తమిళనాట మళ్లీ వారసత్వ రాజకీయాలు
మక్కాలాల్ నాన్, మక్కాలుకాగవే నాన్ (ప్రజల వల్లనే నేను, ప్రజల కోసమే నేను)’ ప్రతి బహిరంగ సభలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ముందుగా చెప్పిన మాటలివే.
న్యూఢిల్లీ:
‘మక్కాలాల్ నాన్, మక్కాలుకాగవే నాన్ (ప్రజల వల్లనే నేను, ప్రజల కోసమే నేను)’ ప్రతి బహిరంగ సభలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ముందుగా చెప్పిన మాటలివే. ఆ తర్వాత ‘మీది పక్కా వారసత్వ రాజకీయాలు’ అంటూ డీఎంకే పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే ఎక్కువ. ఇప్పుడు అలాంటి అన్నాడీఎంకే పార్టీలో కూడా వారసత్వ రాజకీయాలు పురివిప్పాయి.
జయలలిత అన్నకూతురు దీపా జయకుమార్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పార్టీలోకి ఆహ్వానించడం, ఆమె శశికళకు వ్యతిరేకంగా ఆయనకు మద్దతివ్వడం తెల్సిందే. సుప్రీం కోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో పార్టీపై పట్టుకోసం శశికళ కూడా వారసత్వ రాజకీయాలనే ఆశ్రయించారు. తన సోదరుడి కుమారుడైన టీటీవీ దినకరన్‌ను మళ్లీ పార్టీలోకి తీసుకొని ఏకంగా పార్టీ డిప్యూటి జనరల్ సెక్రటరీ పదవి అప్పగించారు. మరో సమీప బంధువు ఎం. వెంకటేషన్‌ను కూడా తీసుకున్నారు. అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై వీరిద్దరికి 2011లో జయలలిత పార్టీ నుంచి బహిష్కరించారు. దినకరన్, అక్రమాస్తుల కేసులో శశికళతోపాటు శిక్ష పడిన సుధాకరన్‌కు స్వయాన సోదరుడు.
జయలలిత బతికున్నంతకాలం దూరంగా ఉంచిన వీరిద్దరిని సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో శశికళ దగ్గరికి తీసుకున్నారు. తాను జైలుకు వెళ్లాల్సి రావడంతో శశికళ తప్పనిసరి పరిస్థితిలో పార్టీ శాసనసభా పక్షం నాయకుడిగా పళనిసామికి మద్దతిచ్చారు. గౌండర్ కమ్యూనిటికి చెందిన పళనిసామి పార్టీలో బలమైన నాయకుడు. ఆ కులానికి చెందిన వారు పార్టీ శాసన సభ్యుల్లో 45 మంది ఉన్నారు. అంతటి వ్యక్తి ముఖ్యమంత్రయితే స్వతంత్రంగా వ్యవహరిస్తూ తనను పట్టించుకోకపోవచ్చనే దూరదష్టితో ఆయనకు చెక్ పెట్టేందుకు దినకరన్‌ను శశికళను తీసుకొచ్చినట్లు స్పష్టమవుతోంది.
రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి పదవీ స్వీకారానికి రేపు ఎవరిని ఆహ్వానించినా, ఎవరు ముఖ్యమంత్రయినా ఈ వారసత్వ రాజకీయాల వల్ల పార్టీ చీలిపోయే ప్రమాదం ఎప్పటికీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే దీపా జయకుమార్‌ను పార్టీలోకి ఆహ్వానించడం పట్ల పన్నీర్ సెల్వం వర్గీయులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. పార్టీలోకి తీసుకున్నా ఆమెకు ఎలాంటి పదవులు ఇవ్వరాదని, ఇస్తే తమ సీటుకే ఎసరు పెడతారని పన్నీరు సెల్వంను హెచ్చరిస్తున్నవారు కూడా ఉన్నారు.