
సాక్షి, సూర్యాపేట : పట్టణంలోని శ్రీనిధి జూనియర్ కళాశాలలో అనారోగ్యంతో ఓ ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఆత్మకూరు మండలం ఏపూర్‌కు చెందిన షేక్ షమీనా ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. షమీనాకు అనారోగ్యంతో ఉందంటూ శుక్రవారం కళాశాల నుంచి ఆమె తల్లికి ఫోన్ వచ్చింది. తాను అందుబాటులో లేనని, ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కళాశాల సిబ్బందికి తల్లి చెప్పింది. అయినా కళాశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. విద్యార్థిని షమీనా పరిస్థితి విషమం కావడంతో ఉదయం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని చనిపోయిందని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని షమీనా తల్లి, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.