Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Naidu govt Scam in liquor shops, Belt shops1
ఇంటింటా మద్యం.. ఇదే బాబు విధానం

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో, ప్రతి ఊళ్లో, కుగ్రామంలో సైతం మద్యం షాపులు వెలిశాయి. వీధి వీధినా కిరాణా కొట్లతో పోటీ పడుతూ బెల్ట్‌ షాపులు పుట్టుకొచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లైసెన్స్‌ ఇచ్చిన మద్యం షాపులు 3,396 మాత్రమే ఉండగా.. వాటికి అనుబంధంగా కూటమి నేతల కనుసన్నల్లో అనధికారికంగా ఏర్పాటైన బెల్ట్‌షాపులు గత బాబు పాలనలో ఉన్న 43 వేలకు మించి ఉండటం విస్తుగొలుపుతోంది. తద్వారా కింది స్థాయిలో ఎమ్మెల్యే మొదలు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు మద్యం విధానాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ‘నీకింత.. నాకింత’ అంటూ పంచుకుతింటున్నారని స్పష్టమవుతోంది. మద్యం షాపుల కోసం ఇతరులెవ్వరూ దరఖాస్తు చేసుకోనివ్వకుండా ఎక్కడి­కక్కడ బెదిరించారు. ఒకవేళ లాటరీలో ఇతరులెవరికైనా దక్కినా బలవంతంగా లాగేసుకున్నారు. పోలీసులను అడ్డుపెట్టు­కుని పంచాయితీలు చేశారు. ఇంతటితో ఆగకుండా ఈ షాపులకు అనుబంధంగా సగటున ఒక్కో దుకాణానికి 10–15 బెల్ట్‌ షాపులను అనుచరులతో ఏర్పాటు చేయించారు. వాటి కోసం పోలీసుల సమక్షంలోనే వేలం పాటలు నిర్వహించారు. ఇలా ఒక్కో బెల్ట్‌ షాపునకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారు. పోటీ ఎక్కువగా ఉన్న చోట 20 లక్షల వరకు దండుకున్నారు. క్వార్టర్‌ బాటిల్‌పై ఎమ్మార్పి కంటే అదనంగా రూ.20 నుంచి 30 వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.వెరసి వేళాపాళా లేకుండా రాష్ట్రంలో ఎక్క­డైనా సరే మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది. ఫలితంగా ప్రజారోగ్యం ప్రమాదంలో పడిపోయింది. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పచ్చటి గ్రామాల్లో గొడవలు, హత్యాయ­త్నాలు, హత్యలు జరిగిపోతున్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. పేదల కుటుంబ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడిపోయింది. ఇదంతా కళ్లెదుటే కనిపిస్తున్నా.. ‘తాగండి.. తూగండి’ అంటూ ఇంటింటా మద్యం వరద పారించడమే తమ విధానం అన్నట్లు ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు.అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఓబగానిపల్లికి చెందిన రాజన్న (29) మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానుకోవాలని కుటుంబ సభ్యులు ఆవేదన చెందడంతో జనవరి 29న రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం కొనతట్టుపల్లికి చెందిన మహబూబ్‌ బాషా (32) మితిమీరి మద్యం తాగి.. స్పృహ కోల్పోయి గత అక్టోబర్‌ 17న మరణించాడు. ఇతడి మృతితో అతని భార్య, ఇద్దరు పిల్లలు దిక్కులేని వాళ్లయ్యారు. ఇలాంటి దీన గాధలు ఊరూరా కనిపిస్తున్నాయి.పర్మిట్‌ రూమ్‌లతో పని లేకుండానే బార్లను తలపించేలా సిట్టింగ్, చికెన్‌ చీకులు, సోడాలు, ఆమ్లెట్లు, సిగిరెట్ల విక్రయాలు అడ్డు అదుపు లేకుండా జరిగిపోతున్నాయి. వాట్సాప్‌ ద్వారా అడ్రస్‌ పెట్టి డబ్బులు ఆన్‌లైన్‌లో చెల్లిస్తే ప్రత్యేకంగా డోర్‌ డెలివరీ సౌకర్యం కూడా కల్పించారు.ఆ వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కొన్ని మద్యం షాపుల్లో థాయ్‌లాండ్, శ్రీలంక, బ్యాంకాక్, మారిషస్‌ టూర్లు.. అంటూ లక్కీ డిప్‌ పెడుతుండటం శోచనీయం.ఇది నెల్లూరు నగరంలోని వనంతోపు సెంటర్‌లో మద్యం దుకాణం. వైన్‌ షాపు పక్కనే కూల్‌డ్రింక్స్‌ షాపు పేరుతో బెల్టు దుకాణం ఏర్పాటు చేశారు. అక్కడ ఎనీటైం మద్యం అందుబాటులో ఉంచారు. బెల్టు దుకాణంలో మాత్రం బాటిల్‌పై అదనంగా రూ.20 వరకు వసూలు చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతోంది. కానీ.. అధికారులకు మాత్రం కన్పించదు.సాక్షి, అమరావతి/ సాక్షి, నెట్‌వర్క్‌: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఊరూ.. వాడా.. మద్యం ఏరులై పారుతోంది. ఆదాయమే తప్ప సామాజిక బాధ్యతను పట్టించుకోని ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. 2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేసిన చంద్రబాబు మద్యం ధరలు తగ్గిస్తానని, రూ.99కే చీప్‌ లిక్కర్‌ ఇస్తానని హామీలు గుప్పించారు. అ«ధికారంలోకి వచ్చాక మద్యం బ్రాండ్ల రేట్లు తగ్గించకపోగా మరింత పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలతో ఎక్కడికక్కడ సిండికేట్‌లు ఏర్పాట­య్యాయి. దుకాణాలకు దరఖాస్తు చేయడం మొదలు బెల్ట్‌ షాపుల ఏర్పాటు వరకు అడ్డగోలుగా అక్రమార్జనకు తెరతీశారు. మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ఎమ్మెల్యే మొదలు సీఎం వరకు నీకింత.. నా కింత అంటూ దండుకుంటున్నారు. ఇందులో భాగంగా దుకా­ణాల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియలో టీడీపీ సిండికేట్‌ కుట్రలకు పాల్పడింది. అడిగిన మేరకు కమీషన్‌ లేదా ఉచిత వాటా ఇస్తారా.. లేక దుకాణాలు వదలుకుంటారో తేల్చుకోండని కూటమి ప్రజాప్రతి­నిధులు హుకుం జారీ చేశారు. మద్యం దుకాణాల లైసెన్సులను ఏకపక్షంగా దక్కించుకునేందుకు బరితెగించి బెదిరింపులకు దిగారు. చాలా చోట్ల టీడీపీ సిండికేట్‌ సభ్యులు కానివారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేస్తే వారిని బెదిరించి పోటీ నుంచి తప్పుకునేలా చేశారు. దారికిరాని వారిపై దాడులు కూడా చేశారు. లాటరీ ద్వారా ఎవరికి మద్యం దుకాణం లైసెన్స్‌ దక్కినా సరే.. వచ్చే ఆదాయంలో 30 శాతం వరకు తమకు కమీషన్‌ ఇవ్వాల్సిందేనని టీడీపీ ప్రజాప్రతినిధులు హుకుం జారీ చేశారు. కొన్ని చోట్లయితే ఖర్చులు చెల్లించి బలవంతంగా దుకాణాలను చేజిక్కించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రజాప్రతినిధుల హెచ్చరికలతో మద్యం దుకాణా­లకు దరఖాస్తు చేయాలని ఆలోచించేందుకే సామాన్య వ్యాపారులు భయపడ్డారు. మొత్తం 3,396 మద్యం దుకాణాల్లో ఏకంగా 80 శాతం షాపులు టీడీపీ సిండికేట్‌లు దక్కించుకోగా, మరో 20 శాతం వేరే వాళ్లకు లైసెన్స్‌లు వచ్చినప్పటికీ వారిని బెదిరించి మరీ సిండికేట్‌లో విలీనం చేయించారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో నిర్వహించిన ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తివేసి ప్రైవేట్‌ వ్యక్తులకు లైసెన్స్‌లు కట్టబెట్టడంలోనూ మరోస్కామ్‌కు పాల్పడ్డారు. టెండర్లలో శాతం మార్జిన్‌ పెట్టి, అవన్నీ ఖరారై ఎస్టాబ్లిష్‌ అయిన తర్వాత 14 శాతం మార్జిన్‌ పెంచేసి దోపిడీకి పాల్పడ్డారు. రూ.99 చీప్‌ లిక్కర్‌ మినహా అన్ని బ్రాండ్ల ధరలు మండిపోతున్నాయి. ఫలితంగా మద్యం షాపుల్లో విక్రయించే ప్రతి బాటిల్‌కు రూ.5 నుంచి రూ.10 వరకు ప్రాంతాన్ని బట్టి ‘ముఖ్య’ నేతకు కమీషన్‌ ఇచ్చేలా వ్యవహారం సాగింది. ఇలా ప్రతి నెలా కమీషన్‌తోపాటు ధరల పెంపుతో ప్రభుత్వ పెద్దలకు వేలాది కోట్లు దక్కాయని సమాచారం. ఈ అక్రమ ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు ప్రభుత్వ కీలక నేతలు ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. గుడి, బడి.. ఎక్కడపడితే అక్కడ బెల్ట్‌షాపులుగత ప్రభుత్వంలో మద్యం షాపులు ఎక్కడో ఉండేవి. ఈ ప్రభుత్వంలో గుడి, బడి లేదు.. ఎక్కడపడితే అక్కడ మద్యం షాపులు ఏర్పాట­య్యా­యని ఇటీవల తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. గ్రామాల్లో టిఫిన్, జ్యూస్‌ సెంటర్లు, పాన్‌షాపుల్లో మద్యం అమ్ముతున్నారు. అది కూడా ఒక్కో బెల్ట్‌ షాపునకు ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారు. పోటీ ఎక్కువగా ఉన్న చోట ప్రాంతాన్నిబట్టి రూ.20 లక్షల వరకు వేలం పాట ద్వారా రాబట్టుకున్నారు. దీంతో సమీపంలోని లైసెన్స్‌ మద్యం షాపుల నుంచి బెల్ట్‌షాపుల నిర్వాహకులు రోజువారీగా మద్యం తెచ్చుకుని క్వార్టర్‌ బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 మేర అధిక ధరలకు అమ్ముతున్నారు. కొన్ని చోట్ల రూ.50 కూడా అదనంగా వసూలు చేస్తు­న్నారు. లైసెన్స్‌ మద్యం దుకాణాలకు సమయాలు నిర్దేశించినప్పటికీ ఎక్కడా వేళాపాళా