
సంక్షేమం భారం
జిల్లాలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమానికి చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రేషన్ కార్డులను ఆధార్‌తో ముడిపెట్టింది.
సబ్సిడీల భారం తగ్గించుకొనేందుకు
కొత్త ప్రభుత్వం ఆధార్ మంత్రం జపిస్తోంది. సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి చేయవద్దని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పినా అవేమీ పట్టనట్టు టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎన్నికల సమ యంలో హామీలు గుప్పించిన టీడీపీ అధినేత వాటిని అమలు చేసే దారి లేక సతమతమవుతున్నారు. లబ్ధిదారులను కుదించి సంక్షేమ పథకాల భారం దించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
సాక్షి, గుంటూరు: జిల్లాలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమానికి చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రేషన్ కార్డులను ఆధార్‌తో ముడిపెట్టింది. ఆధార్‌తో అనుసంధానమై వున్న రేషన్ కార్డుల లబ్ధిదారులకు మాత్రమే ఇకపై నిత్యవసర వస్తువులు పంపిణీ చేసే ప్రక్రియ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే అధికార యంత్రాంగం ఆ దిశగా కసరత్తు చేస్తోంది. రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయడం ప్రారంభించింది.
జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియను అధికారులు దాదాపు 65 శాతం పూర్తి చేశారు.ఈ నెలాఖరుకు నూరు శాతం పూర్తి చేసేందుకు ప్రణాళిలు సిద్ధం చేశారు.ఆధార్‌తో అనుసంధానం కాని కార్డుల్లోని సభ్యుల సంఖ్య 14,91,443గా ఉంది.
ఈ ప్రక్రియ ఫలితాలు విన్న బోగస్ రేషన్ కార్డుదారులు ఇప్పటికే హడలిపోతున్నారు. ఇకపై కార్డుల్లోని సభ్యుల సంఖ్య భారీగా తగ్గనుంది. జిల్లాలో ఇప్పటికే 29,130 బోగస్ రేషన్ కార్డులను అధికారులు తొలగించినట్టు సమాచారం.కార్డులో ఉన్న అందరి సభ్యుల పేర్లలను ఆధార్‌కు అనుసంధానిస్తారు. దీంతో వేర్వేరు కార్డుల్లో ఒకే సభ్యుల పేర్లు నమో దు అయితే తెలుసుకోనే అవకాశం ఉంది.
ఈ ప్రక్రియ ఆధార్ కార్డు పొందని వారికి ఆశనిపాతంగా మారనుంది. అయితే జిల్లా లో ఆధార్ కార్డుల నమోదు 99 శాతం పూర్తయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆధార్‌తో అనుసంధానం చేయని పక్షంలో రేషన్‌ను నిలిపివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.అనుసంధాన ప్రక్రియ పూర్తయితే లక్షకు పైగా కార్డులు గల్లంతయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.ప్రస్తుతం జిల్లాలో 19,393.544 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పేదలకు ఇస్తున్నారు. అనుసంధానం పూర్తయితే ఇందులో 25 శాతం మేర కోత పడే అవకాశం ఉంది.
నెలాఖరులోపు పూర్తి..
రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం జరుగుతోంది. జిల్లాలో ఇప్పటికే 65 శాతం పూర్తయింది. ఈ నెలాఖరుకు నూరుశాతం పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం.
- యలమందరావు,
సహాయ పౌరసరఫరాల శాఖాధికారి,గుంటూరు.