
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యు ఆపరేషన్ కొనసాగుతోంది. మనుషులకు బదులుగా రోబోలతో మట్టి తవ్వకాలు చేపట్టారు.
సాక్షి, మహబూబ్‌నగర్/నాగర్ కర్నూల్: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యు ఆపరేషన్ కొనసాగుతోంది. మనుషులకు బదులుగా రోబోలతో మట్టి తవ్వకాలు చేపట్టారు. టన్నెల్ లోపల సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అటానమస్ హైడ్రాలిక్ పవర్డు రోబోకు అనుసంధానంగా ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగిస్తున్నారు. 30 HP సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకుతో కూడిన మెషిన్‌ను వినియోగిస్తున్నారు.
దీంతో మట్టిని త్వరగా తొలగించేందుకు, టన్నెల్ లోపల పనులను వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టారు. వాక్యూమ్ ట్యాంక్ ద్వారా వచ్చిన మట్టిని గంటకు 620 క్యూబిక్ మీటర్ల బురదతో కూడిన మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలించే అవకాశం ఉంది. కాగా, ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన కార్మికుల జాడ గుర్తించడానికి రోబో రెస్క్యూ కార్యక్రమాలకు రూ. 4 కోట్ల వ్యయం కానుంది. దానికి సంబంధించిన ఫైల్‌పై మంత్రి ఉత్తమ్ గురువారం సంతకం చేశారు.
టన్నెల్‌లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఏఐ ఆధారిత స్లడ్జ్ రిమూవల్ రోబో మిషనరీ ఇప్పటికే సొరంగంలో పనిచేస్తుండగా, నిన్న (శుక్రవారం) మరో రెండు రోబోలు సొరంగం వద్దకు చేరుకోనున్నాయి. ప్రమాదస్థలంలో కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2, డీ1 పాయింట్ల మధ్య 12 మీటర్ల దూరం ఉంది. ఈ ప్రాంతంలోనే ఉన్న టీబీఎం పైకప్పుగా మెటల్ ప్లాట్‌ఫాం ఉంది. దాని కింద హోలో స్పేస్‌గా ఉన్న ఖాళీ ప్రదేశంలో కార్మికులు ఉండి ఉంటారని భావిస్తున్నారు.
టీబీఎం లోపల ఖాళీ ప్రదేశమంతా మట్టి, బురద, శిథిలాలతో కూరుకొని ఉంది. వాటిని పూర్తిగా తొలగిస్తేనే కార్మికుల జాడ తెలిసే అవకాశముంది. డీ2, డీ1 మధ్య కార్మికులు నడిచేందుకు అవకాశమున్నట్టు భావిస్తున్న చోట ట్రెంచ్‌గా తవ్వకాలు జరుపుతున్నారు. గురువారం మధ్యాహ్నం కడావర్ డాగ్స్‌ను మరోసారి టన్నెల్‌లోకి తీసుకెళ్లారు. మట్టి, బురద తొలగించిన ప్రదేశాల్లో మరోసారి అన్వేషణ చేపట్టారు.
