
Photo Courtesy: BCCI
గుజరాత్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ఊహకందని ఐపీఎల్ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2025 సీజన్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్ 2) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ వికెట్ తీసిన ఇషాంత్.. 18 ఏళ్ల తేడాతో ఒకే ఫ్రాంచైజీ కెప్టెన్లను ఔట్ చేసిన అరుదైన ఘనతను సాధించాడు. తొలి ఐపీఎల్ సీజన్‌లో (2008) నాటి ఆర్సీబీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను ఔట్ చేసిన ఇషాంత్.. తాజాగా అదే ఫ్రాంచైజీ ప్రస్తుత కెప్టెన్ రజత్ పాటిదార్‌ను పెవిలియన్‌కు పంపాడు.
ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి రేర్ ఫీట్‌ను ఎవరూ సాధించలేదు. 18 ఏళ్ల తేడాతో ఒకే ఫ్రాంచైజీ కెప్టెన్లను ఔట్ చేసిన తొలి మరియు ఏకైక బౌలర్ ఇషాంత్ శర్మనే. 2008 సీజన్‌లో కేకేఆర్ తరఫున ఆడుతూ తన స్పెల్ తొలి ఓవర్‌లోనే నాటి ఆర్సీబీ కెప్టెన్‌ను ఔట్ చేసిన ఇషాంత్ శర్మ.. ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్‌ను కూడా తన స్పెల్ తొలి ఓవర్‌లోనే పెవిలియన్‌కు పంపాడు.
అప్పుడూ, ఇప్పుడూ ఆర్సీబీ కెప్టెన్లను ఔట్ చేసింది చిన్నస్వామి స్టేడియంలోనే కావడం మరో విశేషం. ఇక్కడ ఒకే ఒక్క తేడా ఏంటంటే.. నాడు తన స్పెల్ తొలి బంతికే ఆర్సీబీ కెప్టెన్‌ను ఔట్ చేసిన ఇషాంత్.. ప్రస్తుత సీజన్‌లో తన స్పెల్ రెండో బంతికి ఆర్సీబీ కెప్టెన్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఆడుతున్న అతి తక్కువ మంది ఆటగాళ్లలో ఇషాంత్ ఒకడు. 36 ఏళ్ల ఈ ఢిల్లీ పేసర్ 2018 సీజన్ మినహాయించి ప్రతి ఐపీఎల్‌లో ఆడాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బౌలర్లు, ఆతర్వాత బ్యాటర్లు చెలరేగడంతో ఆర్సీబీపై గుజరాత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) పోరాడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీసి ఆర్సీబీకి దెబ్బకొట్టాడు. సిరాజ్‌తో పాటు సాయికిషోర్ (2), అర్షద్ ఖాన్ (1), ప్రసిద్ద్ కృష్ణ (1), ఇషాంత్ శర్మ (1) కూడా వికెట్లు తీశారు. సిరాజ్ తన కోటా 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) నిలకడగా ఆడి గుజరాత్‌ను గెలిపించారు.