
Photo Courtesy: IPL
Ravindra Jadeja Likely To Be Ruled Out: ఐపీఎల్ 2022 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తాజా మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజా తప్పుకోనున్నాడని తెలుస్తోంది. గాయం కారణంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆడని జడ్డూ.. ప్రస్తుత సీజన్‌లో సీఎస్‌కే ఆడబోయే తదుపరి మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండడని ఓ ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ వెల్లడించింది.
ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ జడ్డూకి ఛాతీపై గాయాలయ్యాయని, అందుకే అతను ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదని, గాయం తీవ్రత తగ్గకపోగా, రెట్టింపు కావడంతో సీఎస్‌కే లీగ్ దశలో ఆడబోయే తదుపరి మూడు మ్యాచ్‌లకు (ముంబై, గుజరాత్, రాజస్థాన్) అతను అందుబాటులో ఉండటం అనుమానమేనని సదరు వెబ్‌సైట్ పేర్కొంది.
కాగా, డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ సీజన్ బరిలోకి దిగిన సీఎస్‌కే.. వరుస పరాజయాలు ఎదుర్కొని ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా చేజార్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత సీజన్‌లో సీఎస్‌కే ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే తదుపరి ఆడబోయే 3 మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.
అంతేకాకుండా ఆర్సీబీ (2), రాజస్థాన్ (3) జట్లు లీగ్ దశలో ఆడబోయే తదుపరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. ఈ సమీకరణలు వర్కౌటైతే తప్ప సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు చేరడం దాదాపుగా అసాధ్యం. కాగా, ప్రస్తుత సీజన్ ప్రారంభానికి ముందు ధోని నుంచి సీఎస్‌కే సారధ్య బాధ్యతలు దక్కించుకున్న జడ్డూ.. జట్టును సమర్ధవంతంగా నడిపించలేక చేతులెత్తేసిన విషయం తెలిసిందే.
చదవండి: సీఎస్‌కే, రవీంద్ర జడేజా మధ్య విబేధాలు.. ఎస్‌ఆర్‌హెచ్ బాటలోనేనా!