
ఆస్ట్రేలియాలో ఆగిపోయిన ప్రధాని ఫ్లైట్
న్యూజీలాండ్ ప్రధాని జాన్ కీ భారతదేశ పర్యటనకు అనూహ్యంగా అవాంతరం ఎదురైంది. సోమవారం భారత్కు బయలుదేరిన ఆయన విమానంలో స్వల్ప లోపం ఏర్పడటంతో ఆయన ఆస్ట్రేలియాలో ఆగిపోవాల్సి వచ్చింది.
సిడ్నీ: న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ భారతదేశ పర్యటనకు అనూహ్యంగా అవాంతరం ఎదురైంది. సోమవారం భారత్కు బయలుదేరిన ఆయన విమానంలో స్వల్ప లోపం ఏర్పడటంతో ఆయన ఆస్ట్రేలియాలో ఆగిపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఫోన్ ద్వారా వెల్లడించారు. జాన్ కీ భారత్కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో ముంబయిలో భేటీ అవనున్నారు.
దీంతోపాటు ప్రధాని నరేంద్రమోదీని కూడా కలువనున్నారు. ఈరోజే(సోమవారం) ఆయన భారత్లో అడుగుపెట్టాల్సి ఉంది. ఆయన బయలుదేరిన రాయల్ న్యూజిలాండ్ ఎయిర్ ఫోర్స్ బోయింగ్ 757 అక్లాండ్లోని వెనుపాయ్ ఎయిర్ బేస్ నుంచి ప్రారంభమై ఇంధనం కోసం టౌన్స్విల్లేలో దిగింది. అయితే, అది తిరిగి బయలుదేరేముందు స్వల్ప సమస్య ఉన్నట్లు గుర్తించి అక్కడే విమానం ఆపేశారు. విమానయాన సంస్థ నుంచి మాత్రం ఇంకా ప్రకటన వెలువడలేదు.