లేకుండా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి సమయంలో ముందు గేటు మూసివేసి, వెనుక నుంచి.. కిటికీ లోంచి విక్రయాలు జరుపుతున్నారు. రాత్రి వేళ మద్యం అమ్మకాల కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించుకుంటున్నారు. ఇక బెల్ట్‌షాపులైతే 24 గంటలూ అమ్మకాలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో యథేచ్చగా మద్యం మాఫియా రాజ్యమేలుతోందనడానికి ఇదే నిదర్శనం. కర్నూలు జిల్లాల్లోని ఆదోని, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం పరిధిలోని బెల్టు దుకాణాల్లో కర్ణాటక మద్యాన్ని కూడా విక్రయిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని టీడీపీ నేతలు సమీపంలోని కర్ణాటక నుంచి మద్యం తెప్పించి బెల్టు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయిలో బెల్టుషాపులో మద్యం అమ్మకాల జోరు, తిరుపతి జిల్లా చిట్టమూరులో ఫోన్‌లో ఆర్డర్‌ తీసుకుని వాహనంలో డోర్‌ డెలివరీ చేస్తున్న మద్యం పెరిగిపోతున్న గొడవలు, అరాచకాలురాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుగ్రామంలో సైతం మద్యం విచ్చలవిడిగా దొరుకుతుండటంతో చాలా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదు­ర్కొంటున్నాయి. ఆయా గ్రామాల్లో చాలా మంది రోజూ తాగుతూ అనారోగ్యం బారిన పడుతున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నం అవుతు­న్నాయి. తాగిన మైకంలో బాలికలు, మహిళలపై ఆఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పచ్చటి గ్రామాల్లో గొడవలు, హత్యాయత్నాలు, హత్యలు చోటు చేసుకుంటున్నాయి. పేద కుటుంబాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. భార్యాభర్తలు, పిల్లల మధ్య గొడవలు పెరిగిపోయాయి. కొద్ది నెలలుగా నిత్యం పోలీస్‌స్టేషన్లకు పెద్ద సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులే ఇందుకు నిదర్శనం.వైఎస్‌ జగన్‌ అలా.. చంద్రబాబు ఇలా..ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సారా డబ్బుతో అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు.. తొలి నుంచి మద్యం పాలసీని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మద్య నిషేధాన్ని అటకెక్కించిన చంద్రబాబు.. తన పార్టీ నేతలు, బడాబాబుల నేతృత్వంలో మద్యం మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించారు. మద్యంను తన వాళ్లకు ఆదాయ వనరుగా మార్చేశారు. చంద్రబాబు విధానాలకు చెక్‌ పెట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి నుంచి ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా, మహిళల కన్నీళ్లు తుడవడమే లక్ష్యంగా దేశంలోనే అత్యంత పారదర్శక విధానాన్ని అమలు చేశారు. మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పరచడం, మద్యపానంపై నియంత్రణ పాటించడమే ప్రధాన లక్ష్యంగా పాలసీని రూపొందించారు. వేళపాళా లేకుండా అధిక ధరలకు అమ్మే సిండికేట్‌ వ్యవస్థకు చెక్‌ పెట్టారు. లిక్కర్‌ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేట్‌ వ్యక్తులను తొలగించారు. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు జరిపించారు. మద్యం దుకాణాల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించారు. 33 శాతం షాపులను తీసేశారు. షాపులకు అనుబంధంగాఉన్న 4,380 పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేశారు. రాష్ట్రంలోని 43,000 బెల్టుషాపులను ఎత్తివేశారు. మద్యం విక్రయించే వేళలను కూడా పరిమితం చేశారు. ప్రతి ఊరికీ ఒక మహిళా పోలీసును పెట్టారు. ఎక్సైజ్‌కు సంబంధించి నేరాలకు పాల్పడితే అంగీకరించే ప్రశ్నే లేదని కఠినంగా వ్యవహరించిన విషయం విదితమే. లిక్కర్‌ టెస్టింగ్‌ కోసం కొత్త ల్యాబులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మద్యం తయారు చేస్తున్న 20 డిస్టిలరీల్లో 14 సంస్థలకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే అనుమతులు ఇవ్వగా, మిగిలిన వాటికి అంతకు ముందు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో కొత్తగా ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. పైగా మద్యం విక్రయాలు తగ్గాయి.జగన్‌ హయాంలో సెబ్‌ ద్వారా ఉక్కుపాదంమద్యం, నాటుసారా, గంజాయి అక్రమ రవాణాలను అరికట్టేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌)ను ఏర్పాటు చేసింది. సెబ్‌ సిబ్బంది ప్రత్యేక చెక్‌ పోస్టులుపెట్టి ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం ద్వారా పెద్ద ఎత్తున మద్యం పట్టుబడింది. భారీ ఎత్తున దాడులు నిర్వహించి మత్తు పదార్థాలు, మద్యం, సారా అక్రమ రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపింది. మరోవైపు వివిధ జిల్లాల్లో సారా తయారీ కేంద్రాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను వినియోగించి, క్షేత్ర స్థాయి నుంచి పక్కా సమాచారాన్ని తెప్పించుకుంటూ దాడులు నిర్వహించింది. సెబ్‌ దూకుడుగా వ్యవహరించినిందితులను పట్టుకుని వేలాది కేసులు నమోదు చేసింది. నవోదయం–పరివర్తన పేరిట సారా తయారీ కేంద్రాలు నడుపుతున్న వారికి కౌన్సిలింగ్‌లు ఇచ్చి వారు ఆ వృత్తిని వదిలేసేందుకు తోడ్పడింది. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలేవీ కనిపించడంలేదు.మహిళలపై పెరుగుతున్న దాడులుగత ప్రభుత్వంలో బెల్ట్‌ షాపులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో 4, 5 బెల్టు షాపులను ఏర్పాటు చేసి విచ్చల­విడిగా మద్యం అమ్మకాలు జరుపు­తున్నారు. ఇదంతా కళ్లెదుటే జరు­గు­తున్నా ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? గ్రామా­ల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మ­కాలతో సామాన్య కుటుంబాలకు తీరని నష్టం కలుగుతోంది. మహిళలపై దాడులు పెరిగి­పో­తు­న్నాయి. నూతన మద్యం పాలసీ అంటే ఇదేనా? – కంచర్ల పద్మావతి, పరిటాల, ఎన్టీఆర్‌ జిల్లాఇంతలో ఎంత తేడా?రాష్ట్రంలో 1990 దశకంలో మద్యానికి వ్యతి­రే­కంగా మహిళా ఉద్యమం పెల్లుబికి 1995­లో ఎన్టీఆర్‌ సీఎంగా మొదటి సంతకం మద్య నిషేధంపై చేశారు. రెండేళ్లు అమలులో ఉంది. ఆయ­నకు వెన్ను­పోటు పొడిచి సీఎం అయిన అల్లుడు చంద్ర­బాబు నిషేధం ఎత్తేశాడు. వైఎస్‌ జగన్‌ వచ్చా­క మాత్రమే చిత్తశుద్ధితో కూడిన దశల వారీ­గా మద్య నియంత్రణ సాగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. ఇంతలో ఎంత తేడా? – ఈదర గోపీచంద్, సోషల్‌ యాక్టివిస్టు, నరసరావుపేటగిరిజనులు బానిసలు అవుతున్నారుజిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో బెల్ట్‌ దుకాణాల ద్వారా మద్యం అమ్మ­కాలు విచ్చలవిడిగా జరుగు­తు­­న్నాయి. అనేక దుకాణాల్లో కూల్‌ డ్రింక్‌ల మాదిరిగా మద్యం బాటిళ్లను అమ్మడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని ఆదాయ వనరుగా చూస్తుండడంతో గిరి­జన ప్రాంతాల్లోనూ అమ్మకాలు పెరిగి, గిరి­జనులు మద్యానికి బానిసలవుతు­న్నా­రు. గిరిజన కుటుంబాల ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటోంది. – వి.వి.జయ, అరకులోయ, అల్లూరి జిల్లామద్యం షాపులను ప్రభుత్వమే నడపాలిరాష్ట్రంలో మద్యం ఏరులై పారించి ప్రభు­త్వ ఖజానాకు దండిగా కాసులు రాబ­ట్టేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే వీధివీధిలో బెల్టుషాపు­లు తెరి­పించి మద్యాన్ని ఏరులై పారిస్తోంది. నా­ణ్య­మైన మద్యం ఇస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అంటున్నాడు. అంటే ఈ మద్యం ఎంత తాగినా ప్రమా­దం కాదా? తాగి తాగి రోగాల పాలైతే ఎవరు జవా­బు­దారీ? కుటుంబాలను ఛిద్రం చేస్తు­న్నారు. మ­ద్య­ం షాపులను ప్రభుత్వమే నిర్వహించి అమ్మకాలు పరిమితం చేయాలి. – సావిత్రి, అనంతపురంపచ్చని పల్లెల్లో చిచ్చుపచ్చని పల్లె సీమల్లో మద్యం భూతం బెల్టు రూపంలో చిచ్చు పెడుతోంది. పేదలు సంపాదనను తాగుడుకు తగలేస్తు­న్నా­రు. దీని వల్ల వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతు­న్నాయి. మద్యానికి బానిసలైతే పనులు చేయలేరు. అప్పుడు తినే తిండికి కూడా కష్టం అవుతుంది. వెంటనే మద్యం కట్టడి చేయాలి.– జ్యోతి, యానాది కాలనీ, తవణంపల్లి మండలం, చిత్తూరు జిల్లా

Ys Jagan Sri Rama Navami Wishes To Telugu People2
తెలుగు ప్రజలకు వైఎస్‌ జగన్‌ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

సాక్షి, తాడేపల్లి: శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీసీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన అభిలషించారు.ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కల్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ శ్రీసీతారాముల అనుగ్రహం లభించాలని వైఎస్‌ జగన్‌ అభిలషించారు.

Sakshi Editorial On TDP Chandrababu Govt By Vardhelli Murali3
వారి దయ, జనం ప్రాప్తం... అదే పీ–ఫోర్‌!

‘ఏరు దాటకముందు ఓడ మల్లయ్య... దాటిన తర్వాత బోడి మల్లయ్య!’ – ఇది పాత సామెత. ఎన్నికలకు ముందు ‘సూపర్‌ సిక్స్‌’... ఎన్నికలయ్యాక ‘పీ–ఫోర్‌’ – ఇది కొత్త సామెత. ఎన్ని కల్లో గెలవడానికి చంద్రబాబు ఎంత అలవికాని హామీలిస్తారో గెలిచిన తర్వాత వాటిని ఎలా అటకెక్కిస్తారో తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈ బోడి మల్లయ్య వైఖరిపై వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి, రోశయ్య వంటి పెద్దలు వేసిన సెటైర్ల వీడియోలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఐదొందలకు పైగా వాగ్దానాలు చేశారు. అన్నిట్లోకి ప్రధానమైన హామీ... రైతులకు సంపూర్ణ రుణ మాఫీ. ఎన్నికల నాటికే 87 వేల కోట్లకు పైగా ఉన్న రైతు రుణాల సంపూర్ణ మాఫీ రాష్ట్ర వనరులతో సాధ్యం కాదని, ఆ హామీని ఇవ్వడానికి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి నిరాకరించారు. కానీ, ఏరు దాటడమే ముఖ్య మని భావించే చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ఆ హామీని అమలు చేస్తానని ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అమలు చేశారన్నది రాష్ట్ర రైతాంగానికి తెలుసు.ఇప్పుడు రాజ్యసభలో ఒక ప్రశ్నకు బదులుగా కేంద్రం విడుదల చేసిన గణాంకాల సాక్షిగా దేశ ప్రజలందరికీ చంద్రబాబు రైతు రుణమాఫీ బండారం బట్టబయలైంది. సరిగ్గా వారం రోజుల కిందనే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను సమర్పించింది. 2018 జూలై నుంచి 2019 జూన్‌ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌ రైతుల సగటు రుణభారం రూ.2,45,554గా ఉన్నట్టు ఈ సమాధానం వెల్లడించింది. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉండే జాతీయ శాంపిల్‌ సర్వే కార్యాలయం (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) రూపొందించిన జాబితా ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆంధ్ర ప్రదేశ్‌ రైతుల రుణభారం అధికంగా ఉన్నది. ఇది చంద్రబాబు గద్దె దిగేనాటికి రైతాంగ పరిస్థితి. సంపూర్ణ రుణమాఫీ వాగ్దానం ఒక ప్రహసనం అని చెప్పేందుకు ఇంతకంటే పెద్ద రుజువు ఏముంటుంది?జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత, అంటే 2001 జూలై – 2002 జూన్‌ మధ్యకాలంలోని ఏపీ రైతుల సగటు రుణభారం 66,205 రూపాయలకు తగ్గిపోయింది. ఇది కూడా ఎన్‌ఎస్‌ఎస్‌ఓ తయారుచేసిన లెక్కే. రాజ్యసభలో కేంద్రం వెల్లడించినదే. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేయడంతోపాటు, క్రమం తప్పకుండా బాకీ తీర్చే రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేయడం వల్ల కలిగిన సత్ఫలితమిది. చంద్రబాబు బూటకపు హామీల అమలు తీరుకూ, జగన్‌ సంక్షేమ పథకాల అమలు తీరుకూ మధ్యన ఉండే తేడాను చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే!మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు కూటమి చేసిన వాగ్దానాల్లో అతి ప్రధానమైనది ‘సూపర్‌ సిక్స్‌’. పది నెలల తర్వాత కూడా ఈ ఆరు పథకాల ప్రారంభం ఆచరణకు నోచుకోలేదు. ఒక్క దీపం పథకంలో భాగంగా ఇవ్వాల్సిన మూడు సిలిండర్లకు బదులు ఒక సిలిండర్‌ను అందజేసి మమ అనిపించుకున్నారు. ‘సూపర్‌ సిక్స్‌’ అమలు చేయాలంటే ఈ సంవత్సరానికి అవసరమైన 70 వేల కోట్ల రూపాయలకు బదులు బడ్జెట్‌లో 17 వేల కోట్లే కేటాయించడాన్ని బట్టి రెండో సంవత్సరం కూడా ప్రధాన హామీ అమలు లేనట్టేనని భావించవలసి ఉంటుంది. ఇప్పుడు దాన్ని మరిపించడానికి ‘పీ–ఫోర్‌’ అనే దానధర్మాల కార్యక్ర మాన్ని చంద్రబాబు ముందుకు తోస్తున్నారు. ఇక ‘సూపర్‌ సిక్స్‌’ జోలికి వెళ్లరని చెప్పడానికి ఇటీవల చంద్రబాబు చేసిన వింత వ్యాఖ్యానం కూడా ఒక రుజువని చెప్పవచ్చు. జగన్‌మోహన్‌రెడ్డి అమలుచేసిన సంక్షేమ కార్య క్రమాలన్నీ ఒక ఎత్తు – తాను పెంచి అమలుచేస్తున్న పెన్షన్‌ కార్యక్రమం ఒక ఎత్తని ఒక విచిత్రమైన పోలికను ఆయన తీసుకొచ్చారు. ఈ రెండూ సమానమే కనుక ఇక అదనంగా చేసేదేమీ లేదనేది ఆయన మనోగతం కావచ్చు. కానీ ఈ పోలిక నిజమేనా? ‘సూపర్‌ సిక్స్‌’తో సహా మేనిఫెస్టోలోని మొత్తం హామీల్లో వెయ్యి రూపాయల పెన్షన్‌ పెంపు ఒక్కదాన్నే చంద్ర బాబు ప్రభుత్వం అమలు చేస్తున్నది. అది కూడా సంపూర్ణంగా కాదు! ఎస్సీ, బీసీలకు యాభయ్యేళ్ల నుంచే వృద్ధాప్య పెన్షన్‌ను అమలు చేస్తానని కూటమి మేనిఫెస్టో చేసిన హామీని విస్మరించారు. ఆ రకంగా ఈ పది నెలల్లో ఎగవేసిన సొమ్మెంతో అంచనా వేయవలసి ఉన్నది.ఐదేళ్ళ పదవీకాలంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా 2,73,756 కోట్ల రూపా యలను జనం ఖాతాల్లో వేసింది. ఇతర పథకాల (నాన్‌–డీబీటీ) ద్వారా 1,84,604 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. మొత్తం ప్రజా సంక్షేమ పథకాల కోసం ఐదేళ్ళలో వెచ్చించిన సొమ్ము 4,58,360 కోట్లు. అంటే ఏడాదికి రమారమి 92 వేల కోట్లు. ఈ కాలంలో వరసగా రెండేళ్లు కోవిడ్‌ దాడులు జరిగిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. జగన్‌ సర్కార్‌ 66 లక్షల పైచిలుకు మందికి మూడు వేల రూపాయల చొప్పున నెలకు సుమారుగా రెండు వేల కోట్ల మేర పెన్షన్లు అందజేసింది. పెన్షనర్లలో మూడు లక్షలమందికి కత్తెర వేసిన చంద్రబాబు ప్రభుత్వం ఒక వెయ్యి రూపాయల చొప్పున పెంచి నెలకు 2,700 కోట్లు పంపిణీ చేస్తున్నది. ఈ పెరుగుదల నెలకు ఏడు వందల కోట్ల చొప్పున సంవత్సరానికి 8,400 కోట్లు. ఇది జగన్‌ సర్కార్‌ ఏడాదికి సంక్షేమం కింద ఖర్చుపెట్టిన 92 వేల కోట్లకు సమానమేనని చంద్రబాబు వాదిస్తున్నారు. ఎట్లా సమానమవుతుందని ఎవ రైనా ప్రశ్నిస్తే ‘ఎర్ర బుక్కు’లో పేరు రాసుకుంటారట!‘సూపర్‌ సిక్స్‌’ హామీల నుంచి జనం దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు ఒక కొత్త నామవాచకాన్ని రంగంలోకి దించారు. అదే ‘పీ–ఫోర్‌’ (పబ్లిక్‌ ప్రైవేట్‌ పీపుల్‌ పార్ట్‌నర్‌షిప్‌). దీని ప్రకారం సమాజంలోని అగ్రశ్రేణి పది శాతం సంపన్నులు సామాజిక బాధ్యత తీసుకుని అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను ఉద్ధరించాలట! సంపన్నులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ పేదలను ఆదుకోవాలనే సిద్ధాంతాలు ఇప్పటివి కావు. పేద, ధనిక తేడాలు సమాజంలో ఏర్పడ్డప్పటి నుంచి ఉన్నాయి. చంద్రబాబు దానికి కొత్త పేరు పెట్టుకున్నారు. అంతే తేడా! కానీ ఈ సిద్ధాంతంతో అంతరాలు తొలగిపోయిన సమాజం చరిత్రలో మనకెక్కడా కనిపించదు. ఏపీలో ఆదాయం పన్ను చెల్లిస్తున్న అధికాదాయ వర్గాలవారు ఎనిమిది లక్షల మందేనట! మరోపక్క పేదరికం కారణంగా తెల్ల రేషన్‌కార్డు లున్న కుటుంబాలు కోటీ నలభై ఎనిమిది లక్షలు. చంద్రబాబు ‘పీ–ఫోర్‌’ సిద్ధాంతపు డొల్లతనాన్ని ఎత్తిచూపుతూ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ఈ గణాంకాలను ఉటంకించారు.ఆదాయం పన్ను చెల్లించేవారి సంఖ్య ఈ లెక్కన రెండు శాతం కూడా లేదు. అందులోనూ వేతన జీవుల సంఖ్యే ఎక్కువ. వీళ్లకు సేవా కార్యక్రమాలు చేసేంత స్థోమత ఉండదు. ఈ లెక్కన కాస్త అటూఇటుగా ఒక్కశాతం మందే పేదల బాధ్యత తీసు కోవాలి. తెల్లకార్డుల సాక్షిగా పేదలు 90 శాతం మంది. ఇందు లోంచి 70 శాతాన్ని తొలగిస్తూ 20 శాతం మంది పేదలను మాత్రమే ‘పీ–ఫోర్‌’ స్కీములోకి చేర్చుకున్నారు. ఈ పేదల మీద తనకు ఏ రకమైన అభిప్రాయాలున్నాయో మొన్నటి ఉగాది నాడు జరిగిన సభలో స్వయంగా చంద్రబాబు వెల్లడించారు. ‘ఈ బీసీల ఆలోచనంతా ఆ పూట వరకే! సభకొచ్చారు. మధ్య లోనే లేచి వెళ్లారు. మార్గదర్శులు (సంపన్నులు) మాత్రం కూర్చునే ఉన్నార’ని పేదలను ఈసడిస్తూ సంపన్నులను మెచ్చు కున్నారు. పేదవాళ్లకు క్రమశిక్షణ ఉండదనీ, ముందుచూపు ఉండదనీ, డబ్బున్నవాళ్లే పద్ధతైనవాళ్లనే అభిప్రాయంలోంచి మాత్రమే అటువంటి మాటలు వస్తాయి. పేదల పట్ల చంద్ర బాబు ఈసడింపు ధోరణికి ఇదొక్కటే ఉదాహరణ కాదు. చాలా ఉదంతాలున్నాయి. ఎస్‌.సీల గురించి, బీసీల గురించి గత పదవీ కాలంలో చేసిన కామెంట్లు ప్రజలకు ఎల్లకాలం గుర్తుంటాయి.2013లో చేసిన కంపెనీల చట్టం సెక్షన్‌ 135 ప్రకారం కార్పొరేట్‌ కంపెనీలన్నీ వాటి లాభాల్లో రెండు శాతానికి తగ్గకుండా సామాజిక సేవా రంగాలపై ఖర్చు చేయాలి. అది చట్ట బద్ధమైన బాధ్యత. దయాదాక్షిణ్యం కాదు. సగటున దేశ వ్యాప్తంగా సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) కింద 15 వేల కోట్ల రూపాయలను ఇప్పటికే ఖర్చు చేస్తున్నారు. దీన్ని ఏపీ భాగం కింద విడదీస్తే వెయ్యి కోట్ల లోపే ఉంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని పనిచేస్తే రెండు వేల కోట్లో, మూడు వేల కోట్లో రావచ్చు. ఈ సొమ్ముతో ఇరవై శాతం మంది జీవితాల్లో వెలుగులు పూయించాలని ఆయన ఆలో చిస్తున్నారు.ప్రతి పౌరునికీ జీవించే హక్కును మాత్రమే కాదు, గౌరవప్రదంగా జీవించే హక్కును భారత రాజ్యాంగం ప్రసాదించింది. 21వ అధికరణం ప్రకారం గౌరవప్రదమైన జీవనం ప్రతి వ్యక్తికీ ప్రాథమిక హక్కు. ఈ హక్కును ప్రభుత్వం సంరక్షించాలి. అందుకు విరుద్ధంగా నలుగురు డబ్బున్న వాళ్లను పోగేసి వేదికపై కూర్చోబెట్టి, వేదిక ముందు పేదల్ని చేతులు జోడించి కూర్చు నేలా చేసి, ‘ఒక అయ్యగారి సాయం పదివేలు, ఒక దొరగారి సాయం ఇరవై వేలం’టూ వేలం పాటలు పాడటం రాజ్యాంగ విరుద్ధం. అందుకే సీఎం సభ నుంచి పేద ప్రజలు మధ్యలోనే నిష్క్రమించి ఉంటారు. ముందుచూపు లేక కాదు, మోకరిల్లడం ఇష్టం లేక వెళ్లిపోయుంటారు. అందరికీ నాణ్యమైన విద్యను ఉచితంగా అందుబాటులోకి తేవడం, అందరికీ మేలైన వైద్య సదుపాయాలు లభించేలా చేయడం, అందరూ సమాన స్థాయిలో పోటీపడగలిగే లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ను తయారు చేయడానికి ప్రభుత్వాలు పూనుకోవాలని రాజ్యాంగం ఆదేశిస్తున్నది. రాజ్యాంగ ఆదేశాన్ని మన్నించడమే ప్రజాస్వామ్య ప్రభుత్వపు ప్రాథమిక విధి. దిద్దుబాటా... ఇంకో పొరపాటా?ఉస్మానియా యూనివర్సిటీకి ఉద్యమాల పుట్టినిల్లుగా పేరుండేది. ఉద్యమాల పర్యవసానంగా పుట్టిన యూనివర్సిటీ హైదరా బాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం. ఒక భావోద్వేగ పూరితమైన నేపథ్యం హెచ్‌సీయూ ఆవిర్భావానికి కారణమైంది. 1969, 1972 సంవత్సరాల్లో రెండు ఉధృతమైన ప్రత్యేక రాష్ట్ర ఉద్య మాలను తెలుగు నేల చూడవలసి వచ్చింది. ఆ ఉద్యమాలను చల్లార్చి ఉమ్మడి రాష్ట్రాన్ని కొనసాగించడం కోసం ఒక రాజీ ఫార్ములాగా ఆరు సూత్రాల పథకాన్ని కేంద్రం ముందుకు తెచ్చింది. అందులో ఒక అంశం హైదరాబాద్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు! విద్యారంగంలో వెనుకబాటుతనా నికి గురైన ప్రాంతంగా ఉన్న తెలంగాణలో ఒక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఏర్పాటు, రాష్ట్ర రాజధానిలో ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు కూడా సమాన అవకాశాలు లభించే విధంగా దాన్ని కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఉభయతారకంగా ఉంటుందని భావించారు.ఇందుకోసం రాజ్యాంగ సవరణ అవసరమైంది. 32వ సవరణ ద్వారా 371వ అధికరణానికి ‘ఈ’ అనే సబ్‌క్లాజ్‌ను జోడించారు. పార్లమెంట్‌ ఒక చట్టం ద్వారా హైదరాబాద్‌లో ఒక ‘సెంట్రల్‌’ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ఈ క్లాజ్‌ అవకాశం కల్పించింది. ఆ మేరకు హైదరాబాద్‌ విశ్వవిద్యాలయ చట్టం 1974ను పార్లమెంట్‌ ఆమోదించింది. అదే సంవత్సరం సెప్టెంబర్‌లో గెజెట్‌లో ఈ చట్టాన్ని ప్రచురించారు. భారత రాజ్యాంగంలో 371వ అధికరణం కింద ప్రస్తావించిన ఏకైక విశ్వవిద్యాలయం హెచ్‌సీయూ మాత్రమే! అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుమారుగా 2,300 ఎకరాల భూమిని హైదరాబాద్‌ నగర కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గచ్చిబౌలి ప్రాంతంలో కేటాయించింది. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడమో, లేక ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి సేకరించడమో చేయలేదు.పూర్వపు హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో వాటిని ఆనుకొని ఉన్న ఇతర జిల్లాల్లో ఉన్న భూములన్నీ నవాబ్‌ సొంత భూములుగా (‘సర్ఫెఖాస్‌’గా) పరిగణించేవారు. పోలీస్‌ యాక్షన్‌ తర్వాత ‘హైదరాబాద్‌ స్టేట్‌’ ఇండియన్‌ యూని యన్‌లో విలీనమైంది. నైజాం... భూములన్నీ హైదరాబాద్‌ స్టేట్‌కు వారసత్వంగా లభించాయి. ఇందుకోసం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ జీవించి ఉన్నంతకాలం పెద్దమొత్తంలో కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా రాజభరణం చెల్లించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌ చుట్టూ ఉన్న వేలాది ఎకరాల భూములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌ నగరంలో డజన్లకొద్ది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటుకు ఈ భూముల లభ్యతే కారణం.హెచ్‌సీయూను ఒక ప్రతిష్ఠాత్మక విద్యా కేంద్రంగా మలచాలని కేంద్రం భావించినందు వల్ల అప్పటికి ప్రపంచ స్థాయిలో పేరున్న యూనివర్సిటీలను దృష్టిలో పెట్టుకొని వాటి స్థాయిలోనే భూములను కేటాయించాలని భావించారు. ఈ భూములను కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక జీవోను కూడా విడుదల చేసింది. కాకపోతే భూముల రిజిస్ట్రేషన్‌ జరగలేదు. అటువంటిది అవసరమని కూడా నాటి యూని వర్సిటీ పాలకవర్గాలు భావించలేదు. హెచ్‌సీయూకు చీఫ్‌ రెక్టార్‌గా ఒక గౌరవ హోదా కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పార్లమెంట్‌ చట్టపరంగానే కట్టబెట్టింది. కంచే చేను మేస్తుందని ఎవరు భావిస్తారు! అందువల్ల టెక్నికల్‌గా ఆస్తుల బదలాయింపు జరగలేదు.కేంద్ర ప్రభుత్వం ఆశించినట్టుగానే హెచ్‌సీయూ ప్రతి ష్ఠాత్మక విద్యా కేంద్రంగానే వెలుగొందింది. వారసత్వంగా సంక్ర మించిన భూమిని కేటాయించడం, గౌరవ హోదాను అనుభవించడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఖర్చంతా యూజీసీ పద్దులే భరించాయి. యూనివర్సిటీని స్థాపించిన యాభయ్యేళ్లకు దాని భూములపై ఇప్పుడు జాతీయస్థాయిలో వివాదం జరుగుతున్నది. నిజానికి పాతికేళ్ల కిందనే ఈ చర్చను లేవనెత్తి ఉండాలి. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు అప్పటి మీడియా కరపత్రికల్లా వ్యవహరించడం వల్ల, కేంద్రంలో కూడా ఆయన మిత్రపక్షమే ఉన్నందువల్ల చర్చ జరగలేదు. యూనివర్సిటీకి కేటాయించిన 2300 ఎకరాల్లో 800 ఎకరాల సంతర్పణ వివిధ సంస్థల పేర్లతో ఇష్టారాజ్యంగా జరిగిపోయింది.మిగిలిన దాంట్లో 400 ఎకరాల భూమిని తాడూ బొంగరం లేని క్రీడా నిపుణుల పేరుతో బిల్లీరావు అనే వ్యక్తికి కారుచౌకగా చంద్రబాబు కట్టబెట్టారు. అదీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, కేబినెట్‌ అనుమతి కూడా లేకుండానే ఈ కేటాయింపులు జరిగాయి. ఈ నాలుగొందల ఎకరాలు చాలవని ఎయిర్‌పోర్టు సమీపంలో మరో నాలుగొందల యాభై ఎకరాలను కూడా కట్టబెట్టారు. ఆనాటికి దేశంలోని అతిపెద్ద స్కాముల్లో ఈ బిల్లీరావు భూబాగోతం కూడా ఒకటి. వెంటనే ఎన్నికలు రావడం, చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోవడం, తదనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ అక్రమ కేటాయింపును రద్దు చేయడం తెలిసిన విషయాలే!రద్దును సవాల్‌ చేస్తూ బిల్లీరావు కోర్టుల్ని ఆశ్రయించి ఇరవయ్యేళ్లపాటు వ్యాజ్యాన్ని నడిపాడు. రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగానే నిలవడంతో ఇరవయ్యేళ్ల తర్వాత గత సంవత్సరమే సుప్రీంకోర్టు తుది తీర్పునిస్తూ ఈ 400 ఎకరాలు ప్రభు త్వానివేనని తేల్చేసింది. కేవలం టెక్నికల్‌గానే ప్రభుత్వ భూములు అనుకోవాలి. యూనివర్సిటీకి ఈ భూములను కేటాయించినట్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రామచంద్రారెడ్డి యూనివర్సిటీ అధికా రులకు 1975లోనే ఫిబ్రవరి 21న డీఓ లెటర్‌ ద్వారా కమ్యూ నికేట్‌ చేశారు. 2,300 ఎకరాలు కేటాయించినట్టు అందులో స్పష్టంగా పేర్కొన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదు గానీ, ఆ రోజుల్లో రెండు కోట్లు ఖర్చుపెట్టి కాంపౌండ్‌వాల్‌ కట్టించింది.ఇక్కడ తలెత్తుతున్న కీలకమైన ప్రశ్న ఏమిటంటే, రెండు ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాల నేపథ్యంలో ఆరు సూత్రాల పథకంలో భాగంగా ఏర్పడిన యూనివర్సిటీ ఇది. పార్లమెంట్‌లో ప్రత్యేకంగా చట్టాన్ని చేసి ఏర్పాటుచేశారు. రాజ్యాంగంలో పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా భూముల్ని కేటాయించింది. ఈ భూముల్ని అకడమిక్‌ అవసరాలకు మాత్రమే వినియోగించాలని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే షరతు కూడా విధించింది. ఆ షరతును ఉల్లంఘించడానికి రాష్ట్ర ప్రభుత్వమే సిద్ధపడటం, అమ్ముకోవడానికి కూడా తెగించడం చెల్లుబాటయ్యే విషయాలేనా? నైతికంగానే కాదు, న్యాయపరంగా కూడా! విశ్వవిద్యాలయ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం తప్ప స్టేక్‌ హోల్డర్లు ఇంకెవరూ లేరా?కోర్టు తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఈ భూముల్ని తాకట్టు పెట్టి పదివేల కోట్లు అప్పు తీసుకున్నదట! ఇప్పుడు వేలానికి సిద్ధపడింది. ఈ 400 ఎకరాల్లో పర్యావరణ విధ్వంసం జరుగుతున్నదన్న వార్తలు వ్యాపించడం, హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఇది జాతీయ సమస్యగా మారింది. ఈ నాలుగొందల ఎకరాల పరిధిలోని దట్టమైన పొదలు స్క్రబ్‌ అడవిగా అల్లుకున్నాయి. మంజీరా బేసిన్‌లో ఎత్తయిన ప్రాంతంలో ఉన్నందువల్ల ఇక్కడి కుంటల్లో చేరిన నీరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూగర్భ జలాలకు ఊపిరిపోస్తున్నాయని చెబుతున్నారు. హెచ్‌సీయూ వెబ్‌సైట్‌ లోనే ఇక్కడున్న బయో డైవర్సిటీ గురించి అధికారికంగా పొందుపరిచారు.వంద ఎకరాల్లో బయో డైవర్సిటీని ధ్వంసం చేశారన్న వార్తలను అధికారికంగా రూఢి చేసుకున్న తర్వాతనే సర్వోన్నత న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది. ఏప్రిల్‌ 16వ తేదీ లోగా నివేదికను ఇవ్వాలని రాష్ట్ర సీఎస్‌ను ఆదేశించింది. న్యాయ స్థానం జోక్యంతో ప్రస్తుతం సద్దుమణిగినట్టు కనిపిస్తున్నా,ఎంపిక చేసుకున్న పత్రికల్లో వస్తున్న లీకు వార్తలు కొత్త కలవరాన్ని కలిగిస్తున్నాయి. 400 ఎకరాలే కాదు, మొత్తం రెండువేల ఎకరాల్లో ‘ఎకో పార్క్‌’ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నదనీ, ఇందుకోసం సెంట్రల్‌ వర్సిటీకి ఫ్యూచర్‌ సిటీలో వంద ఎకరాలు కేటాయించి, అక్కడికి తర లిస్తారనీ ముందుగా ఒక తెలుగు పత్రిక రాసింది. దానికి ప్రభుత్వ అనుకూల పత్రికగా పేరున్నది. ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ఖండనా రాలేదు. రెండోరోజు ఒక జాతీయస్థాయి ఇంగ్లిషు పత్రికలో మరింత ప్రముఖంగా, సమగ్రంగా అదే వార్త వచ్చింది. ఎవరూ ఖండించలేదు. అధికారికంగా ప్రకటించనూ లేదు. ఇటువంటి వార్తల్నే జనం పల్స్‌ తెలుసుకోవానికి ప్రయోగించే ‘లీకు వార్త’లంటారు. నిజంగా ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశం ఉన్నదా? వేలానికి అడ్డుపడ్డ సెంట్రల్‌ వర్సిటీ విద్యార్థులపై కోపమా? వాళ్ల మీద కోపంతో యూనివర్సిటీ స్థాయిని తగ్గించాలనుకుంటున్నారా? వాళ్లదేముంది. రెండు మూడేళ్లు చదువుకొని వెళ్లిపోతారు. నిజంగానే సెంట్రల్‌ వర్సిటీని వంద ఎకరాల్లోకి పంపించే ఉద్దేశం ఉంటే మాత్రం దాని స్థాపిత లక్ష్యాలను అవహేళన చేసినట్టే అవుతుంది. ఒక తప్పును దిద్దుకోవడానికి మరో తప్పు చేసినట్టవుతుంది. ప్రతిష్ఠాత్మకమైన కేంద్రీయ విశ్వవిద్యాలయంతో ఫుట్‌బాల్‌ ఆడుకునే హక్కు, అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయా అనే సంగతి కూడా తేలవలసి ఉన్నది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Indian Govt changed strategy on Regional Ring Road4
‘రింగు’ 6 వరుసలు!

