
సాక్షి, మాంద్య (కర్ణాటక) : ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి బాధ్యతల నుంచి రాజ్‌బబ్బార్ తప్పుకోలేదని, రాజీనామా చేయలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రమోద్ తివారీ స్పష్టం చేశారు. 'నేను మీకు ఓ విషయం చెప్పదలుచుకున్నాను. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ బాధ్యతలకు రాజ్ బబ్బార్ రాజీనామా చేయలేదు. ఆయన రాజీనామా చేశారంటూ వచ్చిన వార్తలన్నీ నిరాధారమైనవి' అని తివారీ అన్నారు. అంతకుముందు ఓ వార్తా సంస్థలో వచ్చిన వార్తల ప్రకారం రాజ్ బబ్బార్ ఇలా చెప్పారు .
'కాంగ్రెస్ పార్టీలో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ అధ్యక్షుడు నాకు ఎలాంటి కొత్త బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తాను. వాటిని నిర్వర్తిస్తూ 2019 ఎన్నికలకు అనుగుణంగా పనిచేస్తాను. నేను ఏం చెప్పాలో అది మా పార్టీ అధ్యక్షుడికి చెబుతాను. కాంగ్రెస్ పార్టీ గత కొద్దికాలంగా ఓడిపోతూ వస్తోంది.. ఓడిపోతుంది' అంటూ ఆయన చెప్పారు. గోరఖ్‌పూర్, పుల్పూర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతిపేలవమైన ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే.