
మోదీతో కరచాలనం చేస్తున్న గోతబయ
న్యూఢిల్లీ: శ్రీలంక నూతన అధ్యక్షుడు గోతబయ రాజపక్సతో ప్రధాని మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడం, దౌత్య సంబంధాలను బలపరుచుకోవాల్సిన ఆవశ్యకతపై ఇరువురూ చర్చించారు. ఈ సమావేశం అనంతరం లంక ప్రభుత్వానికి సుమారు రూ.3,230 కోట్ల రుణ సహాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. గోతబయ రాజపక్స మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం భారత్‌కి వచ్చారు. శ్రీలంకలోని మైనారిటీ తమిళుల ఆకాంక్షలూ, భద్రతాంశాలూ, వ్యాపార ఒప్పందాలూ, మత్స్యకారుల సమస్యలపై ఈ సమావేశం దృష్టిసారించింది.
ఈ సందర్భంగా ప్రధాని మీడియాతో మాట్లాడుతూ... శ్రీలంక సత్వరాభివృద్ధి పథంలో పయనించేందుకు భారత్ సంపూర్ణ మద్దతునిస్తుందని చెప్పారు. శ్రీలంక అభివృద్ధికి, ఉగ్రవాదం అణచివేతకు రూ.3,230 కోట్ల సాయాన్ని ప్రకటించారు. ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందుకు శ్రీలంక పోలీసు అధికారులు భారత్‌లో శిక్షణ పొందుతున్నట్టు ప్రధాని వెల్లడించారు. లంక అధ్యక్షుడు గోతబయ మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య చర్చలు ఫలవంతమయ్యాయనీ, ఆర్థిక సహకారం అంశాన్ని కూడా భారత ప్రధానితో చర్చించానని చెప్పారు. రాజపక్సకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ్‌భవన్‌లో ఘనంగా స్వాగతం పలికారు.