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొలిదశలో నాలుగు వరుసలుగానే నిర్మించాలని నిర్ణయించి అందుకు వీలుగా ఇటీవల టెండర్లు పిలిచిన కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఇప్పుడు మనసు మార్చుకుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ను ఏకకాలంలో ఆరు వరుసలుగా నిర్మించాలనుకుంటోంది. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు ప్రారంభించి డిజైన్లు మారుస్తోంది. ప్రస్తుతం ప్రతిపాదిత అలైన్‌మెంట్‌ను ఆనుకొని ఉన్న రాష్ట్ర, జాతీయ రహదారులపై రోజుకు ఎన్ని వాహనాలు తిరుగుతు న్నాయో తేల్చే వాహన అధ్యయనం పూర్తిచేసి ఎన్‌హెచ్‌ఏఐ కేంద్రానికి నివేదించనుంది. దీని ఆధా రంగా ఆర్‌ఆర్‌ఆర్‌పై రానున్న 20 ఏళ్లలో వాహనాల సంఖ్య ఏ మేరకు పెరుగుతుందో అంచనా వేసి కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. ఆరు వరుసలుగా రోడ్డు నిర్మాణంతో ప్రధాన క్యారేజ్‌ వే మాత్రమే కాకుండా జాతీయ, రాష్ట్ర రహదారులను క్రాస్‌ చేసే 11 ప్రాంతాల్లో నిర్మించనున్న ఇంటర్‌ఛేంజ్‌ స్ట్రక్చర్ల డిజైన్లను కూడా ఎన్‌హెచ్‌ఏఐ మారుస్తోంది. దీంతో ఇంటర్‌ఛేంజ్‌ కూడళ్లను మరింత భారీగా నిర్మించాల్సి రానుంది. ఫలితంగా రోడ్డు నిర్మాణ వ్యయం సుమారు రూ. 2,500 కోట్ల మేర పెరగనుంది. ఒక్క ఉత్తరభాగం నిర్మాణానికే దాదాపు రూ. 19 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.వెంటనే విస్తరణ పరిస్థితి రావద్దని..ఏడేళ్ల క్రితం రీజినల్‌ రింగురోడ్డును ప్రతిపాదించాక దానిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2008లో ఔటర్‌ రింగురోడ్డు నిర్మించాక హైదరాబాద్‌ రూపు రేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. పురోగతి వేగం పుంజుకుంది. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ అంతకు మించిన ప్రభావం చూపుతుందన్న అంచనా నెలకొంది. దీంతో రీజినల్‌ రింగురోడ్డు అలైన్‌మెంట్‌ను ఆసరాగా చేసుకొని ప్రత్యేక ఆర్థిక మండళ్లు (ఎస్‌ఈజెడ్‌), శాటిలైట్‌ టౌన్‌షిష్‌ల ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అక్కడ పెట్టుబడులకు బహుళ జాతి సంస్థలు ముందుకొస్తున్నాయి. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూ జనావాసాలు, సంస్థలు పెరిగి వాహనాల రద్దీ తీవ్రమవుతుందని కేంద్రం తాజాగా అంచనాకొచ్చింది. 2021–22లో ప్రతిపాదిత రింగు ప్రాంతంలోని రోడ్లపై నిత్యం సగటున 14,850 ప్యాసింజర్‌ కార్‌ యూనిట్ల (పీసీయూ) చొప్పున వాహనాలు తిరుగుతున్నాయని తేలింది. తాజాగా ఓ ప్రైవేటు సంస్థతో నిర్వహిస్తున్న అధ్యయనంలో ఇందులో పెరుగుదల నమోదైంది. ఓఆర్‌ఆర్‌ నిర్మాణానికి ముందున్న అంచనాకు.. రోడ్డు నిర్మించాక వాస్తవంగా తిరుగుతున్న వాహనాల సంఖ్యకు పొంతన లేకుండా పోయింది. ఆర్‌ఆర్‌ఆర్‌ను నాలుగు వరుసల్లో నిర్మించి మరో 15–20 ఏళ్ల తర్వాత దాన్ని 8 వరుసలకు విస్తరించాలనేది ఇప్పటివరకు ఉన్న ప్రణాళిక. కానీ కేవలం ఐదేళ్లలోనే ఆర్‌ఆర్‌ఆర్‌పై రద్దీ రెట్టింపై నాలుగు వరుసల రోడ్డు ఇరుకుగా మారి దాన్ని వెంటనే విస్తరించాల్సిన పరిస్థితి వస్తుందన్న అభిప్రాయం నెలకొంది. ఒకవేళ ఐదేళ్లలోనే ఆర్‌ఆర్‌ఆర్‌ను విస్తరించాల్సి వస్తే నిర్మాణ వ్యయం పెరగనుంది. ఈ నేపథ్యంలో ఒకేసారి 6 వరుసలుగా ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మిస్తే కనీసం 15 ఏళ్ల వరకు దాన్ని విస్తరించాల్సిన అవసరం ఉండదన్నది కేంద్రం ఆలోచన. వాహనాల రాకపోకలు 30 వేల పీసీయూల లోపు ఉంటే 4 వరుసలు సరిపోతాయని... అంతకంటే పెరిగితే రోడ్డు ఇరుకు అవుతుందని నిర్ధారిత ప్రమాణాలు చెబుతున్నాయి. కానీ ఐదేళ్లలోనే ఈ సంఖ్య 40 వేలను మించుతుందని కేంద్రం తాజాగా అంచనా వేసింది.రోడ్డు నిర్మాణానికి రూ. 8,800 కోట్లు!నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానికి రూ. 6,300 కోట్ల వరకు ఖర్చవుతుందని టెండర్‌ నోటిఫికేషన్‌లో ఎన్‌హెచ్‌ఏఐ అంచనా వేసింది. ఇప్పుడు దాన్ని 6 వరుసలుగా నిర్మిస్తే ఆ మొత్తం రూ. 8,800 కోట్ల వరకు అవుతుందని భావిస్తోంది. అయితే ఒకేసారి 8 వరుసలకు సరిపడా భూసేకరణ జరుగుతున్నందున దాని వ్యయంలో ఎలాంటి మార్పు ఉండదు.తొలుత రెండు వరుసలు చాలనుకొని..రీజనల్‌ రింగురోడ్డును ప్రతిపాదించాక నాలుగు వరుసల రోడ్డుకు సరిపడా ట్రాఫిక్‌ ఉండదని భావించి కేంద్రం తొలుత రెండు వరుసలకే పరిమితమవుదామని పేర్కొంది. కానీ కనీసం నాలుగు వరుసలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఒప్పించింది. అయినప్పటికీ ఈ విషయంలో అనుమానం తీరకపోవడంతో ఉత్తర–దక్షిణ భాగాలను ఏకకాలంలో చేపట్టకుండా తొలుత ఉత్తర భాగాన్ని నిర్మించి తర్వాత దక్షిణ భాగం సంగతి చూద్దామనుకుంది. అలాంటి స్థితి నుంచి కేంద్రం ఏకకాలంలో ఆరు వరుసలను నిర్మించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా తాజాగా ఆదేశించడం విశేషం. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ట్రాఫిక్‌ స్టడీ నివేదిక అందాక దాన్ని నిపుణుల సమక్షంలో విశ్లేషించి కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. తుది నిర్ణయం ఆధారంగా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు అప్పటికప్పుడు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే పలిచిన టెండర్లను త్వరలో తెరిచి నిర్మాణ సంస్థను ఖరారు చేయనున్నారు.

Home Minister urges Naxals to drop their weapons and join the mainstream5
ఆయుధం వీడి.. అభివృద్ధిలో భాగస్వాములు కండి

దంతెవాడ(ఛత్తీస్‌గఢ్‌): మావోయిస్ట్‌ పార్టీ శ్రేణులకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్నేహ హస్తం చాపారు. ఆయుధాలను వదిలేసి, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని అమిత్‌ షా వారికి పిలుపునిచ్చారు. నక్సలైట్‌ చనిపోతే ఎవరూ హర్షించరన్న ఆయన.. 2026 మార్చి కల్లా వామపక్ష తీవ్రవాదాన్ని రూపుమాపాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. బస్తర్‌ ప్రాంత గిరిజనుల అభివృద్ధిని అడ్డుకోగల సత్తా మావోయిస్టులకు నేడు లేదని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘బస్తర్‌ పాండుమ్‌’ఉత్సవం ముగింపు కార్యక్రమంలో శనివారం మంత్రి షా ప్రసంగించారు. ‘బస్తర్‌లో తుపాకీ కాల్పులు, బాంబుల మోతలు వినిపించే రోజులు పోయాయి. ఇకనైనా ఆయుధాలను విడనాడి, ప్రధాన జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్ట్‌ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరూ ఈ దేశ పౌరులే. నక్సలైట్‌ చనిపోతే ఎవరూ సంతోషపడరు. మీ ఆయుధాలను అప్పగించండి. ఆయుధాలు చూపి బస్తర్‌ ప్రాంత గిరిజన సోదరసోదరీమణుల పురోభివృద్ధిని ఆపలేరు’అని ఆయన స్పష్టం చేశారు. లొంగిపోయి అభివృద్ధి ప్రక్రియలో పాలుపంచుకునే మావోయిస్ట్‌లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి భద్రత కల్పిస్తాయని మంత్రి భరోసా ఇచ్చారు. ‘బస్తర్‌ గత 50 ఏళ్లుగా ఎంతో వెనుకబాటుకు గురైంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇందుకోసం అవసరమైనవన్నీ సమకూర్చేందుకు ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ సుసాధ్యం కావాలంటే బస్తర్‌ ప్రజలు తమ గ్రామాలను నక్సలైట్‌ రహితంగా మార్చాలని నిర్ణయించుకోవాలి. ప్రతి ఒక్కరికీ ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, ఆరోగ్య బీమా సమకూర్చడంతోపాటు చిన్నారులు స్కూలుకు వెళ్లగలిగి, ఆరోగ్య కేంద్రాలు పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యం’అని అమిత్‌ షా అన్నారు. మావోయిస్ట్‌ విముక్త గ్రామాలకు రూ. కోటి నక్సలైట్లు లొంగుబాట పట్టేలా కృషి చేసి, మావోయిస్ట్‌ రహితంగా ప్రకటించుకునే గ్రామాలకు రూ.కోటి చొప్పున అందజేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని అమిత్‌ షా గుర్తు చేశారు. రూ.కోటి అందుకునేందుకు ప్రతి గ్రామం తీవ్రంగా కృషి చేయాలని కోరారు. నక్సలిజాన్ని తుదముట్టించేందుకు ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నామంటూ ఆయన...‘అభివృద్ధికి ఆయుధాలు, గ్రనేడ్లు, మందుపాతరలతో అవసరం లేదు, కంప్యూటర్లు, పెన్నులు ఉంటే సరిపోతుందని అర్థం చేసుకునే వారు లొంగిపోయారు. 2024లో 881 మంది, 2025లో ఇప్పటివరకు మొత్తం 521 మంది మావోయిస్ట్‌లు ఆయుధాలను అప్పగించారు. లొంగిపోయిన వారు జన జీవన స్రవంతిలో కలుస్తారు, మిగిలిన వారి పనిని భద్రతా బలగాలు చూసుకుంటాయి. వచ్చే ఏడాది మార్చి కల్లా రెడ్‌ టెర్రర్‌ నుంచి దేశానికి విముక్తి కలుగనుంది’అని అమిత్‌ షా అన్నారు.

Gurajala MLA Yarapathineni Srinivasa Rao Rowdyism In Piduguralla6
టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని అవినీతి దాహం..

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: ఆయన టీడీపీ ఎమ్మెల్యే.. అందరి ప్రజాప్రతినిధుల కంటే ఈయన వైఖరి చాలా భిన్నం. గూండాగిరి ఆయ­న సహజ లక్షణం. తన స్వ­లా­­భం కోసం ఎలాంటి దాదా­గిరికైనా వెనుకా­డరు. దాడులు, దౌర్జ­న్యా­ల­కూ తెగబడ­తారు. సీబీ­­ఐ కేసుల్లో విచా­రణ ఎదుర్కొంటున్న ఈ ఎమ్మెల్యే కన్ను ఇ­ప్పు­డు ఈ ప్రాంతంలోని సి­మెంట్‌ ఫ్యాక్ట­రీ­లపై ప­డింది. గతంలో పల్నాడు జిల్లా­లో అడ్డగోలు­గా మైనింగ్‌ని కొ­ల్ల­గొట్టి.. రూ.వేల కోట్లు దోచు­కున్న పల్నాడు జిల్లా గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఇప్పుడు సిమెంట్‌ ఫ్యాక్టరీలను తన దారిలోకి తెచ్చుకునేందుకు అరాచకాలకు తెరలేపారు. దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలోని భవ్య (అంజనీ) సిమెంట్‌ ఫ్యాక్టరీ, అదే మండలంలోని పెదగార్లపాడులోని చెట్టినాడ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలపై తన అనుచరులతో దాడులు చేయించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనకు అనుకూలంగా ఉండే అధికా­రులను ఫ్యాక్టరీల మీదకు ఉసిగొల్పు­తున్నా­రు. గ్రామస్తులు, రైతులను అడ్డం పెట్టుకుని..పెదగార్లపాడు గ్రామంలో సుమారు రూ.2వేల కోట్లతో నిర్మించిన చెట్టినాడ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ 2020 నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీలో పర్మినెంట్, కాంట్రాక్టు పద్ధతిలో 800 మంది కార్మి­కులు పనిచేస్తున్నా­రు. రోజుకి నాలుగువేల టన్నుల సిమెంట్‌ ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గురజాల టీడీపీ ఎమ్మె­ల్యే యరపతినేని శ్రీనివాసరావు కన్ను ఈ ఫ్యాక్టరీపై పడింది. తన దందాలను సాధించుకోవడంపై యరపతినేని దృష్టిసారించారు. ప్రతి సిమెంట్‌ బస్తాకి కొంత మొత్తం డబ్బు, మైనింగ్‌ కార్యకలాపాల్లో వాటాలు, తన అనుచరులకు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టు, ఫ్యాక్ట­రీకి వచ్చే లాభాల్లో వాటాలూ ఇవ్వాలని యాజ­మాన్యంపై ఒత్తిడి తెచ్చారు. దీనికి యాజమాన్యం అంగీకరించలేదు. దీంతో.. రైతులు, గ్రామస్తులను ముందుపెట్టి ఆందోళనకు తెరలేపారు. యరపతినేని అరాచకాలు ఇలా..తొలుత ఫ్యాక్టరీలోకి కార్మికులను రాకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత..⇒ సిమెంట్, బొగ్గు, జిప్సం సరఫరా చేసే లారీలను ఫ్యాక్టరీలోకి రానివ్వలేదు. ⇒ అనంతరం.. ఇతర రాష్ట్రాలకు సిమెంట్‌ సరఫరా చేసే రైలు వ్యాగన్లను కూడా అడ్డుకున్నారు. ⇒ సిమెంట్‌ లోడ్‌ కోసం ఫ్యాక్టరీలోకి వెళ్లే లారీలను బలవంతంగా బయటకు పంపి అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశారు. ⇒ ఆఖరికి ఫ్యాక్టరీకి డీజిల్‌ సరఫరా చేసే ట్యాంకర్లని కూడా అడ్డుకున్నారు. ఇలా.. యరపతినేని ఆగ­డా­లు రోజురోజుకూ పెరిగిపోవడంతో రవాణా పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. గతనెల 11 నుంచి ఫ్యాక్టరీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో ఫ్యాక్టరీ గేట్లకు యాజ­మాన్యం తాళాలు వేసింది.భవ్య సిమెంట్‌ ఫ్యాక్టరీలోనూ బీభత్సం..ఇదే విధంగా తంగెడ వద్ద ఉన్న భవ్య (అంజనీ) సిమెంట్‌ ఫ్యాక్టరీపై కూడాయరపతినేని అనుచరులు దాడిచేసి బీభత్సం సృష్టించారు. ఇక్కడ కూడా రవాణా నిలిచిపోయింది. ఫ్యాక్టరీ లోపలికి యరపతినేని అనుచరులు వెళ్లి నానా హంగామా సృష్టించారు. లారీ డ్రైవర్లపై దాడులకు తెగబడ్డారు. ఈ రెండు ఫ్యాక్టరీలపై యరపతినేని అరాచకాలు చేస్తూ మిగిలిన సిమెంట్‌ ఫ్యాక్టరీలకు సైతం ఇదే గతి పడుతుందని సంకేతాలు పంపిస్తున్నారు. దీంతో పారిశ్రామికవేత్తల్లో అలజడి మొదలైంది. రోడ్డున పడ్డ వేలాది కుటుంబాలు..చెట్టినాడ్, భవ్య సిమెంట్‌ ఫ్యాక్టరీలు మూతపడటంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఈ రెండు ఫ్యాక్టరీల ద్వారా రెండువేల మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చెట్టినాడ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అన్ని అనుమతులు ఇవ్వడంతో సకాలంలో నిర్మాణం పూర్తిచేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇప్పుడు రెండు ఫ్యాక్టరీలు మూతపడడంతో కార్మికులు ఉపాధిలేక రోడ్డున పడ్డారు. పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు.. యరపతినేని అగడాలు చూసి ఆయా గ్రామాలకు చెందిన సొంత పార్టీ నేతలే చీదరించుకుంటున్నారు.ఫ్యాక్టరీలపై అధికారుల కక్షసాధింపు..ఇక చెట్టినాడ్, భవ్య సిమెంట్‌ ఫ్యాక్టరీల విషయంలో ప్రభుత్వ అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శి­స్తు­న్నారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు ఆత్మీయుడుగా చెప్పుకునే పల్నాడు జిల్లా కలెక్టర్‌ పి. అరుణ్‌బాబు ఫ్యాక్టరీల వ్యవహారంపై యరపతినే­నికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణ­లు­న్నాయి. ఈ క్రమంలో.. యరపతినేని ఆదేశాలతో రెండు వారాల క్రితం పల్నాడు కలెక్టరేట్‌లో సిమెంట్‌ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారిని దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారు.ఇక యరపతినేని దగ్గర మెప్పు పొందటం కోసం కొందరు అధికారులు వేలాదిమంది కార్మికులకు ఉపాధి చూపించే ఫ్యాక్టరీలపై కక్షపూరితంగా వ్యవహరి­స్తున్నారని స్థానికులు వాపోతున్నారు. మైనింగ్‌ చేసేందుకు గ్రామ పంచాయతీల అనుమతు­ల్లేవని.. ఎన్‌ఎస్‌పీ కాలువలపై నిర్మించిన రైలు­బ్రిడ్జిలు నాణ్యంగా లేవన్న సాకులు చూపించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.పారిశ్రామికవేత్తల అసహనం.. మరోవైపు.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టడంపై పారిశ్రామికవేత్తలు తీవ్ర అసహనంతో ఉన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద పంచాయితీ పెట్టేందుకు సమాయత్తమయ్యారు. వెనుకబడిన పల్నాడు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో టీడీపీ కూటమి నేతల దుర్మార్గాలవల్ల జిల్లా మరోసారి తిరోగమనం పడుతుందన్న భయం ప్రజల్లో నెలకొంది.టీడీపీ కూటమి పాలనలో వేధింపులు ఎన్నో..ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో టీడీపీ కూటమి గత జూన్‌లో అధికారంలోకి వచ్చీరాగానే అరాచకా­ల­కు తెరలేపింది. అప్పటి నుంచి ఆ పార్టీల నేతలు చేయని విధ్వంసం లేదు. పైస్థాయిలోని ‘ముఖ్య’ నేతల దన్నుతో నీకింత.. నాకింత అన్నట్లుగా ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు. ఉదా..⇒ ఇక ముంబై నటి కాదంబరి జెత్వానీ విషయంలోనూ లేనిపోని అపోహలు సృష్టించి పారిశ్రామిక దిగ్గజం సజ్జన్‌ జిందాల్‌ను రాష్ట్రం నుంచి పారిపోయేలా పరిస్థితులు సృష్టించారు. ఇలా.. టీడీపీ నేతల ఆగడాలు భరించలేక పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తిపోతున్నారు.⇒ కాకినాడ పోర్టు, సెజ్‌ను బెదిరించి తన నుంచి లాగేసుకున్నారని టీడీపీ సానుభూతిపరుడు కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదుతో అరబిందో ఫార్మాకు చెందిన శరత్‌చంద్రారెడ్డిని కేసులతో వేధిస్తున్నారు.⇒ గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజుల్లోనే శ్రీకాకుళం జిల్లాలోని యూబీ బీర్ల ఫ్యాక్టరీలో టీడీపీ శ్రేణులు అలజడి సృష్టించారు. నెలనెలా కప్పం కడితే తప్ప లోడ్‌ లారీలు బయటకు రాలేని పరిస్థితులు సృష్టించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ విషయాన్ని ఢిల్లీలోని బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో స్థానిక టీడీపీ నేతలకు తలొగ్గింది.⇒ అలాగే, ఫ్లైయాష్‌ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య చెలరేగిన రగడ అంతాఇంతా కాదు. ఫైయాష్‌ లోడింగ్‌ విషయంలో వీరి మధ్య తలెత్తిన వివాదంతో ఆర్టీపీపీ (రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌) ట్రాన్స్‌పోర్టు యజమానులు బాగా నలిగిపోయారు.

