
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో నియమ నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అన్ని ఆధారాలతో క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులతో సుప్రీం కోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని కలిశామన్నారు. రైతు ఒక్క చెట్టు కొడితే కేసు నమోదు చేస్తున్నారు.. రైతుకు ఒక చట్టం.. రేవంత్ రెడ్డికి ఒక చట్టమా?’’ అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.
‘‘కంచె చేను మేసినట్టిగా ప్రభుత్వం వేలాది చెట్లు నరికివేసింది. వైల్డ్ లైఫ్ యాక్ట్, వాల్టా యాక్ట్ ఉల్లంఘించి ప్రభుత్వం వ్యవహరించింది. మూడు జింకలు చనిపోయాయి. వన్య ప్రాణుల గూడును చెదరగొట్టారు. జింకల మృతికి కారణమైన అధికారులపైన చర్యలేవీ? పర్యావరణ విధ్వoసం జరిగితే అటవీ అధికారులు నిద్ర పోతున్నారా?. ప్రైవేట్ భూమి అయినా అందులో చెట్లు పెరిగితే అందులో వన్య ప్రాణులు గూడు ఏర్పాటుచేసుకుంటే అది అటవీ భూమిగా పరిగణిస్తారు. 10 హెక్టార్ల కంటే ఎక్కువ భూమి ఉంటే.. అందులో చెట్లు ఉంటే అది అటవీ భూమిగానే పరిగణిస్తారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా కంచ గచ్చిబౌలిలో చెట్లు నాటారు’’ అని హరీష్‌రావు గుర్తు చేశారు.
హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ సెలవు దినాలు చూసుకుని మరి జేసీబీలతో చెట్లు నరికివేశారు. కంచ గచ్చి బౌలి భూములు హెచ్‌సీయూ అధీనంలో ఉందని గతంలోనే ఆర్డీవో, కలెక్టర్ కలెక్టర్ లేఖ రాశారు. సీఎం రేవంత్ ఈ భూమిని మాడ్యూగేట్ చేసి 10 వేల కోట్ల అప్పు తెచ్చారు. అప్పు ఇప్పించిన బ్రోకర్‌కు 169 కోట్ల 83 లక్షలు చెల్లించారు. ఈ భూములను అమ్మి సీఎం రేవంత్ 40 వేల కోట్లు తేవాలని సీఎం రేవంత్ ప్రయత్నం’’ అంటూ హరీష్‌రావు ఆరోపించారు.
సుప్రీoకోర్టు ఆదేశాల ఉల్లంఘన జరుగుతుంది. నిన్న సాయంత్రం టీజీఐఐసీ భూమి అని బోర్టులు ఏర్పాటు చేశారు. కంచ భూముల విధ్వంసంలో పోలీస్ శాఖ పాత్ర కూడా ఉంది. గతంలో కొత్త సచివాలయం నిర్మించే సమయంలో చెట్లు నరకొద్దంటూ గ్రీన్ ట్రిబ్యునల్‌కి వెళ్లిన రేవంత్‌కు ఇన్ని చెట్లు నరకొద్దూ అని తెలియదా?. యూనివర్సిటీ భూములు తమకే చెందాలని విద్యార్థులు అడిగితే వారిపై కేసులు పెట్టారు. ఈ ప్రభుత్వం శాశ్వతo కాదు’’ అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.