Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Public entry restricted on 400 acre Kancha Gachibowli till April 16: Telangana1
కంచ గచ్చిబౌలిలో నిషేధాజ్ఞలు

సాక్షి, సిటీబ్యూరో/గచ్చిబౌలి/రాయదుర్గం: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. సుప్రీంకోర్టు, కేంద్ర సాధికార కమిటీ ఆదేశాల మేరకు ప్రశాంతతకు భంగం కలగకుండా, అల్లర్లు జరగకుండా నిరోధించేందుకు మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రాంతంలో సంబంధం లేని వ్యక్తుల ప్రవేశానికి అనుమతులు లేవని తెలిపారు.నిషేధాజ్ఞలు శుక్రవారం నుంచి ఈనెల 16 వరకూ అమలులో ఉంటాయని తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, సెంట్రల్‌ వర్సిటీతో పాటు కంచ గచ్చిబౌలి సర్వే నంబర్‌ 25లో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. గురువారం నాటి సుప్రీంకోర్టు స్టేతో ధర్నాలు, ఆందోళనలు ఆగిపోయాయి.సదరు 400 ఎకరాల్లో పనులను నిలిపివేశారు. క్యాంపస్‌తో పాటు వివాదాస్పద భూముల్లో పోలీసు లు బందోబస్తు నిర్వహిస్తున్నారు. క్యాంపస్‌ ప్రధాన ద్వారం వద్ద వాహనాలను తనిఖీలు చేసి, ఐడీ కార్డులున్న సిబ్బంది, విద్యార్థులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. విద్యార్థుల భారీ ర్యాలీ శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు హెచ్‌సీయూలో వివిధ విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీని నిర్వహించాయి. ‘ప్రతిఘటన, విజయోత్సవ ర్యాలీ’పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీచర్స్‌ అసోసియేసన్, వర్కర్స్‌ అసోసియేషన్‌ సహా పలు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. విద్యార్థులు, ఫ్యాకలీ్ట, నాన్‌టీచింగ్, వర్కర్స్‌ ఐక్యత వర్ధిల్లాలి, హెచ్‌సీయూ భూములను కాపాడుతాం అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అరెస్టయిన, కస్టడీలో ఉన్న విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులు, సివిల్‌ సొసైటీ గ్రూప్‌లు, ఇతరులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని, క్యాంపస్‌ నుంచి పోలీస్‌ క్యాంప్‌లను ఎత్తివేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. కుక్కల దాడిలో గాయపడి.. దుప్పి మృతి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో శుక్రవారం కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన దుప్పి (మచ్చల జింక).. మృగవనికి తరలిస్తుండగా మృతిచెందింది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల హెచ్‌సీయూ క్యాంపస్‌లో చెట్లు, పొదలను తొలగించడంతో స్థావరాలను కోల్పోయిన వన్యప్రాణులు క్యాంపస్‌లోని హాస్టళ్ల వైపు వస్తున్నాయి.శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఒక దుప్పి రాగా కుక్కలు వెంటపడి గాయపరిచాయి. విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది కుక్కలను తరిమివేసి గాయపడిన దుప్పికి ప్రాథమిక చికిత్స అందించి, అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. వారు దానిని మృగవనికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో మృగవనిలో పోస్టుమార్టమ్‌ నిర్వహించి అక్కడే ఖననం చేశారు. గోపన్‌పల్లిలో ఇళ్ల మధ్య జింక పరుగులు.. శుక్రవారం హెచ్‌సీయూ అటవీ ప్రాంతం సమీపంలోని గోప న్‌పల్లి ఎన్‌టీఆర్‌నగర్‌లో ఓ జింక రోడ్లపై పరుగులు తీసింది. అటూఇటూ తిరుగుతూ ఓ ఇంట్లోకి వెళ్లగా, స్థానికులు గమ నించి తలుపులు మూసివేశారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు. అటవీ శాఖ అధికారులు అక్కడకు వచ్చి జింకను పట్టుకుని జూపార్కుకు తరలించారు.అవన్నీ ఏఐ చిత్రాలే సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌సీయూ పరిధిలో చెట్ల తొలగింపుతో వన్యప్రాణులకు తీవ్ర నష్టం కలుగుతోందన్న రీతిలో.. సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రచారమంతా కల్పితమని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కొన్ని జేసీబీలతో చెట్లను నరికివేయడం వల్ల అక్కడున్న నెమళ్లు, జింకలు పరుగెత్తుకుంటూ పారిపోతున్న రీతిలో రూపొందించిన చిత్రం పూర్తిగా ఏఐ(ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఆధారితమని తేల్చిచెప్పింది. బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాలో క్రిషాంక్‌ ఎక్స్‌ ఖాతాలో జింక కాళ్లు కట్టేసి చంపినట్లు చూపిన చిత్రం కూడా తప్పుడు చిత్రమని తేల్చింది. ఈ చిత్రం ఓ సోషల్‌ మీడియా జర్నలిస్టు పొరపాటున పోస్టు చేశారని, ఆ తర్వాత సదరు రిపోర్టర్‌ తన తప్పిదాన్ని ఒప్పుకుని తొలగించినట్లు ఎక్స్‌ వేదికగా తెలిపారని వివరించింది.