Prabhas stays away from brand endorsements7
బ్రాండ్‌ ఎండోర్స్‌మెంట్లకు దూరంగా ప్రభాస్‌

మహేష్‌బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ వంటి సమకాలీకులతో పోలిస్తే రెబల్ స్టార్‌ ప్రభాస్‌(Prabhas) మాత్రం బ్రాండ్‌ ఎండోర్స్‌మెంట్లకు దూరంగా వుంటారు. చాలా కాలం క్రితం ఓ ప్రముఖ కార్ల సంస్ధకు ప్రభాస్‌ బ్రాండ్‌ ఎండోర్స్‌మెంట్‌ చేశారు. ఆ తరువాత మళ్లీ ఏ బ్రాండ్‌కు తను పని చేయలేదు. అయితే ఇటీవల కాలంలో పలు ప్రముఖ బ్రాండ్ల నుండి ఆఫర్లు వచ్చినప్పటికీ ప్రభాస్‌ వాటిని సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఒక ప్రముఖ కోలా కంపెనీతో పాటు ఓ ఆటోమొబైల్‌ కంపెనీ వారు ప్రభాస్‌ను సంప్రదించగా తను వాటిపై ఆసక్తి చూపలేదట.ఓ యాడ్‌కు కేవలం మూడు రోజుల్లోనే 25 కోట్ల వరకు సంపాదించగలిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రభాస్‌ మాత్రం బ్రాండ్‌ ఎండోర్స్‌మెంట్‌లు చేయడానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఓ సెలబ్రిటీ మేనేజర్‌ తెలిపారు.మహేష్‌బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరోలు ఇప్పటికే పలు బ్రాండ్‌తో ఒప్పందాలు చేసుకుని ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. కానీ ప్రభాస్‌ మాత్రం తన ఫోకస్‌ అంతా నటన, సినిమాలపైనే పెట్టారు. సినిమాలకే పూర్తి సమయం కేటాయిస్తున్నారు. ఇలా తనకు కోట్లలో భారీ మొత్తాలను చెల్లించేందుకు పలు బ్రాండ్‌లు సిద్ధంగా ఉన్నప్పటికీ డార్లింగ్‌ మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ కేవలం తన నటనపై మాత్రమే ఫోకస్‌ పెట్టారంటూ ఆ సెలబ్రిటీ మేనేజర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్న ప్రభాస్‌ ఒక్కో సినిమాకు వందల కోట్ల రెమ్యునిరేషన్‌ తీసుకుంటూ టాప్‌ స్టార్‌గా ఉన్నప్పటికీ బ్రాండ్‌ ఎండోర్స్‌మెంట్లకు దూరంగా ఉండటం ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను తెలిజేస్తుంది.

Handshake that feels like a shock8
హ్యాండ్‌షేక్‌.. షాక్‌

మీరెప్పుడైనా నిలబడి సరదాగా అప్పటిదాకా మాట్లాడుతున్న వ్యక్తితో వీడ్కోలు చెప్పబోతూ కరచాలనం ఇస్తే చేతికి షాక్‌ కొట్టిందా?. ఎవరో కూర్చున్న కుర్చిని వెనక్కో ముందుకో లాగబోతూ పట్టుకుంటే టప్పున షాక్‌ కొట్టిందా?. గుండ్రంగా వెండిరంగులో మెరిసే డోర్‌నాబ్‌ను పట్టుకోగానే చిన్నపాటి షాక్‌కు గురయ్యారా?. ఈ కరెంట్‌ ఎక్కడి నుంచి వచ్చిందనే డౌట్‌ మీలో ఉండిపోతే అలాంటి సైన్స్‌ ప్రియుల కోసం పరిశోధకులు కొన్ని సమాధానాలను సిద్ధంచేశారు. చదివేద్దామా మరి !! ఉపరితలం చేసే మేజిక్కుప్రతి వస్తువులో కణాలకు విద్యుదావేశశక్తి దాగి ఉంటుంది. అయితే ఆయా వస్తువుల ఉపరితలాల ఎలక్ట్రిక్‌ స్థిరత్వం అనేది వాతావరణాన్ని తగ్గట్లు మారతుంది. అంటే గాలిలో తేమ పెరగడం, తగ్గడం, ఎండాకాలం, వర్షాకాలం వంటి సందర్భాల్లో వస్తువుల ఉపరితల ఎలక్టిక్‌ స్థిరత్వం దెబ్బతిని అసమతుల్యత ఏర్పడుతుంది. ఉదాహరణకు ఒక ప్లాస్టిక్‌ కుర్చిని తీసుకుంటే దాని ఉపరితల ఎలక్టిక్‌ ఛార్జ్‌ అనేది ఎండాకాలంలో ఒకలా, చలికాలంలో మరోలా ఉంటుంది. అదే సమయంలో పాలిస్టర్, ఉన్ని ఇలా విభిన్న వస్త్రంతో తయారైన దుస్తులు ధరించి మనిషి శరీర ఉపరితల ఎలక్ట్రిక్‌ చార్జ్‌ సైతం భిన్నంగా ఉంటుంది. చలికాలంలో వాతావరణం చల్లబడటంతో గాలిలో తేమ శాతం తగ్గుతుంది. చల్లటి గాలి అధిక తేమను పట్టి ఉంచలేదు. దీంతో చల్లటి గాలి తగిలిన ప్లాస్టిక్‌ కుర్చీ ఉపరితలంలో అసమాన ఎలక్ట్రిక్‌ చార్జ్‌ ఉంటుంది. దీనిని విభిన్న ఎలక్టిక్‌ ఛార్జ్‌ ఉన్న మనిషి హఠాత్తుగా పట్టుకుంటే సమస్థాయికి తీసుకొచ్చేందుకు అత్యంత స్వల్పస్థాయిలో విద్యుత్‌కణాలు అటుఇటుగా రెప్పపాటు కాలంలో ప్రయాణిస్తాయి. ఉపరితలంలో కదిలే ఆ విద్యుత్‌ కణాల ప్రవాహ స్పర్శ తగిలి మనం షాక్‌ కొట్టిన అనుభూతిని పొందుతాం. మనిషి, ఇంకో మనిషికి షేక్‌ హ్యాండ్‌ ఇచి్చనప్పుడు కూడా ఇదే భౌతిక శాస్త్ర దృగ్విషయం జరుగుతుంది. అందుకే కొందరు మనుషుల్ని పొరపాటున పట్టుకున్నా మనకు వెంటనే షాక్‌ కొడుతుంది. అంతసేపు ఒకరు కూర్చున్న ఛైర్‌ను పట్టుకున్నా షాక్‌ రావడానికి అసలు కారణం ఇదే. చలికాలంలోనే ఎక్కువ! మిగతా కాలంతో పోలిస్తే చలికాలంలో వాతావరణంలో గాలిలో తేమ మారుతుంది. ముఖ్యంగా మనం కొద్దిసేపు ఆరుబయట గడిపి లోపలికి రాగానే అంతసేపు పాలిస్టర్, నైలాన్‌ వంటి సింథటిక్‌ దుస్తుల ధరించిన మన శరీర ఉపరితల చార్జ్‌ అనేది ధనావేశంతో లేదా రుణావేశంతో ఉంటుంది. గదిలోకి వచ్చి వెంటనే అక్కడి మనుషుల్ని, ఛైర్, డోర్‌నాబ్‌ వంటి వాటిని పట్టుకుంటే అవి అప్పటికే వేరే గాలి వాతావరణంలో భిన్నమైన ఆవేశంతో ఉంటాయి కాబట్టి మనకు షాక్‌ కొట్టే అవకాశాలే ఎక్కువ. తేమలేని గాలిలో చలికాలంలో ఈ షాక్‌ ఘటనలు ఎక్కువగా, తేమ అధికంగా ఉండే ఎండాకాలంలో ఈ షాక్‌ ఘటనలు తక్కువగా చూస్తుంటాం. దీనిని మనం పట్టుకునే, తగిలి, ముట్టుకునే వస్తువుల ఉపరితల ధనావేశం, రుణావేశమే కారణం. దీనిని తప్పించుకోలేమా? ఈ తరహా పరిస్థితుల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. మన శరీర ఉపరితల అత్యంత సూక్ష్మస్థాయి విద్యుత్‌స్థాయిలు ఒకేలా ఉండేలా చర్మానికి లోషన్‌ లాంటివి రాసుకోవచ్చు. సింథటిక్‌ వస్త్రంతో చేసిన దుస్తులకు బదులు సహజసిద్ధ కాటన్‌ దుస్తులు ధరించడం మంచిది. నేల, గడ్డిపై నడిచేటప్పుడు స్టాటిక్‌ విద్యుత్‌కు గురికాకుండా ఉండాలంటే చెప్పులు, షూ లాంటివి ధరించకుండా చెప్పుల్లేకుండా నడవండి. ఇకపై మీరెప్పుడైనా ఇంట్లో సాధారణ పరిస్థితుల్లో ఇలాంటి షాక్‌కు గురైతే సరదాగా తీసుకోండి. అద్భుత, విచిత్ర సైన్స్‌కు మీరూ సాక్షీభూతంగా నిలిచామని సంబరపడండి. స్టాటిక్‌ షాక్‌ ప్రమాదమా? స్థిర విద్యుత్‌తో మని షికి దైనందిన జీవితంలో ఎలాంటి ప్రమాదంలేదు. సెకన్‌ వ్యవధిలో షాక్‌ అనుభూతి వచ్చి పోతుంది. కానీ మండే స్వభావమున్న వస్తువుల సమీపంలో, అత్యంత సున్నితమైన ఎల్రక్టానిక్‌ వస్తువుల వద్ద మనిషికి స్టాటిక్‌ విద్యుత్‌ ప్రాణహాని కల్గించే అవకాశాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా గ్యాస్‌ స్టేషన్లు, కంప్యూటర్‌ చిప్‌ తయారీ కర్మాగారాల్లో స్టాటిక్‌ ఎలక్ట్రిసిటీ చాలా ప్రమాదకరం. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

IPL 2025: Rajasthan Royals thrash Punjab Kings by 50 runs9
రాయల్స్‌ ఘనవిజయం

మూల్లన్‌పూర్‌: తొలి రెండు మ్యాచ్‌లలో చక్కటి ఆటతో విజయాలు సొంతం చేసుకున్న పంజాబ్‌ కింగ్స్‌కు సొంత మైదానంలో ఆడిన మొదటి పోరులో ఓటమి ఎదురైంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చిన రాజస్తాన్‌ రాయల్స్‌ 50 పరుగుల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (45 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... రియాన్‌ పరాగ్‌ (25 బంతుల్లో 43 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్‌ సంజు సామ్సన్‌ (26 బంతుల్లో 38; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. జైస్వాల్, సామ్సన్‌ తొలి వికెట్‌కు 62 బంతుల్లోనే 89 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. ఫెర్గూసన్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. నేహల్‌ వధేరా (41 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీ చేయగా, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. ఆర్చర్‌ వేసిన తొలి ఓవర్లోనే 2 వికెట్లు సహా 43 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకున్న పంజాబ్‌ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. వధేరా, మ్యాక్స్‌వెల్‌ ఐదో వికెట్‌కు 52 బంతుల్లో 88 పరుగులు జత చేసి ఆశలు రేపినా... విజయానికి అది సరిపోలేదు. స్కోరు వివరాలు రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బి) ఫెర్గూసన్‌ 67; సామ్సన్‌ (సి) అయ్యర్‌ (బి) ఫెర్గూసన్‌ 38; పరాగ్‌ (నాటౌట్‌) 43; నితీశ్‌ రాణా (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) యాన్సెన్‌ 12; హెట్‌మైర్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) అర్ష దీప్ 20; జురేల్‌ (నాటౌట్‌) 13; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–89, 2–123, 3–138, 4–185. బౌలింగ్‌: అర్‌‡్షదీప్‌ 4–0–35–1, యాన్సెన్‌ 4–0–45–1, ఫెర్గూసన్‌ 4–0–37–2, మ్యాక్స్‌వెల్‌ 1–0–6–0, చహల్‌ 3–0–32–0, స్టొయినిస్‌ 4–0–48–0. పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్షి (బి) ఆర్చర్‌ 0; ప్రభ్‌సిమ్రన్‌ (సి) హసరంగ (బి) కార్తికేయ 17; శ్రేయస్‌ అయ్యర్‌ (బి) ఆర్చర్‌ 10; స్టొయినిస్‌ (సి) అండ్‌ (బి) సందీప్‌ 1; వధేరా (సి) జురేల్‌ (బి) హసరంగ 62; మ్యాక్స్‌వెల్‌ (సి) జైస్వాల్‌ (బి) తీక్షణ 30; శశాంక్‌ సింగ్‌ (నాటౌట్‌) 10; సూర్యాంశ్‌ (సి) హెట్‌మైర్‌ (బి) సందీప్‌ 2; యాన్సెన్‌ (సి) హెట్‌మైర్‌ (బి) తీక్షణ 3; అర్ష దీప్ (సి) హసరంగ (బి) ఆర్చర్‌ 1; ఫెర్గూసన్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–11, 3–26, 4–43, 5–131, 6–131, 7–136, 8–145, 9–151. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–25–3, యు«ద్‌వీర్‌ 2–0–20–0, సందీప్‌ శర్మ 4–0–21–2, తీక్షణ 4–0–26–2, కార్తికేయ 2–0–21–1, హసరంగ 4–0–36–1.

Impact of US tariffs on seafood exporters Andhra Pradesh10
ఇప్పటికే రూ. 600 కోట్లు నష్టం!

సాక్షి, అమరావతి: అమెరికా దిగుమతి సుంకం రాష్ట్ర మత్స్య ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నెల 9వ తేదీ నుంచి భారం ప్రత్యక్షంగా పడనుంది. ఏప్రిల్‌ మొదటి వారంలో భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యేందుకు మత్స్య ఉత్పత్తులతో 2 వేల షిప్‌మెంట్లు సిద్ధంగా ఉన్నాయి. మరో 2,500 షిప్‌మెంట్లకు సరిపడా సరుకు కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉంది. వీటిలో మొత్తంగా దాదాపు 3,500 షిప్‌మెంట్లు ఏపీకి చెందినవేనని ఎగుమ­తిదారులు చెబుతున్నారు. కొత్తగా విధించిన దిగుమతి సుంకం ప్రకారం లెక్కిస్తే వీటిపై భారం రూ.600 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ మేరకు నష్టపో­వడమే తప్ప ఈ భారాన్ని తిరిగి కొనుగోలుదారులపై వెయ్యలేని పరిస్థితి ఉందని ఎగుమతిదారులు చెబుతున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత్‌–అమెరికాల మధ్య జరిగిన వ్యాపార లావాదేవీల విలువ 6.6 బిలియన్‌ డాలర్లు. వీటిలో ఎగుమతుల విలువ 5 బిలియన్‌ డాలర్లు, దిగుమతుల విలువ 1.6 బిలియన్‌ డాలర్లు. ఎగుమతుల్లో మత్స్య ఉత్పత్తుల విలువ 2.55 బిలియన్‌ డాలర్లపైమాటే. అమెరికాకు ఆహార, మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాల్లో 42.3 శాతంతో భారత్‌ మొదటి స్థానంలో నిలవగా, 26.9 శాతంతో ఈక్విడార్‌ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా ఇండోనేషియా (15.4%), వియత్నాం (7.2 %), థాయిలాండ్‌ (2.4%), అర్జంటేనియా (2.1%) దేశాలు ఉన్నాయి.భారత్‌ను అధిగమించనున్న ఈక్విడార్‌ భారత్‌పై 27 శాతం దిగుమతి సుంకం విధించిన అమెరికా.. ఈక్విడార్‌ నుంచి దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తులపై కేవలం 10 శాతం మాత్రమే సుంకం విధించింది. ఈ కారణంగా ఈక్విడార్‌ నుంచి పోటీని తట్టుకోవడం కష్టమేనని, భారత్‌కు వచ్చే ఆర్డర్స్‌ అన్నీ ఇక ఈక్విడార్‌కు వెళ్లే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ఇప్పటికే ఏటా 11–12 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తితో ఈక్విడార్‌ మన దేశాన్ని రెండవ స్థానానికి నెట్టేసింది. కాగా, రాష్ట్రంలో నిన్నటి వరకు కిలోకు రూ.20–40 మేర కోత పెట్టి కొనుగోలు చేయగా, శనివారం ఏకంగా రూ.30–90 వరకు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. మొన్నటి వరకు 30 కౌంట్‌ (కిలోకు వచ్చే రొయ్యల సంఖ్య) కిలో రూ.470 పలుకగా, శనివారం రూ.380తో.. 50 కౌంట్‌ అయితే రూ.360– రూ.300కు తగ్గించేశారు. దీంతో కంపెనీల నుంచి స్పష్టత వచ్చే వరకు పట్టుబడులు పట్టకూడదని ఆక్వా రైతు సంఘాలు నిర్ణయించాయి. కనీసం 10–15 రోజుల వరకు పట్టుబడులు పట్టకూడదని రైతులకు సూచిస్తున్నారు.ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ట్రంప్‌ టాక్స్‌ సాకుతో ధరలు తగ్గించడం సరికాదు. పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో ఇప్పుడు లభిస్తున్న ధరలే గిట్టుబాటు కావడం లేదు. ఈ ధరలను కూడా మరింత తగ్గిస్తే సమీప భవిష్యత్‌లో పూర్తిగా ఆక్వా సాగుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి. రైతుల తరఫున ఉద్యమించేందుకు ఫెడరేషన్‌ సిద్ధంగా ఉంది.– గాదిరాజు వెంకట సుబ్బరాజు (జీకేఎఫ్‌), ప్రధాన కార్యదర్శి, ఏపీ రొయ్య రైతుల సమాఖ్య

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement