దేశీ క్యాపిటల్ మార్కెట్లపట్ల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లపట్ల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. వెరసి 2014 తొలి నాలుగు నెలల్లో ఇటు ఈక్విటీలలో 5 బిలియన్ డాలర్లు, అటు రుణ పత్రాల(డెట్ సెక్యూరిటీస్)లో మరో 5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. దీంతో జనవరి నుంచీ ఎఫ్‌ఐఐల పెట్టుబడులు 10 బిలియన్ డాలర్లను(రూ. 60,000 కోట్లు) తాకాయి. ఫలితంగా దేశంలోకి ఇప్పటివరకూ ప్రవహించిన ఎఫ్‌ఐఐల పెట్టుబడుల మొత్తం విలువను 200 బిలియన్ డాలర్లకు చేరింది. సెబీ వెల్లడించిన తాజా గణాంకాలివి. అయితే ఏప్రిల్ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌ఐఐలు ఈక్విటీలలో రూ. 8,500 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, డెట్ మార్కెట్ల నుంచి రూ. 7,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం.