
సాక్షి, హైదరాబాద్: గుర్తుతెలియని వ్యక్తుల వివరాలు కనిపెట్టడం పోలీసులకు కఠినమైన పనే. సమస్యాత్మక కేసుల్లో మృతదేహం ఆచూకీ పట్టు కోవడం సవాలుగా మారుతుండటంతో చాలా కేసులు ముందుకుసాగక మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు పోలీసులు ఫలానా మృతదేహం వేలిముద్రల ఆధారంగా వివరాలు వెల్లడించేలా ఆధార్ ప్రాధికారక సంస్థ (యూఐడీఏఐ)ని ఆదేశించాలంటూ కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో ఈ తరహా కేసులు అధికం కావడంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ–ఆధార్ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇలాంటి వివరాలు వెల్లడించడం కుదరదని స్పష్టం చేస్తూ తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డికి 3 పేజీల లేఖ రాసింది. ఈ విషయాన్ని రాష్ట్ర పోలీసులకు తెలియజేయాలని కూడా లేఖలో సూచించింది.
ఆ లేఖలో ఏముందంటే..
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ–ఆధార్ మంత్రిత్వశాఖ తరఫున హైదరాబాద్‌లోని యూఐడీఏఐ రీజినల్ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జి.వేణుగోపాల్‌రెడ్డి డీజీపీకి ఈ విషయమై ఓ లేఖ రాశారు. గుర్తు తెలియని మృతదేహాల విషయంలో వేలిముద్రల ఆధారంగా వివరాలు వెల్లడించాలంటూ పలువురు దర్యాప్తు అధికారులు హైకోర్టును ఆశ్రయించడం మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో వ్యక్తుల బయోమెట్రిక్ లేదా ఐరిష్ వివరాలను వెల్లడించడం సాధ్యం కాదు. చనిపోయిన వ్యక్తులకు సంబంధించినవైనా సరే ఇవ్వడం కుదరదు. అది గోప్యతా చట్టానికి పూర్తిగా విరుద్ధం. ఆధార్ డేటా బేస్‌లోని ప్రతీ వ్యక్తి సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచేందుకు తాము తొలిప్రాధాన్యమిస్తామని, వాటిని వెల్లడించలేమని స్పష్టంచేశారు.