ఎదురు తిరిగి... బలయ్యాడు!  | man commited suicide in adilabad | Sakshi
Sakshi News home page

ఎదురు తిరిగి... బలయ్యాడు! 

Published Tue, Jan 23 2018 12:27 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

man commited suicide in adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎదురు తిరిగిన వ్యక్తిని అణిచివేసేందుకు గ్రామస్థాయి నాయకులు ఆడిన చదరంగంలో అధికారులు పావులు అయ్యారు. ఓ గీతకార్మికుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగించారు. తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎస్టీ కాదని నెత్తీనోరు కొట్టుకున్నా న్యాయం జరగలేదు. చివరిసారిగా కలెక్టర్‌కు విన్నవించుకునేందుకు వెళ్లినా సరైన స్పందన రాలేదు. దీంతో మనస్తాపం చెందిన అతడు కలెక్టరేట్‌ సాక్షిగా పురుగుల మందు తాగి ప్రాణాలొదిలాడు. సోమవారం మంచిర్యాల కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమానికి హాజరై అక్కడే విషంతాగి ఆత్మహత్యకు పాల్పడ్డ నెన్నెల మండల కేంద్రానికి చెందిన రంగు రామాగౌడ్‌ (45) విషాదగాథ ఇది. 

నెన్నెల మండల అధికార పార్టీ నాయకుల అక్రమాలను ప్రశ్నించిన పాపానికి అట్రాసిటీ కేసులో ఇరుక్కొని బలవన్మరణానికి గురైన రామాగౌడ్‌ ఉదంతం ప్రతిఒక్కరిని కలిచివేస్తోంది. ఈ ఉదంతం అధికార బలంతో అక్రమాలకు పాల్పడుతూ అట్రాసిటీ చట్టాన్నే అపహాస్యం చేస్తున్న స్థానిక ప్రజా ప్రతినిధుల తీరును బట్టబయలు చేసింది. తప్పుడు కేసులు పెట్టిస్తున్న ప్రజాప్రతినిధులకు పోలీస్, రెవెన్యూ శాఖలు దాసోహమనే దయనీయ పరిస్థితిని కళ్లకు కట్టింది. టీడీపీ మండలాధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, కల్లుగీత కార్మికుడిగానే జీవనోపాధి పొందుతున్న రామాగౌడ్‌ అత్మహత్యతో ఆయన భార్య, కూతురు అనాథలుగా మారారు. అక్రమంగా అట్రాసిటీ కేసులో ఇరికించి వేధిస్తున్నారని, న్యాయం చేయాలని ప్రజావాణిలో జాయింట్‌ కలెక్టర్‌కు పిటిషన్‌ ఇచ్చేందుకు వచ్చిన రామాగౌడ్‌... అక్కడ సరైన స్పందన లేకపోవడంతో ఆవేదనతో పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. 

అక్రమాలను బయటపెట్టడమే నేరమా..?
నెన్నెల మండలం భూ వివాదాలకు కేంద్రంగా మారింది. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా సుమారు 17వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఈ మండలంలో ఉన్నాయి. నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండతో నెన్నెలలో గ్రామ, మండల స్థాయి ప్రజాప్రతినిధులు చేసే అరాచకాలకు లెక్కే లేదు. నెన్నెలలో సాగుతున్న రాజకీయ నాయకుల అరాచకాలపై గత సంవత్సరం సెప్టెంబర్‌లో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఆత్మహత్యకు పాల్పడ్డ రామాగౌడ్‌ నెన్నెల మండల కో ఆప్షన్‌ సభ్యుడు ఇబ్రహీం, గ్రామ సర్పంచ్‌ అయిన అస్మా ఇబ్రహీం అక్రమాలకు పాల్పడుతున్నారని మీడియా సమావేశాలు పెట్టి ఆరోపించేవాడు. దీంతో కక్ష పెంచుకున్న వీరు తమ వద్ద పనిచేసే పల్ల మహేష్‌ను ఆయుధంగా వాడుకున్నారు. పెద్దచెరువు శిఖం భూమిలో మహేష్‌ శెనగ పంట సాగు చేయగా, సర్పంచ్‌పై రామాగౌడ్‌ ఆరోపణలు చేయడాన్ని కూడా సాకుగా వాడుకున్నారు. మహేష్‌ తండ్రి బీసీ, తల్లి ఎస్టీ కాగా... మహేష్‌కు ఎస్టీ సర్టిఫికేట్‌ ఇప్పించి గొడవ పెట్టుకునేలా చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయించారనేది ఆరోపణ.

తహసీల్దార్, ఏసీపీల ద్వారా చట్టం దుర్వినియోగం?
ఈ ఘటనలో నెన్నెల తహసీల్దార్‌ సత్యనారాయణ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటే... ఏసీపీ స్థాయి అధికారి విచారణ జరపాల్సి ఉంటుంది. ఏసీపీ విచారణలో కులం పేరుతో దూషించినట్లు నిర్దారణ అయితే... ఫిర్యాదుదారు షెడ్యూల్డ్‌ కులం లేదా తెగలకు చెందిన వ్యక్తే అని కూడా రూఢీ చేసుకోవాలి. ఇందుకోసం తహసీల్దార్‌ నుంచి కుల ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఫిర్యాదు చేసిన మహేష్‌ తండ్రి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా, తల్లి ఎస్టీ. ఇక్కడే అధికార పార్టీ నాయకులు రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రభావితం చేశారు. మండల కో ఆప్షన్‌ సభ్యుడు, సర్పంచ్‌తో పాటు స్థానిక ఎంపీటీసీ, ఎమ్మెల్యే అందరూ అధికార పార్టీ వారే కావడంతో తహసీల్దార్‌ కూడా ఎస్టీ కుల సర్టిఫికేట్‌ ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇదే మహేష్‌ చెల్లెలుకు మాత్రం బీసీ సర్టిఫికేట్‌ ఇవ్వడం గమనార్హం.

తహసీల్దార్‌ ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రంతో ఏసీపీ బాలుజాదవ్‌ గత డిసెంబర్‌ 13న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కేసు నమోదులో కూడా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు స్పష్టమవుతోంది. భూ వివాదాలు, సర్పంచ్, కో ఆప్షన్‌ సభ్యుడిపై పిటిషన్లు ఇస్తున్న వ్యక్తిపై సర్పంచ్‌ దగ్గర పనిచేసే వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును ఏసీపీ ఎలా నమోదు చేశారనేది ఇక్కడ ప్రశ్న. నియోజకవర్గ ప్రజాప్రతినిధి స్థాయిలో ఒత్తిళ్లు ఉంటే తప్ప ఏసీపీ స్థాయిలో కేసు నమోదు అయ్యే అవకాశం లేదు. దీంతో అట్రాసిటీ చట్టం దుర్వినియోగంతో పాటు అధికార పార్టీ సర్పంచి, మండల స్థాయి నాయకులు సాగిస్తున్న దురాగతాల తీరు తేటతెల్లమైంది.

ప్రజావాణికి విలువేది..?
రామాగౌడ్‌పై డిసెంబర్‌ 13న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. అప్పటినుంచి రామాగౌడ్‌Š  నెన్నెల గ్రామానికి రాకుండా పోలీసుల కంటపడకుండా న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఈ క్రమంలో ఈనెల 2న కలెక్టరేట్‌కు వచ్చిన అతడు కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ను కలిసి తన గోడు వినిపించుకున్నాడు. ఎస్టీ కాని వ్యక్తితో కేసు నమోదు చేయించారని, అదే వ్యక్తి చెల్లెలుకు బీసీ సర్టిఫికేట్‌ ఇచ్చారని జిరాక్స్‌ కాపీలతో సహా కలెక్టర్‌కు చూపించాడు. యథా ప్రకారం కలెక్టర్‌ ఆ పిటిషన్‌ను నెన్నెల తహసీల్దార్‌కు పంపించారు. అక్రమార్కులతో తహసీల్దార్‌ కూడా కుమ్మక్కయ్యాడని పిటిషనర్‌ ఆరోపిస్తుండగా, ఆ అధికారికే నివేదిక ఇవ్వమని కలెక్టర్‌ సిఫారసు చేయడంతో కేసు పక్కకు పోయింది. ఇరవై రోజులైనా తన ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యకు సిద్ధమయ్యే బాధితుడు సోమవారం మళ్లీ కలెక్టరేట్‌కు వచ్చాడు.

జేసీ ఈ కేసును సాధారణమైనదిగానే పరిగణించడంతో పాటు తహసీల్దార్‌ నుంచి నివేదిక రాలేదని చెప్పారు. ఇక తాను అట్రాసిటీ చట్టం కింద జైలుకు వెళ్లడం ఖాయమనుకున్న రామాగౌడ్‌ కలెక్టరేట్‌ హాల్‌లోనే తన వెంట తెచ్చుకున్న విషం తాగాడు. గమనించిన పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడిని జేసీ పరామర్శించి ఉన్నత వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. రామాగౌడ్‌ చికిత్స పొందుతూ సాయంత్రం నాలుగున్నర గంటలకు మృతి చెందాడు. ఈ ఘటనలో తహసీల్దార్‌ సత్యనారాయణ, ఏసీపీ బాలుజాదవ్‌ తీరుపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని బట్టి ప్రజావాణి కూడా బాధితులకు ఉపయోగపడని కార్యక్రమంగా మారిందని రుజువైంది. దీనిపై జిల్లా కలెక్టర్‌ గానీ, పోలీస్‌ కమిషనర్‌ గానీ ఏం చర్యలు తీసుకొంటారో వేచిచూడాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement