రాజ్యసభ ఎన్నికలు, సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు తిరుగుబాటు స్వరం తదితర పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది.
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలు, సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు తిరుగుబాటు స్వరం తదితర పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక గురించి వీరితో చర్చించే అవకాశముంది. అయితే ఢిల్లీ వెళ్లే విషయంలో సీఎం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని సమాచారం.
రాష్ట్రంలో ఆరు స్థానాలకు జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లలో కాంగ్రెస్కు మూడు దక్కనున్నాయి. అయితే సీమాంధ్ర నాయకులు రెబల్ అభ్యర్థుల్ని నిలబెట్టి హైకమాండ్కు షాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల బరిలో ఉంటానని ఇప్పటికే సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించగా, మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా నిలబడే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తాజా పరిణామాలపై కలవరం చెందిన అధిష్టానం ఈ విషయంపై చర్చించేందుకు కిరణ్, బొత్సలను ఢిల్లీకి రమ్మన్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.