శాటిలైట్‌ టెలికం.. మన దేశంలోకి వెల్‌కం! | Satellite Telecom: Elon Musk Starlink set to launch Satellite Internet in India | Sakshi
Sakshi News home page

శాటిలైట్‌ టెలికం.. మన దేశంలోకి వెల్‌కం!

Published Sun, Feb 16 2025 2:10 AM | Last Updated on Sun, Feb 16 2025 5:28 AM

Satellite Telecom: Elon Musk Starlink set to launch Satellite Internet in India

కొండలు, గుట్టలు, అడవులు.. ఎక్కడైనా సిగ్నల్‌ పొందే వెసులుబాటు 

త్వరలో భారత్‌లో అందుబాటులోకి.. ఇప్పటికే రెండు సంస్థలకు లైసెన్స్‌ 

మరో 2 కంపెనీలు వెయిటింగ్‌.. సాధారణ సేవలతో పోలిస్తే ఖరీదు ఎక్కువే 

ప్రస్తుతానికి బిజినెస్‌ టు బిజినెస్‌కు మాత్రమే అనుమతి

మనం ఇప్పుడు జేబులో సెల్‌ఫోన్‌ పెట్టుకుని గడిపేస్తున్నాం. ఎక్కడున్నా కాల్స్, మెసేజీలు పంపడం, అందుకోవడం దగ్గరి నుంచి ఇంటర్నెట్‌ దాకా యథాలాపంగా వాడేస్తున్నాం. కానీ అడవులు, ఎడారులు, మారుమూల ప్రాంతాల్లో మొబైల్‌ సేవలు సరిగా అందవు. అలాంటి చోట మంచి పరిష్కారం శాటిలైట్‌ టెలికం సేవలు. ఇక్కడా, అక్కడా అని లేకుండా ఎక్కడైనా సరే... సిగ్నల్స్‌ అందుకోగలగడం దాని ప్రత్యేకత.

త్వరలోనే ఈ శాటిలైట్‌ టెలికం సేవలు మన దేశంలో అందుబాటులోకి రానున్నాయి. భారత టెలికం రంగం మరో మెట్టు ఎక్కబోతోంది. అయితే శాటిలైట్‌ ఆధారిత టెలికం సేవలు సామాన్యుడికి చేరడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ప్రారంభదశలోనే ఉండటం, వీటి ధరలు, ఈ సాంకేతికతను వినియోగించగల హ్యాండ్‌ సెట్ల ధరలు ఎక్కువగా ఉండటం దీనికి కారణమని పేర్కొంటున్నారు.    – నూగూరి మహేందర్, సాక్షి ప్రతినిధి

కాస్త ఖరీదైనవే.. 
శాట్‌కామ్‌ సేవలు ఖరీదైనవే. దేశంలో టెల్కోల హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లు నెలకు కనీసం రూ.400 నుంచి రూ.4,000 వరకు ఉంటాయి. అవసరాన్ని, తాహతును బట్టి ఎంచుకోవచ్చు. కానీ ఉపగ్రహ టెలికం, ఇంటర్నెట్‌ వ్యయాలు అంతకు 7 నుంచి 18 రెట్లు ఖరీదైనవని జేఎం ఫైనాన్షియల్స్‌ సంస్థ వెల్లడించింది. సైన్యం, నావికా దళం, మారుమూల ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగించే సంస్థలకు శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ ఉపయోగకరం. ఆతిథ్య రంగంలో లగ్జరీ హోటళ్లు, కొండ ప్రాంతాల్లో రిసార్టులు ఏర్పాటు చేసే సంస్థలు తమ వినియోగదారుల కోసం శాటిలైట్‌ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది.

ఈ క్రమంలో తొలుత బిజినెస్‌ టు బిజినెస్‌ విభాగంలో శాటిలైట్‌ టెలికం సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రముఖ టెలికం కంపెనీ ప్రతినిధి ఒకరు ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’కు తెలిపారు. ఎలాన్‌ మస్క్ కు చెందిన స్టార్‌ లింక్‌ కంపెనీ కెన్యాలో ఒక్కో యాంటెన్నాకు నెలకు 30 డాలర్లు వసూలు చేస్తోందని.. ఇతర దేశాల్లో అది 100 డాలర్లు, అంతకంటే అధికంగా ఉందని చెప్పారు. మన దేశంలో ప్రవేశపెడితే ధర ఎంతనేది తెలుస్తుందని పేర్కొన్నారు. ఇక ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ వేదికగా యూటెల్‌శాట్‌ వన్‌వెబ్‌ తన సత్తాను ప్రదర్శించిందని.. ఆ సంస్థతో చేతులు కలిపేందుకు భారత సైన్యం ముందుకు వచ్చిందని వెల్లడించారు.

రెండు సంస్థలకు లైసెన్స్‌..  మరొకటి వెయిటింగ్‌.. 
శాట్‌కామ్‌ సేవలు భారత్‌లో అందించాలంటే కంపెనీలకు ‘గ్లోబల్‌ మొబైల్‌ పర్సనల్‌ కమ్యూనికేషన్‌ బై శాటిలైట్‌ (జీఎంపీసీఎస్‌)’లైసెన్స్, ‘ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌–ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌స్పేస్‌)’లైసెన్స్‌ ఉండటం తప్పనిసరి. ప్రస్తుతం కేంద్రం నుంచి వన్‌వెబ్‌ ఇండియా కమ్యూనికేషన్స్, జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ సంస్థలు శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ లైసెన్స్‌ దక్కించుకున్నాయి. వన్‌వెబ్‌ ఇండియా.. యూటెల్‌శాట్‌ భాగస్వామ్యంతో భారతీ ఎయిర్‌టెల్‌ ప్రమోట్‌ చేయగా... లక్సెంబర్గ్‌కు చెందిన ఎస్‌ఈఎస్‌ సంస్థతో రిలయన్స్‌ జియో చేతులు కలిపి.. జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ను ప్రమోట్‌ చేస్తోంది.

ఇప్పటికే పలు దేశాల్లో సేవలు అందిస్తున్న యూటెల్‌శాట్‌ వన్‌వెబ్‌ గుజరాత్, తమిళనాడులో బేస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసిందని, అనుమతులు రాగానే సేవలు ప్రారంభిస్తామని భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వైస్‌ చైర్మన్‌ రాజన్‌ భారతీ మిత్తల్‌ ఇటీవలే ప్రకటించారు. ఇక జియో–ఎస్‌ఈఎస్‌కు సైతం భారత్‌లో రెండు ప్రాంతాల్లో బేస్‌ స్టేషన్స్‌ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో టాప్‌లో ఉన్న స్టార్‌లింక్‌ సంస్థ 100కుపైగా దేశాల్లో ఇప్పటికే సర్విసులు ప్రారంభించింది. భారత్‌లో లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. అమెజాన్‌కు చెందిన కైపర్‌ కూడా ఇక్కడ అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి.

ఎవరి సామర్థ్యం వారిదే.. 
తమకు భూమిచుట్టూ కక్ష్యలో 6,900కుపైగా ఇంటర్నెట్‌ ఉపగ్రహాలు ఉన్నాయని స్టార్‌లింక్‌ చెబుతోంది. యూటెల్‌శాట్‌ వన్‌వెబ్‌ ఖాతాలోని ఉపగ్రహాల సంఖ్య 635కుపై మాటే. ఇక ప్రపంచ జనాభాలో 99 శాతం మందికి వీడియో, డేటా సేవలను అందించగలిగేలా రెండు వేర్వేరు కక్ష్యలలో పనిచేస్తున్న దాదాపు 70 ఉపగ్రహాలను కలిగి ఉన్నట్టు ఎస్‌ఈఎస్‌ సంస్థ తెలిపింది. 100 కోట్లకుపైగా టీవీ వ్యూయర్స్, టాప్‌–10 గ్లోబల్‌ టెలికం కంపెనీల్లో ఏడింటికి, ప్రపంచంలోని ఆరు ప్రధాన క్రూజ్‌ లైన్స్‌లో ఐదింటికి తాము సేవలు అందిస్తున్నట్టు వెల్లడించింది.

వైఫై తరహాలో సేవలు.. 
శాటిలైట్‌ నుంచి సిగ్నల్స్‌ అందుకోవడానికి చిన్న యాంటెన్నా ఏర్పాటు చేస్తారు. ఆ యాంటెన్నా వైఫై జోన్‌ మాదిరిగా పనిచేస్తుంది. దాని ద్వారా కాల్స్, ఎస్సెమ్మెస్‌లు చేసుకోవచ్చు. సాధారణ ఫోన్లు వాడేవారి నుంచి కాల్స్‌ అందుకోవాలంటే.. సంబంధిత సంస్థకు బేస్‌స్టేషన్‌ ఉండాలి. సాధారణ కస్టమర్‌ కాల్‌ చేస్తే ఆ బేస్‌స్టేషన్‌ ద్వారా శాటిలైట్‌కు, అక్కడి నుంచి యాంటెన్నా పరిధిలో ఉన్న వినియోగదారులకు కనెక్ట్‌ అవుతుంది. సాధారణ కాల్స్, సందేశాలకు మాత్రమే శాటిలైట్‌ ఆధారిత టెలికం సేవలు ఉపయుక్తం. 4జీ, కేబుల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ మాదిరి వేగంగా డేటాను అందుకునే అవకాశం తక్కువ.

ప్రభుత్వమే స్పెక్ట్రమ్‌ కేటాయించి.. 
శాటిలైట్‌ టెలికం బేస్‌స్టేషన్‌ పనిచేయాలంటే ప్రత్యేక స్పెక్ట్రమ్‌ (తరంగ దైర్ఘ్యం) కేటాయింపులు అవసరం. లైసెన్స్‌ పొందిన కంపెనీలకు ప్రభుత్వం ఇంకా దీనిని కేటాయించలేదు. శాటిలైట్‌ సేవల కోసం ప్రభుత్వం స్పెక్ట్రమ్‌ కేటాయిస్తుంది (అడ్మినిస్ట్రేటివ్‌ అలకేషన్‌). దీనిని అన్ని కంపెనీలు పంచుకోవాల్సి ఉంటుంది. అలాకాకుండా రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా కంపెనీలు స్పెక్ట్రమ్‌ వేలం వేయాలని ప్రతిపాదించాయి. విదేశీ సంస్థలు స్టార్‌లింక్, ప్రాజెక్ట్‌ కైపర్‌లు మాత్రం అడ్మినిస్ట్రేటివ్ కేటాయింపుల విధానం అమలు చేయాలని కోరాయి. బ్రెజిల్‌ గతంలో స్పెక్ట్రమ్‌ వేలం వేసి విఫలమై ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ మార్గాన్ని ఎంచుకుందని వివరిస్తున్నాయి. దీనితో మన దేశం కూడా అడ్మినిస్ట్రేటివ్ మార్గం అనుసరించాలని నిర్ణయించింది.

కొన్ని ఫోన్‌ మోడల్స్‌లోనే అందుబాటులో.. 
శాటిలైట్‌ ఆధారిత టెలికం సేవలు అందుకోవాలంటే మొబైల్‌ ఫోన్‌లో ప్రత్యేక ఏర్పాటు తప్పనిసరి. యాపి ల్‌ తయారీ ఐఫోన్‌–14, ఆ తర్వాతి మోడళ్లు శాటిలైట్‌ కనెక్టివిటీని సపోర్ట్‌ చేస్తాయి. గూగుల్‌ పిక్సెల్‌ 9 సిరీస్, సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌25 ఈ వరుసలో ఉన్నాయి. ఇవేగాక ప్రత్యేక శాటిలైట్‌ ఫోన్స్‌ కూడా లభిస్తాయి. ఇరీడియం 9555, ఇన్‌మాశాట్‌ ఐశా ట్‌ ఫోన్‌ 2, థురాయో ఎక్స్‌టీ–లైట్, గ్లోబల్‌ స్టార్‌ జీఎస్‌పీ–1700 మోడళ్లను ఎయిర్‌టెల్‌ విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.70 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉన్నాయి. పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్ల ధర రూ.1,500 నుంచి ప్రారంభమవుతుంది. పరిమితి దాటితే ప్రతి నిమిషానికి అదనంగా చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

శాట్‌కామ్‌ అంటే.. 
శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు (శాట్‌కామ్‌) డేటా, వాయిస్‌ను ప్రసారానికి, స్వీకరణకు ఉపగ్రహాలపై ఆధారపడతాయి. అదే మామూలు టెలికం సేవలు ఫైబర్‌ ఆప్టిక్స్, ఇతర కేబుళ్లపై ఆధారపడతాయి. శాట్‌కామ్‌ సేవలకు ఇటువంటి మౌలిక సదుపాయాల అవసరం లేదు. భారత్‌లో సాధారణ నెట్‌వర్క్‌ 98 శాతం భూ భాగంలో విస్తరించి ఉంది. అయితే ఈ సంప్రదాయ నెట్‌వర్క్‌లను ఏర్పా టు చేయడం ఆర్థికంగా, లాభపరంగా సాధ్యంకాని కొండలు, గుట్టలు, అడవులు, మారుమూల ప్రాంతాల్లో శాట్‌కామ్‌ సేవలు ప్రయోజనకరంగా ఉంటాయి. అత్యవసర పరిస్థితులు, తీవ్ర వాతావరణ పరిస్థితులలో కూడా ఇవి పనిచేయగలవు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement