
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి లిస్ట్ విడుదల చేయబోతున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. దాదాపు 40-50 మందితో కూడిన తొలి జాబితా ప్రకటించనున్నారని...ఆ లిస్ట్‌లో తన పేరు ఉంటుందని పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం తనకు మద్దతుగా ఉందని తెలిపారు.
ఈ మేరకు హైదరాబాద్‌లో బుధవారం రాజాసింగ్ మాట్లాడుతూ.. అభ్యర్థుల జాబితా ప్రకటించేలోపు తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయనున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ వైపు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని అన్నారు. తాను స్ఫస్పెన్షన్‌లో ఉన్నప్పుడు అండగా నిలిచిన గోషామహల్ నియోజకవర్గ కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కంటే ఈసారి రెట్టింపు మెజారిటీతో గోషామహల్ నుంచి గెలువబోతున్నట్లు పేర్కొన్నారు.
గోషామహల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేక బయటి నుంచి తెచ్చుకున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీకి అభ్యర్థి ఇంకా దొరకడం లేదని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో భాజపా డబుల్ ఇంజిన్ సర్కారు రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.
చదవండి: దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలివి: రాహుల్ గాంధీ