
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు మొదటి దశ పర్యావరణ అనుమతులు వచ్చిన నేపథ్యంలో రెండో దశ అనుమతులకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి పీకే ఝా అధికారులను ఆదేశించారు. ఆ ప్రతిపాదనలను వెంటనే ఆన్‌లైన్‌లో కేంద్రానికి పంపాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అటవీశాఖ చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం ఆయన వివిధ జిల్లాల అటవీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఝా మాట్లాడుతూ వచ్చే ఏడాది హరితహారం కోసం నర్సరీల సంఖ్య పెంచాలని, భూముల సర్వేలో భాగంగా అటవీ ప్రాంతాల సరిహద్దులు గుర్తించి హద్దులు నమోదుచేయాలని ఆదేశించారు. ఎకో టూరిజం అభివృద్ధి కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా అటవీ అధికారుల చొరవను అభినందించిన ఉన్నతాధికారులు, మిగతా జిల్లాల అధికారుల అవగాహన కోసం వరంగల్‌లో వర్క్‌షాపు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్తగూడెం అటవీ ప్రాంతం గుండాల రేంజ్ రంగాపురం పరిధిలో అన్యాక్రాంతం అయిన 55 హెక్టార్ల అటవీ భూమిని స్వాధీనం చేసుకొని మొక్కలు నాటిన సిబ్బందిని కూడా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.