
డిజిటల్ అంతరాలు తగ్గుతాయంటున్న భారతీయులు
ఈ సేవలు వెంటనే కావాలంటున్న 91 శాతం మంది
ప్రభుత్వమే చౌకగా అందించాలన్న 39 శాతం మంది
ప్రకృతి విపత్తుల సమయంలో సమస్యలు రావొచ్చని అనుమానం
లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ విప్లవం నడుస్తున్న మనదేశంలో ఇప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ అనేది నిత్యావసరంగా మారిపోయింది. కానీ, కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల విస్తరణ ఇప్పటికీ దుర్లభంగానే ఉన్నది. అయితే, దేశంలో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు ప్రారంభమైతే పరిస్థితి పూర్తిగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సేవలు వెంటనే అందుబాటులోకి రావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది.
స్టార్‌లింక్ ప్రత్యేకతలు
» అంతరిక్షంలోని ఉపగ్రహాల నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ నేరుగా భూమిపై ఉన్న వివిధ డివైజ్‌లకు చేరుతుంది.
» ఈ కనెక్షన్‌కు చందా కేబుల్ సర్వీస్ డైరెక్ట్ టు హోం (డీటీహెచ్)కు కట్టిన మాదిరిగా ఉంటుంది.
» ఇంటర్నెట్ కోసం ఈ కంపెనీ పోర్టబుల్ శాటిలైట్ డిష్ కిట్‌ను అందజేస్తుంది. దీనిని ఇంటిపై శాశ్వత పద్ధతిలో బిగించవచ్చు.
» ముందుగా ఇళ్లలో వైఫై రూటర్ ఆధారిత వైర్ కనెక్షన్ కలిగి ఉండాలి. దీనిని ఆ తర్వాత వైర్‌లెస్ పద్ధతిలో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లు, ఇతర ఇంటర్నె ట్ ఆఫ్ థింగ్స్ గాడ్జెస్‌కు జతచేయొచ్చు.
» ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సర్వీస్ అందించగలదు. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు.
స్టార్‌లింక్‌తో జట్టు
దేశంలోని రెండు పెద్ద టెలికం సంస్థలు భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో.. భారత్‌లో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవల కోసం అమెరికన్ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన ‘స్టార్‌లింక్’తో ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించాయి. 2021లో అమెరికా, కెనడాల్లో ఈ సేవలను ప్రారంభించిన స్టార్‌లింక్.. ప్రస్తుతం వందకు పైగా దేశాలకు విస్తరించింది.
2022లోనే భారత్‌లోనూ 99 యూఎస్ డాలర్లకు ప్రీ ఆర్డర్‌ను (అప్పట్లో ఫారెక్స్ ధరను బట్టి రూ.7,201) ప్రారంభించింది. అయితే, టెలికం నియంత్రణ ఏజెన్సీల నుంచి తగిన అనుమతులు పొందలేకపోవడంతో స్టార్‌లింక్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు.
లోకల్ సర్కిల్స్ సర్వేలోని ముఖ్యాంశాలు
» శాటిలైట్ ఇంటర్నెట్ సేవలపై లోకల్ సర్కిల్స్ సంస్థ 323 జిల్లాల్లో 22,000 మంది అభిప్రాయాలు తీసుకుంది. వీరిలో 42 శాతం మంది ప్రథమ శ్రేణి నగరాల నుంచి, 30 శాతం ద్వితీయ శ్రేణి నగరాల నుంచి, మిగిలిన 28 శాతం టైర్–3, టైర్–4 గ్రామీణ ప్రాంతాల వారు ఉన్నారు.
» సర్వేలో పాల్గొన్నవారిలో 91 శాతం మంది ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వస్తే.. కనెక్టివిటీ పెరిగి మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లోనూ డిజిటల్ విప్లవం సాధ్యమవుతందని విశ్వాసం వ్యక్తంచేశారు.
» 50 శాతం మంది ప్రైవేట్ కంపెనీలు నేరుగా వినియోగదారులకు ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు అందించాలని అభిప్రాయపడ్డారు. 39 శాతం మంది ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా లేదా తక్కువ ధరకు ఈ సేవలను అందించాలని సూచించారు.
» స్టార్‌లింక్ రాకతో హైస్పీడ్, తక్కువ జాప్యంతో (లో లాటెన్సీ) ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని నమ్ముతున్నారు.
» ఉపగ్రహ ఇంటర్నెట్‌ను అవసరమైన మౌలిక సదుపాయంగా గుర్తిస్తే, ఇది డిజిటల్ ఇండియాకు దన్నుగా నిలిచి ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
» పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న డిజిటల్ అంతరాలను ఇది తగ్గిస్తుందని తెలిపారు.
» ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసి ముందుకు వస్తే కనెక్టివిటీ విస్తరణలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పేర్కొన్నారు.
» అయితే భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో డీటీహెచ్ మాదిరిగానే ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడవచ్చని కొందరు అనుమానం వ్యక్తంచేశారు.
» స్టార్‌లింగ్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌ల విషయంలో వినియోగదారుల వ్యక్తిగత గోప్యతపై స్పష్టత లేదని కొందరు తెలిపారు.
2030 నాటికి మన వాటి 1.9 బిలియన్ డాలర్లు
ప్రపంచ ఉపగ్రహ ఇంటర్నెట్ మార్కెట్ పరిమాణం 2022లో 3 బిలియన్ డాలర్లు. ఇందులో భారత్ వాటా 3 శాతం మాత్రమేనని గతంలో విడుదలైన డెలాయిట్ ఇండియా నివేదిక తెలిపింది. 2030 నాటికి భారత ఉపగ్రహ బ్రాడ్‌బాండ్ మార్కెట్ 1.9 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశముందని అంచనా వేసింది.