
వీరికి 25 ఏళ్లు నిండే వరకు లైసెన్సు ఇవ్వరు
ఎంవీ యాక్ట్‌లోని సెక్షన్ 199 (ఎ) వినియోగం
కీలక నిర్ణయం తీసుకున్న సిటీ ట్రాఫిక్ చీఫ్
హైదరాబాద్ నగర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: పద్నాలుగేళ్ల పిల్లాడు పాఠశాలకు ద్విచక్ర వాహనంపై వస్తుంటాడు.. పదహారేళ్ల కుర్రాడు జూనియర్ కాలేజీకి స్పోర్ట్స్ బైక్ తెస్తాడు.. పదిహేడేళ్ల యువకుడు కళాశాలకు హైస్పీడ్ (High Speed) వాహనం లేదా కారులో రాకపోకలు సాగిస్తాడు.. నగరంలో నిత్యం కనిపించే దృశ్యాలివి. ఇలాంటి మైనర్లు నగరంలో అనేక మంది అమాయకులను బలి తీసుకోవడంతో పాటు వాళ్లూ ప్రాణాలు కోల్పోతున్నారు.
మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదని, వాళ్లు వాహనం నడుపకూడదని తల్లిదండ్రులు, కుటుంబీకులు సహా అందరికీ తెలుసు. అయితే ఎవరూ పక్కాగా పట్టించుకోవట్లేదు. ఈ పరిస్థితులన్ని పరిగణనలోకి తీసుకున్న సిటీ ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రైవింగ్ చేస్తూ మైనర్లు చిక్కితే ఆ వాహనం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయనున్నారు. దీనికి సంబంధించిన స్పెషల్ డ్రైవ్ శనివారం నుంచి ప్రారంభమవుతుందని శుక్రవారం ఆయన ప్రకటించారు.
కఠిన చట్టాలు లేకపోవడం వల్లే..
ప్రస్తుతం అమలులో ఉన్న మోటారు వెహికిల్ యాక్ట్ (Motor Vehicles Act) ప్రకారం మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండే అవకాశం లేదు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో మాదిరి ఇక్కడ కఠిన చట్టాలు లేకపోవడంతోనే మైనర్లు వాహనాలపై విజృంభిస్తున్నారు. అక్కడ మైనర్లు డ్రైవింగ్ చేస్తూ వస్తే వారితో పాటు తల్లిదండ్రులకూ జరిమానా విధిస్తారు. ఆ జరిమానాలు భారీ స్థాయిలో ఉండటం, మూడు ఉల్లంఘనలకు మించితే తల్లిదండ్రుల లైసెన్స్ పూర్తిగా రద్దు వంటి కఠిన చర్యలు ఉంటాయి.
ఇక్కడ అంతటి కఠిన చట్టాలు లేకపోయినా.. ఇప్పటి వరకు అధికారులు ఎంవీ యాక్ట్‌లోని సెక్షన్ 180 ప్రకారం ఓ మైనర్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) లేని వ్యక్తి కానీ వాహనం నడిపితే... అతడితో పాటు వారికి వాహనం అందించిన దాని యజమానికీ జరిమానా విధిస్తున్నారు.
ఇక నుంచి ఆ చట్టంలోని 199 (ఎ) సెక్షన్‌ను వినియోగించాలని జోయల్ డెవిస్ (Joel Davis) నిర్ణయించారు. ఈ సెక్షన్ ప్రకారం వాహనం నడుపుతూ చిక్కిన మైనర్‌కు జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) ఏడాది పాటు సస్పెండ్ అవుతుంది. సాధారణంగా 18 ఏళ్లు నిండిన వ్యక్తి మొదట లెర్నింగ్ లైసెన్స్, ఆపై శాశ్వత లైసెన్స్ తీసుకోవచ్చు.
అయితే డ్రైవింగ్ చేస్తూ చిక్కిన మైనర్‌కు మాత్రం 25 ఏళ్ల నిండే వరకు ఈ రెండింటిలో ఏదీ తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎవ్వరూ మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని జోయల్ డెవిస్ కోరుతున్నారు. ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ రోడ్డు ప్రమాదాలు, అందులో మృతుల్ని తగ్గించడంతో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
చదవండి: ఏదో ఒకరోజు వస్తామంటారు.. ఏ రోజు వస్తారో తెలియదు!