
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఆన్‌లైన్‌లో చేపట్టిన ఈ ప్రక్రియలో 4 వేల మందికి పైగా ఉద్యోగులకు స్థానచలనం కలిగింది. ప్రాథమిక ఆస్పత్రి మొదలు పైస్థాయి వరకు అన్ని ఆస్పత్రుల్లోనూ బదిలీలు జరిగాయి. మొత్తం 4,120 మందిని బదిలీ చేయగా.. వారిలో 190 మంది వైద్యులు, వెయ్యి మంది వరకు నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. బదిలీల్లో 2,120 హైదరాబాద్ కేంద్రంగా జరిగితే, 2 వేల బదిలీలను జిల్లాల స్థాయిలో నిర్వహించారు. దంత వైద్యులు తక్కువగా ఉన్నందున వారిని బదిలీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే తమకు బదిలీ కావాలని వారు కోరుకున్నందున కౌన్సెలింగ్ చేపట్టామని ఆరోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 35 ఏళ్లుగా ఒకే దగ్గర తిష్టవేసిన వారిని కూడా ఈ సారి కదిలించినట్లు ఆయన చెప్పారు. కాగా, బదిలీల్లో తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు వైద్య సిబ్బంది ఆరోగ్య సంచాలకుల కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అయితే ఎవరికీ అన్యాయం జరగలేదని.. ఆన్‌లైన్ ద్వారానే బదిలీల ప్రక్రియ నిర్వహించామని శ్రీనివాసరావు తెలిపారు.