సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మైకుల హోరు మూగబోయింది. మండు టెండల్లో అభ్యర్థుల చల్లని పలకరింపులకు బ్రేక్ పడింది.
సాక్షి, సంగారెడ్డి: సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మైకుల హోరు మూగబోయింది. మండు టెండల్లో అభ్యర్థుల చల్లని పలకరింపులకు బ్రేక్ పడింది. మద్యం దుకాణాలు మూతబడ్డాయి. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడింది. ఈ నెల 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక పోలింగ్‌కు ఒకే రోజు మిగిలి ఉండడంతో ఓటర్లకు ప్రలోభాలు మిన్నంటాయి. అభ్యర్థులు గెలుపు కోసం ఆఖరి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటివరకు జరిగిన ప్రలో భాలు ఓ వంతు అయితే, చివరి 24 గంటల్లో అంతకు మించి ప్రలోభాలకు గురిచేసేందుకు అభ్యర్థులు సన్నాహాలు చేసుకున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గీయుల ద్వారా ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర కానుకలను చకచక ఓటర్లకు చేరవేస్తున్నారు. ఎన్నికల నిఘా అధికారుల కళ్లు గప్పి ఈ తంతు సాఫీగా సాగిపోతోంది.
గోల్డెన్ అవర్స్..
ప్రత్యర్థులతో హోరాహోరీగా తలపడుతున్న ప్రధాన పార్టీల నేతలు తమ గెలుపోటములపై ‘లెక్కలు’ వేసుకుంటున్నారు. తమ గెలుపునకు గండికొట్టే ఓటర్లను బుట్టలో వేసుకునేందకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా వివిధ కారణాలతో దూరమైన పలు వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటమిపై అనుమానాలు కలిగిస్తున్న సమూహాలపై దృష్టి పెట్టి నోట్ల కట్టలు, లిక్కర్‌తో తమవైపు మరల్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఓట్ల సంఖ్యను బట్టి ఒక్కో ఓటుకు గరిష్టంగా రూ.వెయ్యి లెక్కన లక్షల రూపాయల ప్యాకేజీలను అంటగడుతున్నారు. వివిధ మార్గాల ద్వారా పోగుచేసిన ధనం, మద్యాన్ని రహస్య ప్రదేశాల నుంచి బయటకు తీసుకొచ్చి విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. సోమ, మంగళవారం రాత్రి వేళల్లో ఓటర్లకు నోట్లు చేర వేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నారు.
పెరిగిన దూకుడు
ప్రధాన పార్టీల అగ్రనేతల సుడిగాలి పర్యటనలతో ఆయా పార్టీల అభ్యర్థుల్లో దూకుడు పెరిగింది. చివరి ఘడియలే కీలకం కావడంతో హోరాహోరీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ముఖ్యనేతలు గులాం నబీ ఆజాద్, జైరాం రమేశ్, దిగ్విజయ్ సింగ్, బీజేపీ అగ్రనేత సుష్మా స్వరాజ్, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబుల సుడిగాలి పర్యటనలతో జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. దీంతో కొత్తగా ఏర్పడనున్న తెలంగాణ రాష్ట్రంలో తొలి లోక్‌సభ సభ్యుడిగా, తొలి శాసనసభ్యుడిగా చరిత్రకెక్కడానికి ఆయా పార్టీల అభ్యర్థులు ఉవ్విళ్లూరుతున్నారు.