
విద్యుత్ కాంతుల వెలుగుల్లో పెద్దగట్టు జాతర ప్రాంతం. భారీగా జనసందోహం, చంద్రపట్నం వేస్తున్న దృశ్యం
సూర్యాపేట: దురాజ్‌పల్లి శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరకు మంగళవారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. మూడవ రోజు మంగళవారం యాదవ పూజారులు చంద్రపట్నం వేసి భక్తిశ్రద్ధలతో శ్రీ లింగమంతుల స్వామి, మాణిక్యమ్మల కల్యాణం జరిపించారు.
చంద్రపట్నంపై లింగమంతుల స్వామి వారు ఉన్న పెట్టెను ఉంచి పూజలు చేశారు. చంద్రపట్నం ముందు మెంతబోయిన, మున్న, బైకాను వంశస్తులు బియ్యంతో పోలు పోసి తమలపాకులు, పోకలు, ఖర్జూరాలు ఉంచి స్వామివారి కథలతో కల్యాణ తంతు నిర్వహించారు. జాతరలో నాలుగో రోజు బుధవారం నెలవారం కార్యక్రమం నిర్వహించనున్నారు.