సామాన్యులకు స్టార్‌‘లింక్‌’ అయ్యేనా! | High speed internet even in remote and rural areas | Sakshi
Sakshi News home page

సామాన్యులకు స్టార్‌‘లింక్‌’ అయ్యేనా!

Published Thu, Mar 13 2025 4:24 AM | Last Updated on Thu, Mar 13 2025 4:24 AM

High speed internet even in remote and rural areas

మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లోనూ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ 

విదేశాల్లో ఇప్పటికే అందుబాటులో.. ఖరీదూ ఎక్కువే.. 

మన దేశంలో చవక ధరలో తెస్తామంటున్న టెలికం కంపెనీలు 

తొలుత వ్యాపార సంస్థలకు అందుబాటులో.. తర్వాత సాధారణ జనానికి..  

సాక్షి, హైదరాబాద్‌:  కొండలు, గుట్టలు, అడవులతో కూడిన మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా నేరుగా శాటిలైట్‌ ద్వారా ఇంటర్నెట్‌ అందించే అంశం ఇప్పుడు మన దేశంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇక్కడ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ అందించేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కంపెనీ స్టార్‌లింక్‌తో చేతులు కలిపినట్టు టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ వెల్లడించిన మరుసటి రోజే.. అనూహ్యంగా రిలయన్స్‌ జియో సైతం తెరపైకి వచ్చింది.

తాము కూడా స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం చేసుకున్నట్టు బుధవారం ప్రకటించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సేవలు అందుబాటులోకి రావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి స్టార్‌లింక్‌ ఆమోదం పొందాల్సి ఉందని ఎయిర్‌టెల్, జియో స్పష్టం చేశాయి. భారతీ ఎయిర్‌టెల్‌ ఇప్పటికే గుజరాత్, తమిళనాడులలో బేస్‌ స్టేషన్లు ఏర్పాటు చేసి శాటిలైట్‌ టెలికం సేవల కోసం రెడీ అవుతోంది. అటు జియో కూడా దేశంలో రెండు ప్రాంతాల్లో బేస్‌ స్టేషన్స్‌ నెలకొల్పి పోటీకి సై అంటోంది.  

మరింత సమయం తప్పదు 
దేశంలో శాటిలైట్‌ టెలికం సేవలు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా నిబంధనలను ప్రకటించలేదు. పైగా టెలికం శాఖ, ట్రాయ్, కేంద్ర హోం శాఖ నుంచి స్టార్‌లింక్‌ అనుమతులు పొందాల్సి ఉంది. ఈ సేవలకు సంబంధించి ఉపగ్రహ స్పెక్ట్రమ్‌ను నేరుగా సంస్థలకు కేటాయించడానికి బదులుగా.. వే­లం వేయాలని జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడి­యా పట్టుబడుతున్నాయి.

మరోవైపు అంతర్జాతీయం­గా వివిధ దేశాల్లో ఉన్నట్టుగా అడ్మినిస్ట్రేటివ్‌ కేటా­యింపుల విధానం అమలు చేయాలని స్టార్‌లింక్, ప్రాజెక్ట్‌ కైపర్‌ వంటివి కోరుతున్నాయి. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అన్నీ అనుకూలించి శాటిలై­ట్‌ టెలికం సేవలు అందుబాటులోకి వస్తే.. ఈ విభాగంలోనూ టారిఫ్‌ వార్‌ ఖాయంగా కనిపిస్తోంది. 

తొలుత వ్యాపార, వాణిజ్య కస్టమర్లకు.. 
భారత్‌లో శాటిలైట్‌ టెలికం, ఇంటర్నెట్‌ చార్జీలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తి రేపుతోంది. స్టార్‌లింక్‌ గేర్‌ (శాటిలైట్‌ ఇంటర్నెట్‌ అందుకోవడానికి కావాల్సిన పరికరాలు) ధర కూడా వెల్లడి కావాల్సి ఉంది. భారత్‌లో ప్రస్తుతమున్న సంప్రదాయ టెలికం చార్జీలతో పోలిస్తే ఇతర దేశాల్లో స్టార్‌లింక్‌ చార్జీలు ఎక్కువగా ఉన్నాయి. 

కానీ భారత మార్కెట్‌కు తగ్గట్టుగా పోటీ ధరలో చార్జీలు అమలు చేసే అవకాశం ఉందని దిగ్గజ టెలికం సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు. తొలుత వ్యాపార, వాణిజ్య కస్టమర్ల కోసం సేవలు ప్రారంభం అవుతాయని చెప్పారు. సాధారణ కస్టమర్లకు శాటిలైట్‌ టెలికం సేవలు చేరడానికి చాలా కాలం పడుతుందన్నారు.  

విదేశాల్లో చార్జీలు ఇలా.. 
స్టార్‌లింక్‌ యూఎస్‌ఏలో రెసిడెన్షియల్‌ విభాగంలో నెలకు రూ.6,976 నుంచి ప్లాన్లు అందిస్తోంది. పరికరాల కోసం ఒకసారి చెల్లించాల్సిన సొమ్ము అదనం. స్టాండర్డ్‌ ఎక్విప్‌మెంట్‌ కిట్‌ ధర రూ.30,443గా ఉంది. 

» ఇక మొబైల్‌ సేవలు కావాల్సినవారు నెలకు కనీసం రూ.4,360 చెల్లించాల్సి ఉంటుంది. డేటా అపరిమితంగా అందుకోవచ్చు. 220 ఎంబీపీఎస్‌ వరకు స్పీడ్‌ ఆఫర్‌ చేస్తోంది. 
» రెసిడెన్షియల్‌ లైట్, రెసిడెన్షియల్‌ ప్లాన్లలో కూడా వినియోగదారులు అపరిమిత డేటాను అందుకోవచ్చు. 
» రోమింగ్‌ ప్లాన్‌ తీసుకునే వినియోగదారులు దేశవ్యాప్తంగా, ప్రయాణంలో, అంతర్జాతీయ ప్రయాణ సమయంలో కూడా వినియోగం, తీర ప్రాంతాల్లో కవరేజీ పొందవచ్చు. బిజినెస్‌ విభాగంలో నెలకు రూ.12,208 నుంచి రూ.4,36,000 వరకు ప్లాన్స్‌ ఉన్నాయి. 
» ఇక భూటాన్‌లో రెసిడెన్షియల్‌ లైట్‌ ప్లాన్‌ కింద స్టార్‌లింక్‌ నెలకు రూ.3,000 చార్జీ చేస్తోంది. ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్‌ 23–100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఆఫర్‌ చేస్తోంది. యూరప్‌లో స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ వేగం ఊక్లా నివేదిక ప్రకారం హంగరీలో అక్టోబర్‌–డిసెంబర్‌ కాలంలో గరిష్టంగా 135.11, కనిష్టంగా సైప్రస్‌లో 36.52 ఎంబీపీఎస్‌ నమోదైంది.  

మనదగ్గర చాలా చవక.. 
శాటిలైట్‌ ఇంటర్నెట్‌ చార్జీలతో పోలిస్తే మన దేశంలో మొబైల్, బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ చాలా చవక. అటూ ఇటూగా రూ.20 చెల్లిస్తే ఒక జీబీ డేటా అందుకోవచ్చు. సుమారు రూ.50 నుంచి అన్‌లిమిటెడ్‌ ప్యాక్స్‌ లభిస్తాయి. హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లు నెలకు కనీసం రూ.400 నుంచి ఉన్నాయి. 

హై–ఎండ్‌ ప్లాన్‌ అయితే నెలకు రూ.4,000 వరకు ఉంది. దీనిలో 10 జీబీపీఎస్‌ వరకు వేగం, అన్ని ఓటీటీ యాప్స్‌ సబ్‌్రస్కిప్షన్‌ కూడా అందుతుంది. రూటర్‌కు అయ్యే వ్యయమూ తక్కువే. శాటిలైట్‌ టెలికం కేవలం ఇంటర్నెట్‌కే పరిమితం. కాల్స్‌ చేయాలంటే ఓటీటీ యాప్స్‌పైన ఆధారపడాల్సిందే.

స్టార్‌ లింక్‌ ప్రత్యేకతలు ఇవీ.. 
కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలు: సుమారు 7,000 
శాటిలైట్‌ ఇంటర్నెట్‌ అందిస్తున్న దేశాలు: 100కుపైగా 
వినియోగదారులు: సుమారు 50 లక్షలు (2024 డిసెంబర్‌ చివరినాటికి) అమెరికాలో దిగ్గజ బ్రాండ్‌బ్యాండ్‌ కంపెనీలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పోటీనిస్తోంది. 
రూరల్‌ కనెక్టివిటీ: మారుమూల ప్రాంతాలు, పల్లెలకు వేగంగా ఇంటర్నెట్‌ అందిస్తోంది. విద్య, ఆరోగ్య సేవలు, ఈ–కామర్స్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది.
భారత్‌లో పోటీ: దేశంలో 94.5 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులు ఉన్నారు. అందులో 90.4 కోట్ల మంది వైర్‌లెస్‌/మొబైల్‌ ఇంటర్నెట్‌ను వాడుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement