
ముంబై: మహిళల టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌కు సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్‌ను తీసుకోకపోవడాన్ని సెలెక్టర్ సుధా షా సహా జట్టు మేనేజ్‌మెంట్ సమష్టి నిర్ణయంగా మేనేజర్ తృప్తి భట్టాచార్య తన నివేదికలో పేర్కొంది. ఆస్ట్రేలియా–వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి సెమీఫైనల్లో పిచ్ స్పందించిన తీరు చూశాక... అదనపు బౌలర్ ఉంటేనే ప్రయోజనమని వారు భావించారని వివరించింది. ఈ నివేదిక ప్రకారం అసలేం జరిగిందంటే... భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ ముగిశాక, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు జట్టు ఎంపికకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, కోచ్ రమేష్ పొవార్, సెలెక్టర్ సుధా షా సమావేశమయ్యారు. మొదటి సెమీఫైనల్లో పిచ్ స్పందించిన తీరుపై చర్చించారు.
ఈ సందర్భంగా లీగ్ దశలో ఆస్ట్రేలియాపై గెలిచిన జట్టులో మార్పులు అవసరం లేదని కోచ్ అభిప్రాయపడ్డారు. హర్మన్, స్మృతి సైతం సరే అన్నారు. అదనపు బౌలర్ అవసరాన్ని సుధా షాకు వివరించారు. దీనిపై ఏమీ మాట్లాడకుండానే ఆమె అంగీకరించారు. మరోవైపు సెమీస్‌లో తనను ఆడించడం లేదని తెలిశాక మిథాలీ తీవ్ర నిరుత్సాహంతో పాటు చెప్పలేనంత వేదనకు గురైందని ఆమె వ్యక్తిగత కోచ్ ఆర్‌ఎస్‌ఆర్ మూర్తి వెల్లడించారు. రాత్రి మిథాలీతో తాను ఫోన్‌లో మాట్లాడానని... మ్యాచ్‌కు మానసికం గా, శారీరకంగా సంసిద్ధమైనట్లు తెలిపిందని వివరించారు. ఓపెనర్‌గా కాకపోయినా మిడిలార్డర్‌లో ఆడే అవకాశం ఉందని చెప్పిందన్నారు. జట్టు కారణాలు ఏవైనా... భారత అభిమానిగా మిథాలీని డగౌట్‌లో చూడాల్సి రావడం తనను బాధకు గురిచేసిందని సహచర క్రీడాకారిణి జులన్ గోస్వామి పేర్కొంది.