
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాజా పరిస్థితులపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. మంత్రుల కమిటీతో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై మీనాక్షి చర్చించారు. ఒకట్రెండు రోజుల్లో హైకమాండ్‌కు మీనాక్షి నివేదిక ఇవ్వనున్నారు.
ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ, హెచ్‌సీయూ భూముల అంశంపై ప్రజాసంఘాలు, పర్యావరణ వేత్తలతో కమిటీ వేశామని తెలిపారు. మంత్రివర్గ కమిటీతో ఇదే అంశం మీద చర్చిస్తున్నామని చెప్పారు. ఏకపక్షంగా కాకుండా అందరి వాదనలు వింటామని.. ఏం చేయాలనే దానిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఎప్పుడు ఎవరితో మాట్లాడాలి అనే వివరాలు ప్రకటిస్తామని ఆమె తెలిపారు. విద్యార్థుల లేఖలపై సమాచారం సేకరిస్తామని.. ప్రతిపక్షాల ఆరోపణలపై వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని మీనాక్షి నటరాజన్ వెల్లడించారు.