పడగొట్టిన ‘ఫెడ్‌’! | Markets seen weak on Fed markets gloomy outlook | Sakshi
Sakshi News home page

పడగొట్టిన ‘ఫెడ్‌’!

Published Fri, Jun 12 2020 4:25 AM | Last Updated on Fri, Jun 12 2020 5:19 AM

Markets seen weak on Fed markets gloomy outlook - Sakshi

అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి చాలా కాలమే పడుతుందని ఆ దేశ కేంద్ర బ్యాంక్‌ సంకేతాలివ్వడంతో  ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్‌ కూడా గురువారం పతనమైంది. టెలికం కంపెనీలు ఏజీఆర్‌ బకాయిలు చెల్లించాల్సిందేనంటూ సుప్రీం కోర్ట్‌ వ్యాఖ్యానించడం, ఇటీవల బాగా పెరిగిన బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం, మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే వదంతులు, కరోనా కేసులు పెరుగుతుండటం... ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 34,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్‌ 709 పాయింట్లు క్షీణించి 33,538 పాయింట్ల వద్ద, నిఫ్టీ 214 పాయింట్లు పతనమై 9,902 పాయింట్ల వద్ద ముగిశాయి. గత మూడు వారాల్లో సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్క రోజులో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే ప్రథమం. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 767 పాయింట్లు, నిఫ్టీ 231 పాయింట్ల మేర నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. కాగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.  

మరిన్ని వివరాలు...
► ఎస్‌బీఐ షేర్‌ 6% నష్టంతో రూ.177 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పడిన షేర్‌ ఇదే.  

► 30 సెన్సెక్స్‌ షేర్లలో ఐదు షేర్లు–ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, హీరో మోటొకార్ప్, పవర్‌ గ్రిడ్, మహీం ద్రా అండ్‌ మహీంద్రా, నెస్లే ఇండియా మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 25 షేర్లు నష్టపోయాయి.  

► మార్కెట్‌ భారీగా నష్టపోయినా, 80కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. అరబిందో ఫార్మా, ముత్తూట్‌ ఫైనాన్స్, క్యాడిలా హెల్త్‌కేర్, గ్రాన్యూల్స్‌ ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  

► స్టాక్‌ మార్కెట్‌లో భారీ క్షీణత చోటు చేసుకున్నా దాదాపు 350కు పైగా షేర్లు అప్పర్‌ సర్క్యూట్లను తాకాయి. పీఎన్‌బీ హౌసింగ్, ఫ్యూచర్‌ రిటైల్, లెమన్‌ ట్రీ హోటల్స్, ఫ్యూచర్‌ కన్సూమర్, డిష్‌ టీవీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  

► ప్రముఖ ట్రేడర్‌ విజయ్‌ ఖేడియా 1.1 శాతం వాటా షేర్లను కొనుగోలు చేయడంతో రామ్‌కో సిస్టమ్స్‌ షేర్‌ 20 శాతం లాభంతో రూ.110 వద్ద ముగిసింది. ఇక ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో శంకర బిల్డింగ్‌ షేర్‌ 16 శాతం ఎగసి రూ.352 వద్ద ముగిసింది.  

► ఏజీఆర్‌ బకాయిల విషయమై ఊరట లభించకపోవడంతో టెలికం షేర్లు నష్టపోయాయి. వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఇన్‌ఫ్రాటెల్, హెచ్‌ఎఫ్‌సీఎల్, తేజాస్‌ నెట్‌వర్క్స్, ఐటీఐ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు 13 శాతం వరకూ నష్టపోయాయి.  

► వరుసగా ఐదో రోజూ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్‌ పెరిగింది. ఒక్క వారంలో ఈ షేర్‌ 30 శాతం లాభపడింది.


నష్టాలు ఎందుకంటే...

► ఫెడ్‌ కఠిన వ్యాఖ్యలు...
వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ, అమెరికాలో ఆర్థిక రికవరీకి దీర్ఘకాలమే పడుతుందని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వ్యాఖ్యానించడం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను పడగొట్టింది. వడ్డీరేట్లను మరో రెండేళ్ల పాటు సున్నా స్థాయిల్లోనే కొనసాగిస్తామని, తక్కువ రేట్లను కొనసాగించడానికి బాండ్ల కొనుగోళ్లు కొనసాగిస్తామని ఫెడ్‌ వెల్లడించింది. కరోనా కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి చాలా కాలమే పడుతుందని ఈ వ్యాఖ్యల ద్వారా ఫెడ్‌ అంగీకరించినట్లయింది.    ఫెడ్‌ వ్యాఖ్యల కారణంగా ఆసియా, యూరప్‌ మార్కెట్లు 1–4 శాతం మేర నష్టపోయాయి.  

► ఏజీఆర్‌ బకాయిలు చెల్లించాల్సిందే...
టెలికం కంపెనీలు ఏజీఆర్‌(సవరించిన స్థూల రాబడి)బకాయిలు చెల్లించాలాంటూ సుప్రీం కోర్ట్‌ తేల్చి చెప్పడంతో బ్యాంక్‌ షేర్లు పడ్డాయి.  

► బ్యాంక్‌ షేర్లలో లాభాల స్వీకరణ...
లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించినప్పటి నుంచి ఆర్థిక రికవరీపై సానుకూల అంచనాలతో బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు పెరుగుతూ వస్తున్నాయి. ఈ షేర్లన్నీ బాగా పెరిగిన నేపథ్యంలో ఫెడ్‌ తాజా నిర్ణయం కారణంగా పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.

► రూపాయి పతనం  
డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసలు పతనమై 75.79 వద్దకు చేరింది.  

► మళ్లీ లాక్‌డౌన్‌...?
కరోనా కేసులు బాగా పెరుగుతుండటంతో ఈ నెల 15 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధిస్తారన్న వదంతులు చెలరేగాయి. ఈ వార్తలను కేంద్రం ఖండించినప్పటికీ, లాక్‌డౌన్‌ వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

► పెరుగుతున్న కరోనా కేసులు...
ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్త కరోనా కేసులు 74 లక్షలకు, మరణాలు 4.2 లక్షలకు చేరువయ్యాయి. ఇక భారత్‌లో కరోనా కేసులు 2.9 లక్షలకు పైగా చేరగా, మరణాలు 8 వేలు దాటిపోవడం కూడా మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి.  

► ఎస్‌ అండ్‌ పీ రేటింగ్స్‌ ఆందోళన  
గత వారం మన రేటింగ్‌ను మూడీస్‌ సంస్థ డౌన్‌గ్రేడ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే స్డాండర్డ్‌ అండ్‌ పూర్స్‌ (ఎస్‌ అండ్‌ పీ) గ్లోబల్‌ రేటింగ్స్‌ సంస్థ మన సావరిన్‌ రేటింగ్‌ను కొనసాగించడం ఒకింత ఊరటనిచ్చింది. అయితే ద్రవ్యలోటు, ఆర్థిక రంగ బలహీనతలపై ఆందోళన వ్యక్తం చేయడం ప్రతికూల ప్రభావం చూపించింది.

రూ.2.4 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాల కారణంగా రూ.2.4 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాప్‌ రూ.2.4 లక్షల కోట్లు తగ్గి రూ.133 లక్షల కోట్లకు పడిపోయింది.

భారీ నష్టాల్లో అమెరికా మార్కెట్‌
కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతుండటం, అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిరాశాపూర్వక వ్యాఖ్యలు చేయడంతో గురువారం అమెరికా స్టాక్‌ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికాలో కరోనా కేసులు 20 లక్షలకు పైగా పెరిగిపోగా, మరణాలు 1.1 లక్షలకు చేరాయి. కరోనా కేసులు మళ్లీ తిరగబెడుతున్నాయని నిపుణులంటున్నారు. రాత్రి గం.11.30ని. సమయానికి డోజోన్స్‌ సూచీ 1,300 పాయింట్లు, (5 శాతం), నాస్‌డాక్‌ సూచీ 328 పాయింట్లు (3 శాతం), ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 128 పాయింట్లు(4 శాతం) మేర నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక మన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి ప్రతీక అయిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ 278 పాయింట్ల(2%) నష్టంతో 9,575 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ప్రభావంతో శుక్రవారం మన స్టాక్‌ సూచీలు భారీ గ్యాపప్‌తో మొదలవుతాయని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement