ఎవరి సరదా వారికానందం-అనే నానుడిని నిజం చేస్తున్నాడు ఒడిశాకు చెందిన 78ఏళ్ల కె.శ్యాంబాబు సుబుధి.
బరంపురం : ఎవరి సరదా వారికానందం-అనే నానుడిని నిజం చేస్తున్నాడు ఒడిశాకు చెందిన 78ఏళ్ల కె.శ్యాంబాబు సుబుధి. ఆయనకు ఎన్నికల్లో పోటీ చేయడమంటే భలే సరదా. అవి అసెంబ్లీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా సరే! గెలుపు ఓటములతో ఆయనకస్సలు సంబంధమే లేదు. నోటిఫికేషన్ వెలువడటమే తరువాయి... నామినేషన్ పత్రంతో సిద్ధమైపోతాడు. ఇలా ...1957 నుంచి అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీకి మొత్తం 27 సార్లు ఎన్నికల బరిలో దిగాడు.
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ రాజకీయాల్లో తలపండిన వారిపైనే పోటీకి దిగటం శ్యాంబాబు మరో ప్రత్యేకత. అయితే, ఏ ఒక్కసారీ గెలిచింది లేదు. ఏదో ఒకరోజు ప్రజలు తనను గెలిపించకపోతారా అంటూ ఎప్పటికప్పుడు ఎన్నికల క్షేత్రంలో రణానికి సిద్ధం అవుతూనే ఉన్నాడు. తాజాగా సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో శ్యాంబాఉ తనదైన పద్దతిలో పోటీకి సిద్ధమైపోయారు. ఈసారి ఆయన బరంపురం, ఆస్కా స్థానాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుని, ఇప్పటికే సైకిల్పై ప్రచారం మొదలెట్టారు.