
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 2) ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఆర్సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లు చెలరేగడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. ఆ జట్టు 16 ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. లివింగ్‌స్టోన్ (33), టిమ్ డేవిడ్ (6) క్రీజ్‌లో ఉండటంతో ఆర్సీబీ ఇంకా ఆశలు పెట్టుకుంది.
రెండు వరుస విజయాల తర్వాత ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన చేస్తుంది. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. ఆర్సీబీని పేసర్ అర్షద్ ఖాన్ తొలి దెబ్బేశాడు. రెండో ఓవర్‌లోనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (7) ఔట్ చేశాడు. ఆతర్వాత ఆర్సీబీ మాజీ ఆటగాడు సిరాజ్ లైన్‌లోకి వచ్చాడు. సిరాజ్ అతని వరుస ఓవర్లలో పడిక్కల్ (4), సాల్ట్‌ను (14) క్లీన్ బౌల్డ్ చేశాడు.
Mo Siraj 🔥pic.twitter.com/2cbgtJIhNi
— CricTracker (@Cricketracker) April 2, 2025
ఆతర్వాత ఇషాంత్ అద్భుతమైన బంతితో కెప్టెన్ పాటిదార్‌ను (12) ఎల్బీడబ్ల్యూ చేశాడు. లేట్‌గా (11వ ఓవర్) బౌలింగ్‌కు దిగిన సాయికిషోర్ తన రెండో ఓవర్‌లోనే మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన జితేశ్ శర్మను (33) ఔట్ చేశాడు. సాయి కిషోర్ తన మూడో ఓవర్‌లో మరో ఫలితం రాబట్టాడు. ఈసారి కిషోర్ కృనాల్ పాండ్యాను (5) బోల్తా కొట్టించాడు. భారీ హిట్టర్లు లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్ క్రీజ్‌లో ఉండటంతో ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోర్‌పై ఆశలు పెట్టుకుంది.
కాగా, ఈ మ్యాచ్‌లో సిరాజ్ సాల్ట్ వికెట్ తీసిన విధానం అందరినీ ఆకర్శించింది. ఇన్నింగ్స్ 5వ ఓవర్ మూడో బంతికి సాల్ట్ సిరాజ్ బౌలింగ్‌లో 105 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. ఆతర్వాతి బంతికి సిరాజ్ సాల్ట్‌పై తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకున్నాడు. సాల్ట్ వికెట్లు వదిలి మరో భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. సిరాజ్ బంతిని నేరుగా వికెట్లపైకి సంధించి సాల్ట్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
ఈ సీజన్‌లో సిరాజ్ ఇప్పటివరకు తీసిన నాలుగు వికెట్లు క్లీన్ బౌల్డ్‌లే కావడం విశేషం. సిరాజ్ బౌలింగ్‌లో సాల్ట్ కొట్టిన సిక్సర్ ఈ సీజన్‌లో అత్యంత భారీ సిక్సర్‌గా రికార్డైంది. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆటగాడు ట్రవిస్ హెడ్ కూడా 105 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు.