John Floor: ఆ జంప్‌ విలువ అమూల్యం..! | Women's 200m Final Paris Champions | Sakshi
Sakshi News home page

John Floor: ఆ జంప్‌ విలువ అమూల్యం..!

Published Sun, Sep 29 2024 3:37 AM | Last Updated on Sun, Sep 29 2024 3:37 AM

Women's 200m Final Paris Champions

పదహారేళ్ల వయసు.. కొత్తగా రెక్కలు విప్పుకుంటూ రివ్వున ఎగిరిపోవాలని, ప్రపంచాన్ని చుట్టిరావాలని కోరుకుంటుంది! కానీ ఆ ప్రాయంలోనే జరిగిన ఒక అనూహ్య ఘటన ఆ అమ్మాయి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ గడిపిన ఆ బాలికకు ఆపై నడవడమే అసాధ్యమైంది.  పుట్టుకతో వచ్చిన లోపానికైతే జీవితంలో సన్నద్ధత వేరుగా ఉంటుంది. కానీ ఎదుగుతున్న వయసులో ఎదురైన ఆ పరిస్థితికి ఆమె చలించిపోయింది. పట్టరాని దుఃఖాన్ని అనుభవించింది. అయితే ఆ బాధతోనే కుంగిపోకుండా.. నిలిచి పోరాడాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఆమె క్రీడలను ఎంచుకుంది. ఆ దారిలో తీవ్రంగా శ్రమించి శిఖరానికి చేరింది. ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఆ అథ్లెట్‌ పేరు ఫ్లోర్‌ జాన్‌. నెదర్లండ్స్‌కు చెందిన పారాలింపియన్‌. వరుసగా రెండు పారాలింపిక్స్‌లలో స్వర్ణ పతకాలు సాధించి  సత్తా చాటింది.

ఫ్లోర్‌ జాన్‌ స్వస్థలం నెదర్లండ్స్‌లోని పర్మెరెండ్‌పట్టణం. చిన్నప్పటి నుంచి చదువులో, ఆటల్లో మహా చురుకు. టీనేజ్‌కి వచ్చాక ఆ ఉత్సాహం మరింత ఎక్కువైంది. ఎక్కడ ఎలాంటి పోటీ జరిగినా అక్కడ వాలిపోయేది. ముఖ్యంగా అథ్లెటిక్స్‌లో బహుమతి లేకుండా తిరిగొచ్చేది కాదు. ఆ ఉత్సాహంతోనే దూసుకుపోతూ, తన 17వ పుట్టినరోజు వేడుకలకు సిద్ధమవుతోన్న వేళ.. బ్యాక్టీరియల్‌ బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురైంది. ఆ కారణంగా ఆమె కుడి కాలు, చేతి వేళ్ల ముందు భాగానికి రక్తప్రసరణ ఆగిపోయింది. దాంతో హడావిడిగా ఫ్లోర్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. అసలు అలాంటి రక్త సమస్యతో ఆమె బతకడమే అసాధ్యం అనిపించింది.

కాళ్లను తీసివేసి..
వేర్వేరు శస్త్రచికిత్సల తర్వాత ఎట్టకేలకు డాక్టర్లు ప్రాణాపాయం నుంచి కాపాడగలిగారు. అయితే మరో షాకింగ్‌ విషయంతో వారు ముందుకొచ్చారు.. కుడి కాలును తొలగిస్తేనే ఇన్‌ఫెక్షన్‌ దరి చేరకుండా ఉంటుందని! ఒప్పుకోక తప్పలేదు. మోకాలి కింది భాగం నుంచి కుడి కాలును తీసేశారు. అదే తరహాలో రెండు చేతుల ఎనిమిది వేళ్లను కూడా గోళ్ల భాగం వరకు తొలగించారు. ఆ వయసులో ఇలాంటి పరిస్థితి ఎంత వేదనాభరితమో ఊహించుకోవచ్చు.

ఫ్లోర్‌ పోరాడేందుకు సిద్ధమైంది. రీహాబిలిటేషన్‌ కేంద్రంలో కోలుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కొద్ది రోజులకు కార్బన్‌ ఫైబర్‌తో కృత్రిమ కాలును అమర్చారు. కానీ కొంతకాలానికి అదే ఆమెకు భారంగా మారింది. దానివల్ల తన సహజమైన కాలును కూడా కదపడం కష్టమైపోయింది. ఆ రెండిటినీ బ్యాలెన్స్‌ చేసుకోలేకపోయింది. దాంతో ఈసారి తానే డాక్టర్లను సంప్రదించింది. తన రెండో కాలునూ  తొలగించమని కోరింది. వైద్యులు నిర్ఘాంతపోయినా చివరకు ఒప్పుకోక తప్పలేదు. ఆపరేషన్‌తో ఆ రెండో కాలును కూడా తీసేశాక రెండు బ్లేడ్‌లే ఆమెను నిలబెట్టాయి.

అథ్లెటిక్స్‌లోకి అడుగు పెట్టి..
ఆ ఘటన తర్వాత ఫ్లోర్‌ సమయాన్ని వృథా చేయలేదు. ఏడాదిలోపే డచ్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ పారా అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ప్రతిభాన్వేషణ కార్యక్రమానికి హాజరైంది. అక్కడే ఆమె అథ్లెటిక్స్‌ను ఎంచుకుంది. ఫ్లోర్‌ ప్రతిభ, పట్టుదలను చూసిన కోచ్‌ గైడో బాన్సన్‌ ఆమెకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ముందుగా 100 మీటర్లు, 200 మీటర్ల పరుగుకు మెరుగులు దిద్దుకుంది. జాతీయ స్థాయిలో, యూరోపియన్‌ సర్క్యూట్‌లో ఫ్లోర్‌ వరుస విజయాలు సాధించి ఆపై ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ చాంపియన్‌షిప్‌పై దృష్టిసారించింది.

పారా క్రీడల్లోకి అడుగు పెట్టిన మూడేళ్ల లోపే ఆమె ఖాతాలో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ మెడల్‌ చేరడం విశేషం. 2015లో దోహాలో జరిగిన ఈవెంట్‌లో 200 మీటర్ల పరుగులో కాంస్యం గెలుచుకుంది. 100 మీటర్ల పరుగులో ఆమె 12.78 సెకన్ల టైమింగ్‌తో కొత్త రికార్డు నమోదు చేయడంతో పాటు ర్యాంకింగ్స్‌లో కూడా మూడో స్థానానికి చేరింది. పారా అథ్లెట్లకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు రావడంతో ఫ్లోర్‌ ఆ తర్వాత లాంగ్‌జంప్‌కు మారింది. రెండు కాళ్లూ లేని అథ్లెట్ల కేటగిరీ టి62 లాంగ్‌జంప్‌లో రెండు వరల్డ్‌ రికార్డులు సృష్టించిన ఈ డచ్‌ ప్లేయర్‌ తొలిసారి ఈ విభాగంలో 6 మీటర్ల దూరాన్ని జంప్‌ చేసిన తొలి అథ్లెట్‌గా కూడా నిలిచింది. ఇదే జోరులో లాంగ్‌జంప్‌లోనూ రెండు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ స్వర్ణాలు ఫ్లోర్‌ను వెతుక్కుంటూ వచ్చాయి.

ఒలింపిక్స్‌ పతకాలతో..
లాంగ్‌జంప్‌కు మారక ముందు 2016 రియో ఒలింపిక్స్‌లో 100 మీ., 200 మీ. పరుగులో పాల్గొన్న ఫ్లోర్‌ పతకాలు సాధించడంలో విఫలమైంది. ఆ తర్వాత లాంగ్‌జంప్‌లో వరుసగా మూడు టోర్నీల్లో నాలుగో స్థానానికే పరిమితమైంది. అయితే మెడల్‌ గెలవడమే లక్ష్యంగా 2020 టోక్యో పారాలింపిక్స్‌కు సిద్ధమైంది. ఏడాది పాటు కఠోర సాధన చేసి స్వర్ణంతో తన కలను నిజం చేసుకుంది. గత మూడేళ్లుగా తన ఆటలో అదే పదును కొనసాగించిన ఈ అథ్లెట్‌ 2024 పారిస్‌ పారాలింపిక్స్‌లోనూ తన పతకాన్ని నిలబెట్టుకుంది. వరుసగా రెండో స్వర్ణాన్ని గెలుచుకొని సత్తా చాటింది. కమ్యూనికేషన్‌ సైన్సెస్‌ చదివిన ఫ్లోర్‌ ఇప్పుడు క్రీడాకారిణిగానే కాదు మోటివేషనల్‌ స్పీకర్‌గానూ తనలాంటి ఎంతో మందికి స్ఫూర్తి పంచుతోంది. – మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది 

ఇవి చదవండి: బలవంతంగా ఖాళీ చేయించం.. ఒప్పించి పంపిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement