనదేశంలో ఓ అంతర్జాతీయ జావెలిన్ ఈవెంట్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మే 24న హరియాణాలోని పంచ్‌కుల వేదికగా జరగనున్న ఈ టోర్నీకి ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ అని పేరు పెట్టారు. దివంగత మాజీ ఉప ప్రధానమంత్రి దేవీలాల్ స్టేడియంలో ఈ మీట్‌ను నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ జావెలిన్ త్రోయర్లు పాల్గొనే ఈ ఈవెంట్‌కు అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ‘ఎ’ కేటగిరీ హోదాను కేటాయించింది.
ప్రస్తుతానికి ఈ ఈవెంట్‌కు ప్రపంచ అథ్లెటిక్స్ క్యాలెండర్‌లో చోటు దక్కకపోయినా... ప్రతి ఏటా దీన్ని నిర్వహించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ), జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ సంయుక్తంగా ఈ ఈవెంట్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నాయి. నీరజ్ చోప్రా కూడా నిర్వాహక కమిటీలో భాగం పంచుకుంటున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గి కొత్త చరిత్ర సృష్టించిన నీరజ్... 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకంతో మెరిశాడు.
ఈ ఏడాది ఆరంభంలోనే ఈ ఈవెంట్‌కు ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు సెబాస్టియన్ కో ఆమోదం తెలిపారు. భారత్‌లో మెగా టోర్నీలు నిర్వహించే సామర్థ్యాన్ని ఇది ప్రపంచానికి చాటుతుందని పేర్కొన్నారు. ఈ ఈవెంట్ దేశ అథ్లెటిక్స్ ప్రతిష్టను పెంపొందిస్తుందని ఏఎఫ్‌ఐ అధ్యక్షుడు బహదూర్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘నీరజ్ జావెలిన్ శిక్షణ ప్రారంభించిన ప్రాంతంలోనే ఈ టోర్నీ జరగనుంది. నీరజ్ భాగస్వామ్యంతో దేశంలో ఈ ఈవెంట్ నిర్వహించడం భారత అథ్లెటిక్స్‌కు గొప్ప విషయం’ అని బహదూర్ సింగ్ అన్నారు.
హరియాణా, పానిపట్ సమీపంలోని ఖంద్రా గ్రామంలో జన్మించిన నీరజ్ చోప్రా... 2012 నుంచి 2015 వరకు పంచ్‌కులలో జావెలిన్ శిక్షణ పొందాడు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగిన నీరజ్... ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లో దేశానికి స్వర్ణం అందించిన తొలి అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కాడు. ప్రస్తుతం తన వ్యక్తిగత కోచ్ జాన్ జెలెజ్నీ వద్ద శిక్షణ పొందుతున్న నీరజ్... మే 16న జరిగే దోహా డైమండ్ లీగ్‌తో సీజన్ ప్రారంభించే అవకాశాలున్నాయి.