
మొక్కజొన్నకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,225
చాలా ప్రాంతాల్లో రూ.2 వేలకు కాస్త ఎక్కువగా మాత్రమే చెల్లిస్తున్న వ్యాపారులు
రైతుల ఆందోళనలతో రంగంలోకి ప్రభుత్వం
ఉగాది నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలుకు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మక్కలు పండించిన రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,225 కాగా.. మార్కెట్‌లోకి వచ్చిన పంటకు తొలుత రూ.2,300కు పైగా ధర పలికినప్పటికీ, చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం రూ.2,000కు కాస్త ఎక్కువగా మాత్రమే ధర పలుకుతోంది. జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ తదితర జిల్లాల్లో మక్కలకు బహిరంగ మార్కెట్‌లో గిట్టుబాటు ధర దక్కకపోవడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది.
మార్క్‌ఫెడ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న సేకరించాలని నిర్ణయించింది. ఉగాది తరువాత వీటిని ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. మక్కను సమర్థవంతంగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
22.91 ఎల్‌ఎంటీల దిగుబడి అంచనా
రాష్ట్రంలో ఈసారి మొక్కజొన్న సాగు గతంలో ఎన్నడూ లేనంత గణనీయంగా పెరిగింది. యాసంగిలో సాధారణ మొక్కజొన్న సాగు 5.89 లక్షల ఎకరాలు కాగా, గత సంవత్సరం 6.64 లక్షల ఎకరాల మేర సాగయింది. కానీ ఈసారి దాదాపు 2 లక్షల ఎకరాలు అధికంగా 8.83 లక్షల ఎకరాల మేర సాగయింది. నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో ఈ పంట ఎక్కువగా సాగైంది. దీంతో 22.91 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీల) మేర ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు.
ఇప్పటికే కోతలు మొదలు కాగా, ప్రైవేటు వ్యాపారులు, దళారులు, కోళ్ల పరిశ్రమకు చెందిన వారు కొనుగోళ్లు సాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) దక్కడం లేదు. చాలా జిల్లాల్లో రూ.2,000 నుంచి రూ.2,150 వరకు మాత్రమే ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని జిల్లాల్లో రైతులు ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ ఆందోళనలకు దిగారు.
320 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో మార్క్‌ఫెడ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. మొక్కజొన్న పంట విస్తీర్ణం ఆధారంగా ఆయా జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గత ఏడాది 309 కేంద్రాలు ఏర్పాటు చేయగా, కేవలం 2.67 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. ప్రైవేటు వ్యాపారులు ఎంఎస్‌పీ కన్నా ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయడంతో మార్క్‌ఫెడ్ కేంద్రాలకు మక్కలు రాలేదు.
కానీ ఈసారి పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉండటంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ఎక్కువ మక్కలను సేకరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 320 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా..అత్యధికంగా నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో ఇవి ఏర్పాటు కాబోతున్నాయి.