రైతు ఆత్మహత్యల నివారణకు కృషి
రైతు ఆత్మహత్యల నివారణకు వ్యవసాయ శాఖ కృషి చేయాల్సి ఉందని కలెక్టర్ విజయమోహన్ తెలిపారు.
–మెగా రక్త, నేత్రదాన శిబిరంలో కలెక్టర్
కర్నూలు(అగ్రికల్చర్): రైతు ఆత్మహత్యల నివారణకు వ్యవసాయ శాఖ కృషి చేయాల్సి ఉందని కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. రాష్ట్ర వ్యవసాయాధికారుల సంఘం ఆధ్వర్యంతో సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో మెగా రక్త, నేత్ర దాన శిబిరాన్ని వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనంజయరెడ్డితో కలసి కలెక్టర్ ప్రారంభించారు. మండల వ్యవసాయాధికారులు, ఏడీఏలు, ఏఇఓ, ఏంపీఇఓలు, వ్యవసాయశాఖ సిబ్బంది 150 మంది.. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకీ రక్తదానం చేశారు. వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనుంజయరెడ్డి, అదనపు డైరెక్టర్ సుశీల, వ్యవసాయాధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కమలాకరశర్మ, ప్రవీణ్ కర్నూలు జిల్లా వ్యవసాయాధికారుల సంఘం ప్రతినిధులు, వివిధ జిల్లాల నాయకులు దాదాపు 500 మంది మరణానంతరం కళ్లు దానం చేస్తామని అంగీకార పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ...వ్యవసాయాధికారుల్లోను మానవత్వం ఉందని రక్త, నేత్రదాన కార్యక్రమం ద్వారా నిరూపించుకున్నారన్నారు. అదే రీతిలో రైతుల అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనంజయరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయశాఖలో విస్తరణ కార్యక్రమాలు లేవనే విమర్శ ఉందని ఈ లోపాన్ని సవరించుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ...వ్యవసాయాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా రక్త, నేత్ర దానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.జేడీఏ ఉమామహేశ్వరమ్మ, జిల్లా వ్యవసాయాధికారుల సంఘం అ«ధ్యక్ష, కార్యదర్శులు సుబ్బారెడ్డి, రవిప్రకాష్, జిల్లా నాయకులు అక్బరుబాష, అశోక్‌కుమార్‌రెడ్డి, సురేష్‌బాబు, విశ్వనాథ్, తేజస్వరీ, ఏడీఏలు రమణారెడ్డి, సాలురెడ్డి, వీరారెడ్డి, సుధాకర్, చెంగల్రాయుడు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.