అప్పులబాధతో ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం రాత్రి మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో చోటుచేసుకుంది.
రామాయంపేట (మెదక్) : అప్పులబాధతో ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం రాత్రి మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాట్రియాల గ్రామానికి చెందిన కుమ్మరి శ్యాములు(30) తనకున్న ఎకరం పొలంలో చెరకుపంట వేయగా అది ఎండిపోయింది. దీనికితోడు అనారోగ్యంతో బాధపడుతున్న శ్యాములుకు రోజురోజుకు అప్పులబాధ పెరిగిపోయింది.
దీంతో చేసేదిలేక గురువారం సాయంత్రం తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి విషగుళికలు మింగాడు. ఇంటికి వచ్చిన అతడు కిందపడిపోగా, వెంటనే అతడిని చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్యాములకు భార్య స్వరూప, మూడేళ్లలోపు ఇద్దరు ఆడపిల్లలున్నారు.