US imposes 26 percent import duty on Indian exports2
ఈ సుంకాలతో లాభనష్టాలు

భారత్‌ ఎగుమతులపై అమెరికా 26 శాతం దిగుమతి సుంకాన్ని విధించడం ఆర్థిక ఆందో ళనలకు దారి తీసింది. భారత్‌తో పోల్చిన ప్పుడు అధికంగా చైనాపై 40–60 శాతం (కొన్ని ఉత్పత్తులపై 100 శాతం వరకు), వియత్నాంపై 30–45 శాతం, థాయ్‌లాండ్‌పై 35–50 శాతం దిగుమతి సుంకాలను అమె రికా విధించింది. భారత్‌కన్నా తక్కువగా యూరోపియన్‌ యూనియన్‌పై 20 శాతం, జపాన్‌పై 24 శాతం, దక్షిణ కొరియాపై 25 శాతం దిగుమతి సుంకాలను అమెరికా విధించింది.అమెరికా వాదన2024లో అమెరికాకు సంబంధించి భారత్‌ ఎగుమతుల విలువ 91.23 బిలియన్‌ డాలర్లు. భారత్‌ మొత్తం ఎగుమతుల విలువలో అమెరికా వాటా 18 శాతం. ఇదే సంవత్సరం అమెరికా ఉత్పత్తుల దిగుమతులలో భారత్‌ వాటా 2.6 శాతం. మొత్తంగా భారత్‌తో వాణి జ్యానికి సంబంధించి అమెరికా వాణిజ్య లోటు 2023–24లో 45.7 బిలియన్‌ డాలర్లు కాగా, 2024–25 (జనవరి వరకు) 22.9 బిలియన్‌ డాలర్లుగా నమోదయింది. అమెరికాకు సంబంధించిన పాసింజర్‌ వాహనాలపై 70 శాతం, యాపిల్స్‌పై 50 శాతం, ఆల్కహాల్‌పై 100 –150 శాతం దిగుమతి సుంకాలను భారత్‌ విధిస్తున్నప్పుడు, ప్రస్తుతం భారత్‌పై అమెరికా విధించిన 26 శాతం దిగుమతి సుంకం సమంజసమేనని అమెరికా వాదిస్తున్నది. ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్య నియమావళికి విరుద్ధంగా భారత్‌ వ్యవహరిస్తున్నదని అమెరికా భావిస్తున్నది.దిగుమతి సుంకాల పెంపు కారణంగా బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50తో పాటు చైనా, థాయ్‌లాండ్‌కు సంబంధించిన ముఖ్య సూచీల లోనూ క్షీణత ఏర్పడింది. 2023–24లో అమెరికాతో వాణిజ్యంలో చైనా మార్కెట్‌ వాటా 21.6 శాతం కాగా, వియత్నాం వాటా 19.3 శాతంగా, భారత్‌ వాటా 6 శాతంగా నిలిచింది. వివిధ దేశాలపై అమె రికా దిగుమతి సుంకాల పెంపు కారణంగా చైనా, వియత్నాంలతో పోల్చినప్పుడు భారత్‌ ఎగుమతులలో పోటీతత్వం పెరుగుతుందని భావించవచ్చు.సగటు అమెరికా దిగుమతి సుంకాల కారణంగా– భారత్‌లో రొయ్యలు, వస్త్రాలు, స్టీల్‌ రంగాలపై; చైనాలో సోలార్‌ పానల్స్, సెమీ కండక్టర్, స్టీల్, ఎలక్ట్రిక్‌ వాహనాలపై; వియత్నాంలో ఫుట్‌వేర్, ఎల క్ట్రానిక్స్, ఫర్నీచర్‌పై; థాయ్‌లాండ్‌లో ఆటో పరికరాలు, రబ్బరు ఉత్పత్తులపై ప్రభావం ఉంటుందని అంచనా.భారత్‌పై ప్రభావంప్రాథమిక కేటగిరీకి సంబంధించిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్‌ పరిక రాలు, ఫార్మా ఉత్పత్తులు, విలువైన రాళ్ళు భారత్‌ నుండి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. మార్చి 2025లో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకొనే చర్యలో భాగంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై భారత్‌ దిగుమతి సుంకాన్ని తగ్గించడం వలన రెండు దేశాలకు పరస్పర ప్రయోజనం చేకూరుతుంది. ఆసియా ఖండంలోని ఇతర దేశాలతో పోల్చినప్పుడు సౌరవిద్యుత్, ఫార్మాసూటికల్స్, టెక్స్‌టైల్స్‌ – అప్పారెల్‌ రంగాలలో భారత్‌కు అధిక ప్రయోజనం ఉంటుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా టెక్స్‌టైల్‌ – అప్పారెల్‌ రంగాలకు సంబంధించి పోటీ వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుత దిగు మతి సుంకాల నిర్ణయం కారణంగా అమెరికా మార్కెట్‌లో ఆ యా ఉత్పత్తులకు సంబంధించి భారత్‌కు పోటీ తగ్గుతుంది. చైనాకుసంబంధించిన సౌర ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకం కారణంగా చైనా సౌర ఉత్పత్తుల ధరలు పెరగడం వలన భారత్‌కు ప్రయోజనం చేకూరుతుంది. చైనాపై అమెరికా అధికంగా ఆధార పడటం తగ్గి భారత్‌ – అమెరికా వాణిజ్య సంబంధాలు మరింత పటిష్ఠమయ్యే అవకాశం ఉంది.భారత్‌ నుండి రొయ్యల ఎగుమతుల విలువ రూ. 22,000 కోట్లు కాగా, ఈ మొత్తంలో అమెరికా వాటా 44 శాతంగా ఉంది. ప్రస్తుతం అధిక సుంకాల కారణంగా భారత్‌ నుండి అమెరికా రొయ్యల ఎగుమతుల విలువలో తగ్గుదల ఏర్పడవచ్చు. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులకు సంబంధించి అమెరికాలో భారత్‌ మార్కెట్‌ వాటా తగ్గుతుంది. వజ్రాలు, ఆభరణాల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. భారత్‌లో అనేక సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలు హ్యాండిక్రాఫ్ట్‌ గార్మెంట్స్‌ ఎగుమ తులపై అధికంగా ఆధారపడ్డాయి. అధిక సుంకాల నేపథ్యంలోఎం.ఎస్‌.ఎం.ఇ. సంస్థల ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గుతుంది. తద్వారా ఆ యా సంస్థలలో లే ఆఫ్‌ కారణంగా ఉత్పత్తి సామర్థ్యం కూడా తగ్గుతుంది.సిద్ధించే ప్రయోజనాలుఅమెరికా దిగుమతి సుంకాలను ముఖ్యంగా వస్తువులపై విధించినందువలన భారత్‌లో పటిష్ఠంగా ఉన్న ఐటీ, సేవల రంగంపై ఈ ప్రభావం ధనాత్మకంగా ఉంటుంది. భారత్‌ నుండి సాఫ్ట్‌వేర్‌ సర్వీ సులు, ఫైనాన్షియల్‌ టెక్నాలజీ, బిజినెస్‌ అవుట్‌ సోర్సింగ్‌కు సంబంధించి ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఇంజినీరింగ్‌ వస్తువులకు సంబంధించి భారత్‌తో పోల్చినప్పుడు చైనా, యూరప్‌లపై అధిక సుంకాలు విధించిన కారణంగా అమెరికా కొనుగోలుదారులు భారత్‌ ఇంజినీరింగ్‌ ఉత్పత్తులపై దృష్టి సారించే వీలుంది. దానివల్ల భారత్‌ ఎగుమతులలో పెరుగుదల ఏర్పడుతుంది.చైనా ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాల కారణంగా బహుళ జాతి సంస్థలు తమ ఉత్పత్తిని భారత్‌లో చేపట్టే అవకాశం ఉంది. తద్వారా భారత్‌ అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించే అవ కాశం ఉంటుంది. భారత్‌లో ఇప్పటికే అమలులో ఉన్న ‘ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెన్టివ్‌ స్కీమ్‌’ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం) కారణంగా ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, సెమీ కండక్టర్‌లకు సంబంధించిన సంస్థలు భారత్‌లో అధికంగా ఏర్పాటవుతాయి. తద్వారా భార త్‌లో పెట్టుబడులు, ఉపాధి, ఉత్పత్తి, ఎగుమతుల విలువలో పెరుగు దల కనబడుతుంది. అది స్థూల దేశీయోత్పత్తిలో కూడా పెరుగు దలగా ప్రతిఫలిస్తుంది.అమెరికా దిగుమతి సుంకాల కారణంగా ఇతర దేశాల వ్యవ సాయ ఉత్పత్తుల ధరలలో పెరుగుదల ఏర్పడుతుంది. తద్వారా భారత్‌ నుండి బియ్యం, సుగంధ ద్రవ్యాలు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌కు అమెరికా మార్కెట్‌లో డిమాండ్‌ పెరగడంతోపాటు భారత్‌ ఎగుమతుల విలువలో పెరుగుదల ఏర్పడుతుంది. ఎగుమతుల పరంగా ఇబ్బంది ఎదుర్కొనే నేపథ్యంలో (కొన్ని ఉత్పత్తులకు సంబంధించి) భారత్‌ లోని ఉత్పత్తి స్వదేశీ డిమాండ్‌ను తీర్చడానికి ఉపకరిస్తుంది. ఈ స్థితి దేశంలో కొన్ని ఉత్పత్తుల కొరతను నివారించడం ద్వారా సాధారణ ధరల స్థాయి తగ్గుదలకు దారితీస్తుంది.చేయాల్సిందిఅయితే, అమెరికా ఆటో పరికరాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలనే ఒత్తిడిని భారత్‌ సమీప భవిష్యత్తులో ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే అమెరికాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించు కోవాలి. ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాలతో భారత్‌ నూతన వాణిజ్య భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలి.-వ్యాసకర్త ప్రొఫెసర్‌ అండ్‌ డీన్, ఇక్ఫాయ్‌ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్, ఐ.ఎఫ్‌.హెచ్‌.ఇ., హైదరాబాద్‌- డా‘‘ తమ్మా కోటిరెడ్డి

Rasi Phalalu: Daily Horoscope On 05-04-2025 In Telugu3
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.అష్టమి రా.12.30 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: ఆరుద్ర ఉ.10.28 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: రా.10.13 నుండి 11.47 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.55 నుండి 7.34 వరకు, అమృతఘడియలు: లేవు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.56, సూర్యాస్తమయం: 6.10.మేషం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. కార్యజయం. దైవదర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.వృషభం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. విద్యార్థులకు నిరాశ.మిథునం: కుటుంబంలో సంతోషకరంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. ఆలోచన లు స్థిరంగా ఉండవు. వ్యవహారాలలో చికాకులు. కళాకారులకు ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. మిత్రులతో సఖ్యత. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.కన్య: పరపతి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులు చకచకా సాగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితి.తుల: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. పారిశ్రామికవేత్తల యత్నాలు మందగిస్తాయి. వృత్తులు, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.వృశ్చికం: శ్రమ ఫలించదు. వ్యయప్రయాసలు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యసమస్యలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహవంతంగా ఉంటాయి.ధనుస్సు: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.మకరం: ఇంటర్వ్యూలు అందుతాయి. యత్నకార్యసిద్ధి. దైవదర్శనాలు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.కుంభం: అనుకున్న కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. నిర్ణయాలలో తొందరవద్దు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.మీనం: శ్రమ తప్ప ఫలితం ఉండదు. వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. కొత్త బాధ్యతలు. ఆరోగ్యం మందగిస్తుంది. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

Bangladesh needs immediate help it suffering from high prices and shortages of essential goods4
బంగ్లా తీరు మారాల్సిందే!

ఏదైనా మోతాదు మించితే వికటిస్తుంది. ఆశించిన ఫలితం రాకపోగా అనవసర ప్రయాస మిగులు తుంది. బంగ్లాదేశ్‌ ప్రధాన సలహాదారు మహమ్మద్‌ యూనస్‌కు ఆలస్యంగానైనా ఇది అర్థమైందో లేదో సందేహమే. గతవారం ఆయన చైనా పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటన విజయవంతమైందని బంగ్లా ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంది. కానీ అక్కడ తెలిసీ తెలియకుండా యూనస్‌ మాట్లాడిన మాటలవల్ల బంగ్లాకు ఒరిగిందేమీ లేకపోగా, ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పించుకోవాల్సివచ్చింది. నిరుడు ఆగస్టులో ప్రజా ఉద్యమం పర్యవసానంగా అప్పటి బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా పదవి కోల్పోయి మన దేశంలో ఆశ్రయం పొందినప్పటినుంచీ ఇరు దేశాల సంబంధాలూ దెబ్బతిన్నాయి. అక్కడ మైనారిటీ హిందువులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయి. హత్యలు, అత్యా చారాలు అధికమయ్యాయి. మత ఛాందసవాదుల ప్రాబల్యం ఎక్కువైంది. ఈ పరిణామాల అనంతరం ఇరు దేశాలమధ్యా ఉన్నతస్థాయి భేటీ జరగటం ఇదే ప్రథమం. శుక్రవారం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన ఏడు దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల కూటమి బిమ్‌స్టెక్‌ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా యూనస్‌తో విడిగా భేటీ అయినప్పుడు ఉద్రిక్తతలు పెంచే ప్రకటనలు చేయటం మానుకోవాలని మోదీ సూచించినట్టు చెబుతున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడాలంటే నిర్మాణాత్మక, ఆచరణీయ వైఖరితో ఉండాలని కూడా సలహా ఇచ్చారట. తమ దేశంపై తప్పుడు ప్రచారం సాగుతోందని బంగ్లా దబాయించినా సామాజిక మాధ్యమాల్లోని వీడియోలు నిజమేమిటో వెల్లడిస్తూ వచ్చాయి. వీటిపై విచారణ జరిపించి బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని, ఇవి పునరావృతం కానీయరాదని గతంలోనే మన దేశం డిమాండ్‌ చేసింది. ప్రస్తుత భేటీలో కూడా మోదీ దీన్ని లేవనెత్తారు. మాజీ ప్రధాని హసీనాను అప్పగించాలన్న యూనస్‌కు... అలా అడగటా నికి ఇది వేదిక కాదని మన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిశ్రీ చెప్పాల్సి వచ్చింది.యూనస్‌ పూర్వాశ్రమంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యుడు. గ్రామీణ బ్యాంకు వ్యవస్థ రూపశిల్పిగా, మైక్రో ఫైనాన్స్‌ విధాన నిర్ణేతగా బంగ్లా గ్రామీణ ప్రజల జీవనాన్ని మెరుగుపరిచేందుకు చేసినకృషికి 2006లో ఆయనకు నోబెల్‌ శాంతి పురస్కారం లభించింది. పలు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంఘాలకు సారథ్యం వహించారు. ఇదంతా బాగున్నా షేక్‌ హసీనాతో వచ్చిన విభేదాల కార ణంగా ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. కేసులు వచ్చి పడ్డాయి. మైక్రో ఫైనాన్స్‌ వ్యవస్థ వల్ల గ్రామీణులకు మేలు కలగకపోగా అప్పుల్లో కూరుకుపోయారన్న ఆరోపణలూ వచ్చాయి. తనకు ససేమిరా పడని హసీనాకు మన దేశం మద్దతుగా నిలిచిందన్న ఆక్రోశం యూనస్‌కు ఉండొచ్చు. ఇరుగు పొరుగు సత్సంబంధాలతో మెలగటం, ఇచ్చిపుచ్చుకోవటం, అభివృద్ధి సాధించటం అత్యవసరమని ఆయన ఇప్పటికీ గ్రహించలేదని చైనాలో ఆయన చేసిన వ్యాఖ్యలు చెబుతున్నాయి. ఈశాన్య భారత్‌లోని ఏడు రాష్ట్రాలూ సముద్రతీరం లేనివని, కనుక ఈ ప్రాంతంలో అందరూ తమపై ఆధారపడక తప్పదని యూనస్‌ చైనాలో వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగలేదు. మౌలిక సదుపాయాలూ, కనెక్టివిటీ సరిగాలేని ఈ ప్రాంతంలో పెట్టుబడులకు భారీ అవకాశాలున్నాయని చైనాకు గుర్తుచేశారు. అది తెలివితక్కువతనమో, మతిమరుపోగానీ... భారత్‌కు రెండువైపులా 6,500 కిలోమీటర్ల పొడవైన విస్తృత తీరప్రాంతం ఉందన్న సంగతి ఆయనకు తట్టలేదు.ఈశాన్యంలో రహదారులు, రైల్వే నిర్మాణం మరింత మెరుగుపరిస్తే... జలరవాణాను పెంచితే దేశంలోని ఏ తీరప్రాంతంనుంచి అయినా విదేశాలకు ఎగుమతులు చేయటం ఎంత పని! యూనస్‌ వ్యాఖ్యల్ని అపార్థం చేసుకున్నారని బంగ్లా విదేశాంగ శాఖ ముక్తాయిస్తోంది. కానీ సమయమూ,సందర్భమూ గమనిస్తే అది నిజం కాదనిపిస్తుంది. తాము పాకిస్తాన్‌తోపాటు చైనాకు దగ్గర కాబోతు న్నామని మన దేశాన్ని నేరుగా హెచ్చరించటమే ఇది.బంగ్లాదేశ్‌కు ఆర్థిక కష్టాలు దండిగానే ఉన్నాయి. అందులో కొన్ని స్వయంకృతం. బంగ్లాకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిలిపేశారు. హసీనా పదవీచ్యుతి తర్వాత అక్కడ మతఛాందసుల వీరంగంతో మన దేశం కూడా బంగ్లాను దూరం పెట్టింది. దాంతో నిధుల లేమితో అది సతమతమవుతోంది. ఇటీవల బియ్యం కొరత ఏర్పడి అది పాకిస్తాన్‌ను ఆశ్రయించినా అక్కడినుంచి చాలినంత అందలేదు. పైగా భారత్‌నుంచి వచ్చే బియ్యంతో పోలిస్తే వ్యయం తడిసి మోపెడవుతోంది. ప్రధాన సలహాదారయ్యాక యూనస్‌ను మన ప్రభుత్వం అభినందించినా, భారత్‌లో పర్యటించాలని ఆహ్వానం పంపలేదు. అందుకే తొలి పర్యటనకు యూనస్‌ కావాలని చైనాను ఎంచుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చైనాను ఆకాశానికెత్తి మనల్ని చిన్నబుచ్చే యత్నం చేశారు. ఇంతచేసినా 210 కోట్ల డాలర్ల పెట్టుబడికి చైనా సమ్మతించింది. దాదాపు వంద కంపెనీలు 100 కోట్ల డాలర్లమేర మదుపు చేయటానికి అంగీకరించాయి. ఈ రెండు ప్రతిపాదనలకూ నిర్దిష్ట గడువు లేదు. ఎప్పుడొస్తాయో తెలియదు. కానీ బంగ్లాకు తక్షణసాయం కావాలి. అది అధిక ధరలతో, నిత్యావసరాల కొరతతో సతమతమవుతోంది. మత ఛాందసులు ఈ స్థితిని తమకు అను కూలంగా మలుచుకునే పనిలో ఉన్నారు. మోదీ అన్నట్టు సుస్థిర, ప్రజాతంత్ర, శాంతియుత దేశ మన్న అభిప్రాయం కలిగించినప్పుడే బంగ్లాకు అన్నివైపులనుంచీ సాయం అందుతుంది. అరాచక శక్తులకు ఆటపట్టయితే, భారత్‌ వ్యతిరేకతే ఊపిరిగా బతుకుతానంటే ప్రయోజనం శూన్యం. యూనస్‌ ఈ సంగతిని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.

Lucknow Super Giants beat Mumbai Indians by 12 runs5
ఇంట గెలిచిన లక్నో

లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ విజయలక్ష్యం 204 పరుగులు... నమన్, సూర్యకుమార్‌ చెలరేగినప్పుడు గెలుపు సునాయాసం అనిపించింది... చివర్లో 2 ఓవర్లో 29 పరుగులు చేయాల్సి ఉన్నా హార్దిక్‌ పాండ్యా కొట్టగలడని అనిపించింది... కానీ లక్నో మ్యాచ్‌ను కాపాడుకోగలిగింది. 19వ ఓవర్లో శార్దుల్‌ 7 పరుగులే ఇవ్వగా, ఆఖరి ఓవర్‌లో పదునైన బౌలింగ్‌తో అవేశ్‌ ఖాన్‌ 9 పరుగులే ఇచ్చాడు. దాంతో ముంబైకి ఓటమి తప్పలేదు. నలుగురు లక్నో బౌలర్లు 40కి పైగా పరుగులు ఇవ్వగా... స్పిన్నర్‌ దిగ్వేశ్‌ రాఠీ 21 పరుగులే ఇవ్వడటం చివరకు ఫలితంపై ప్రభావం చూపించింది. అంతకుముందు మిచెల్‌ మార్ష్, మార్క్‌రమ్‌ బ్యాటింగ్‌తో 200 పరుగులు దాటిన లక్నో ప్రత్యర్థికి సవాల్‌ విసిరింది. లక్నో: ఐపీఎల్‌ సీజన్‌లో సొంత మైదానంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు తొలి విజయం దక్కింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో లక్నో 12 పరుగుల తేడాతో ఐదుసార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. మిచెల్‌ మార్ష్ (31 బంతుల్లో 60; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ (38 బంతుల్లో 53; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా, ఆయుష్‌ బదోని (19 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించాడు. హార్దిక్‌ పాండ్యా (5/36) తన టి20 కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులే చేయగలిగింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (43 బంతుల్లో 67; 9 ఫోర్లు, 1 సిక్స్‌), నమన్‌ ధీర్‌ (24 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. పంత్‌ విఫలం... లక్నోకు ఓపెనర్లు మార్ష్, మార్క్‌రమ్‌ శుభారంభం అందించారు. బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్‌ నాలుగో బంతి మార్ష్ బ్యాట్‌ను తాకుతూ కీపర్‌ చేతుల్లో పడింది. అయితే దీనిని ముంబై బృందం గుర్తించక అప్పీల్‌ చేయలేదు. దాంతో బతికిపోయిన మార్ష్ ఆ తర్వాత చెలరేగిపోయి బౌల్ట్‌ తర్వాతి ఓవర్లో 6, 4 కొట్టాడు. అనంతరం అశ్వని ఓవర్లో మార్ష్ వరుసగా 6, 4, 2, 2, 4, 4 బాదగా, వైడ్‌తో కలిపి మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 27 బంతుల్లో మార్ష్ హాఫ్‌ సెంచరీ పూర్తి కాగా, పవర్‌ప్లేలో లక్నో 69 పరుగులు సాధించింది. ఎట్టకేలకు పుతూర్‌... మార్ష్ను వెనక్కి పంపించాడు. మార్ష్, మార్క్‌రమ్‌ తొలి వికెట్‌కు 42 బంతుల్లోనే 76 పరుగులు జోడించారు. ఫామ్‌లో ఉన్న నికోలస్‌ పూరన్‌ (12) ఎక్కువసేపు నిలబడలేకపోగా, రిషభ్‌ పంత్‌ (2) వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. ఈ దశలో బదోని, మార్క్‌రమ్‌ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. సాంట్నర్‌ ఓవర్లో బదోని వరుసగా 3 ఫోర్లు కొట్టగా, ఎట్టకేలకు 17వ ఓవర్లో మార్క్‌రమ్‌ అర్ధసెంచరీ (34 బంతుల్లో) పూర్తయింది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 31 బంతుల్లో 51 పరుగులు జత చేశారు. చివర్లో డేవిడ్‌ మిల్లర్‌ (14 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుతో స్కోరు 200 దాటింది. సూర్య హాఫ్‌ సెంచరీ... ఛేదనలో ముంబై ఆరంభంలోనే జాక్స్‌ (5), రికెల్టన్‌ (10) వికెట్లు కోల్పోయింది. అయితే నమన్, సూర్య భాగస్వామ్యంతో స్కోరు దూసుకుపోయింది. ముఖ్యంగా నమన్‌ మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. ఆకాశ్‌దీప్‌ ఓవర్లో అతను వరుసగా 6, 6, 4, 4 బాదాడు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 64 పరుగులకు చేరింది. అయితే రాఠీ బౌలింగ్‌లో నమన్‌ బౌల్డ్‌ కావడంతో 69 పరుగుల (35 బంతుల్లో) మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాతా జోరు సాగించిన సూర్య 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 24 బంతుల్లో 52 పరుగులు చేయాల్సిన స్థితిలో సూర్య అవుట్‌ కాగా...షాట్లు ఆడటంలో బాగా ఇబ్బంది పడిన తిలక్‌వర్మ (23 బంతుల్లో 25; 2 ఫోర్లు) ‘రిటైర్డ్‌ అవుట్‌’గా తప్పుకున్నాడు. చివర్లో హార్దిక్‌ పాండ్యా (16 బంతుల్లో 28 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఎంతగా ప్రయత్నించినా ముంబైకి ఓటమి తప్పలేదు. 17వ, 18వ ఓవర్లలో కలిపి 23 పరుగులు వచ్చినా... చివరి 2 ఓవర్లలో 29 పరుగులు చేయడంలో ముంబై విఫలమైంది. స్కోరు వివరాలు లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్ష్ (సి అండ్‌ బి) పుతూర్‌ 60; మార్క్‌రమ్‌ (సి) బావా (బి) పాండ్యా 53; పూరన్‌ (సి) చహర్‌ (బి) పాండ్యా 12; పంత్‌ (సి) (సబ్‌) బాష్‌ (బి) పాండ్యా 2; బదోని (సి) రికెల్టన్‌ (బి) అశ్వని 30; మిల్లర్‌ (సి) నమన్‌ (బి) పాండ్యా 27; సమద్‌ (సి) నమన్‌ (బి) బౌల్ట్‌ 4; శార్దుల్‌ (నాటౌట్‌) 5; ఆకాశ్‌దీప్‌ (సి) సాంట్నర్‌ (బి) పాండ్యా 0; అవేశ్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–76, 2–91, 3–107, 4–158, 5–173, 6–182, 7–200, 8–200. బౌలింగ్‌: బౌల్ట్‌ 3–0–28–1, దీపక్‌ చహర్‌ 2–0–23–0, అశ్వని కుమార్‌ 3–0–39–1, సాంట్నర్‌ 4–0–46–0, విఘ్నేశ్‌ పుతూర్‌ 4–0–31–1, హార్దిక్‌ పాండ్యా 4–0–36–5. ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: జాక్స్‌ (సి) బిష్ణోయ్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 5; రికెల్టన్‌ (సి) బిష్ణోయ్‌ (బి) శార్దుల్‌ 10; నమన్‌ ధీర్‌ (బి) రాఠీ 46; సూర్యకుమార్‌ (సి) సమద్‌ (బి) అవేశ్‌ 67; తిలక్‌వర్మ (రిటైర్డ్‌ అవుట్‌) 25; పాండ్యా (నాటౌట్‌) 28; సాంట్నర్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–11, 2–17, 3–86, 4–152, 5–180. బౌలింగ్‌: శార్దుల్‌ ఠాకూర్‌ 4–0–40–1, ఆకాశ్‌దీప్‌ 4–0–46–1, అవేశ్‌ ఖాన్‌ 4–0–40–1, దిగ్వేశ్‌ రాఠీ 4–0–21–1, రవి బిష్ణోయ్‌ 4–0–40–0 రోహిత్‌ శర్మ దూరం ముంబై ఓపెనర్‌ రోహిత్‌ శర్మ లక్నోతో మ్యాచ్‌లో ఆడలేదు. గురువారం ప్రాక్టీస్‌ సందర్భంగా అతని మోకాలికి గాయమైంది. దాంతో అతను ఈ పోరు నుంచి తప్పుకున్నాడు. రోహిత్‌ స్థానంలో రాజ్‌ బావాకు టీమ్‌ అవకాశం కల్పించింది. ఐపీఎల్‌లో నేడుచెన్నై X ఢిల్లీ వేదిక: చెన్నై మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి పంజాబ్‌ X రాజస్తాన్‌వేదిక: ముల్లాన్‌పూర్‌ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Trump tariff on India back to 26pc from 27percent in revised White House6
టారిఫ్‌పై మళ్లీ తూచ్‌ 

న్యూఢిల్లీ: 26 శాతం. కాదు 27. కాదు, కాదు... 26 శాతమే! భారత్‌పై విధించిన ప్రతీకార సుంకాల టారిఫ్‌ విషయంలో అమెరికా వరుస పిల్లిమొగ్గలివి. జనమే ఉండని అంటార్కిటికాతో పాటు ప్రపంచ దేశాలన్నింటినీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం ఎడాపెడా టారిఫ్‌లతో బాదేయడం తెలిసిందే. వైట్‌హౌస్‌ రూపొందించిన టారిఫ్‌ల చార్టును చేతిలో పట్టుకుని మరీ ఒక్కో దేశంపై టారిఫ్‌లను ప్రకటించారాయన. అమెరికాలోకి ప్రవేశించే ప్రతి ఉత్పత్తిపైనా 10 శాతం సుంకాలు విధిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్‌పై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ఆ సందర్భంగా ట్రంప్‌ వెల్లడించారు. ‘‘భారత్‌ మాపై ఏకంగా 52 శాతం సుంకాలు విధిస్తోంది. అందులో సగం మాత్రమే మేం వసూలు చేయబోతున్నాం. ఆ లెక్కన చూస్తే మేమిప్పటికీ ఉదారంగానే వ్యవహరిస్తున్నట్టే’’ అని చెప్పుకున్నారు. కానీ మ ర్నాటికల్లా వాటిని 27 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. భారత్‌తో పా టు మొత్తం 14 దేశాలపై ట్రంప్‌ ప్రకటించిన టారిఫ్‌లను వైట్‌హౌస్‌ గురువారం సవరించింది. ఆ మేరకు అనుబంధ ప్రకటన విడుదల చేసింది. అయితే శుక్రవారానికల్లా మళ్లీ కథ మొదటికి వచ్చింది. భారత్‌పై టారిఫ్‌ను అమెరికా తిరిగి 26 శాతానికి తగ్గించేసింది. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వైట్‌హౌస్‌ ఈ మేరకు పేర్కొంది. ఈ సుంకాలు ఏప్రిల్‌ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. భారత్‌ విషయంలో ఈ ‘ఒక్క శాతం’ తడబాటుపై ఆర్థిక నిపుణులు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. టారిఫ్‌ల విధింపు విషయంలో బహుశా ట్రంప్, ఆయన యంత్రాంగంలో నెలకొన్న తీవ్ర అయోమయానికి ఇది నిదర్శనమని వారంటున్నారు. ఈ దుందుడుకు టారిఫ్‌లు అంతిమంగా అమెరికా పుట్టినే ముంచుతాయని ఇంటా బయటా జోరుగా విశ్లేషణలు వెల్లువెత్తుతుండటం తెలిసిందే. బయటికి బెదిరింపు స్వరం వినిపిస్తున్నా, ఆ విశ్లేషణల ప్రభావం ట్రంప్‌ టీమ్‌పై బాగానే పడుతున్నట్టు కనిపిస్తోంది.

PM Modi proposes UPI link to boost trade and tourism at BIMSTEC Summit7
బిమ్స్‌టెక్‌ బలోపేతానికి 21 సూత్రాలు

బ్యాంకాక్‌: భారత యూపీఐ చెల్లింపుల వ్యవస్థను బిమ్స్‌టెక్‌ సభ్యదేశాల చెల్లింపుల వ్యవస్థలతో అనుసంధానిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. తద్వారా వ్యాపారం, వాణిజ్యంతో పాటు పర్యాటక రంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ‘బిమ్స్‌టెక్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఏర్పాటును ప్రతిపాదించారు. ఈ మేరకు 21 సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ఆయన తెరపైకి తెచ్చారు. శుక్రవారం థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో బహుళ రంగాల సాంకేతిక, ఆర్థిక సహకార కార్యక్రమం(బిమ్స్‌టెక్‌) సదస్సులో మోదీ ప్రసంగించారు. ప్రపంచ శాంతి, సౌభాగ్యానికి కూటమి ముఖ్యమైన వేదిక అన్నారు. ‘‘భాగస్వామ్య దేశాల మధ్య సహకారం, అనుబంధం బలపడాలి. ఇందుకు 21 సూత్రాల ప్రణాళికను అమలు చేద్దాం. అందులో భాగంగా బిమ్స్‌టెక్‌ ఫర్‌ ఆర్గనైజ్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇనిషియేటివ్‌ (బోధి) ఏర్పాటు చేద్దాం. దీనికింద ఏటా సభ్యదేశాలకు చెందిన 300 మంది యువతకు భారత్‌లో శిక్షణ ఇస్తాం. సామర్థ్య నిర్మాణంలో ప్రపంచ దేశాలకు ఆదర్శ నమూనాగా నిలిచే సత్తా మన కూటమికి ఉంది. ఒకరి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకుంటూ ఎదుగుదాం. డిజిటల్‌ ప్రజా సదుపాయాల (డీపీఐ) విషయంలో అనుభవాలు పంచుకుందాం. ఐటీ రంగ శక్తిసామర్థ్యాల సాయంతో బిమ్స్‌టెన్‌ను సాంకేతికంగా బలోపేతం చేసుకుందాం. బిమ్స్‌టెక్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ద్వారా ఏటా వ్యాపార సదస్సులు నిర్వహిద్దాం. స్థానిక కరెన్సీల్లోనే వ్యాపారాలు చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. సదస్సులో థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, భూటాన్‌ దేశాల అధినేతలు పాల్గొన్నారు. మారిటైమ్‌ ట్రాన్స్‌పోర్టు అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. బంగాళాఖాతంలో శాంతి, సౌభాగ్యం, భద్రత, సుస్థిరతే లక్ష్యంగా ‘బ్యాంకాక్‌ విజన్‌–2030’ను ఆమోదించారు.బిమ్స్‌టెక్‌ దేశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇటీవలి భూకంపంలో మయన్మార్, థాయ్‌లాండ్‌ ల్లో వేలాది మంది మరణించడం పట్ల మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ‘‘విపత్తుల నిర్వహణ విషయంలో అంతా కలిసి పనిచేయాల్సిన అవసరముంది. ఇందుకు భారత్‌లో బిమ్స్‌టెక్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, సస్టెయినబుల్‌ మారిటైమ్‌ ట్రాన్స్‌పోర్టు సెంటర్‌ నెలకొల్పుదాం. బిమ్స్‌టెక్‌ దేశాలకు మానవ వనరుల శిక్షణ నిమిత్తం గ్రౌండ్‌ స్టేషన్లు ఏర్పాటు చేద్దాం. ఫారెస్టు రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు నలందా యూనివర్సిటీలో బిమ్స్‌టెక్‌ దేశాల విద్యార్థులకు స్కాలర్‌íÙప్‌లు ఇస్తాం. కూటమి దేశాల మధ్య ఎలక్ట్రిక్‌ గ్రిడ్‌ ఇంటర్‌కనెక్షన్‌ పనులను వేగవంతం చేద్దాం. ఈ ఏడాది బిమ్స్‌టెక్‌ యూత్‌ లీడర్ల సదస్సు నిర్వహించనున్నాం. 2027లో తొలి బిమ్స్‌టెక్‌ క్రీడలు నిర్వహిద్దాం’’ అని సూచించారు.నేపాల్‌తో సంబంధాలకు ప్రాధాన్యం నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలీతో మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయానికొచ్చారు. ఓలీతో ఫలవంతమైన చర్చ జరిగిందని మోదీ వెల్లడించారు. నేపాల్‌తో సంబంధాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. మయన్మార్‌ సైనిక ప్రభుత్వాధినేత జనరల్‌ మిన్‌ ఆంగ్‌ లైంగ్‌తో మోదీ భేటీ అయ్యారు. భూకంపం నుంచి కోలుకోవడానికి సాయమందిస్తామని చెప్పారు. మయన్మార్‌లో సంఘర్షణలకు తెరపడాలంటే ప్రజాస్వామిక విధానంలో సజావుగా ఎన్నికలు జరగాలని స్పష్టం చేశారు. థాయ్‌లాండ్‌ రాజు మహా వాజిరాలాంగ్‌కాన్‌ దంపతులతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక బంధాన్ని పటిష్టం చేసుకోవడంపై చర్చించారు. సారనాథ్‌ బౌద్ధ స్థూపం నమూనాను థాయ్‌లాండ్‌ రాజుకు మోదీ అందజేశారు. మోదీ శ్రీలంక పర్యటన ప్రారంభం థాయ్‌లాండ్‌లో మోదీ రెండు రోజుల పర్యటన శుక్రవారం ముగిసింది. అనంతరం ఆయన శ్రీలంక చేరుకున్నారు. అక్కడ మూడు రోజులపాటు పర్యటిస్తారు. అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకేతో సమావేశమవుతారు. మోదీ చివరిసారిగా 2019లో శ్రీలంకలో పర్యటించారు. 2015 తర్వాత ఆయన శ్రీలంకలో పర్యటిస్తుండడం ఇది నాలుగోసారి.వాట్‌ ఫో ఆలయాన్ని దర్శించుకున్న మోదీ ప్రధాని మోదీ బ్యాంకాక్‌లో వాట్‌ ఫో బౌద్ధ ఆలయాన్ని దర్శించుకున్నారు. 46 మీటర్ల పొడవైన బుద్ధుడి విగ్రహం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట థాయ్‌లాండ్‌ ప్రధానమంత్రి షినవత్ర సైతం ఉన్నారు. అశోక స్తంభం నమూనాను మోదీ వాట్‌ ఫో ఆలయానికి బహూకరించారు. భారత్, థాయ్‌లాండ్‌ మధ్య ప్రాచీన కాలం నుంచి సంబంధాలు ఉన్నాయని మోదీ గుర్తుచేశారు.

Only two companies submitted bids in two tenders8
మళ్లీ టెండర్లు.. మళ్లీ కమీషన్లు

అప్పు చేసి ఇల్లు కట్టుకోవాలంటే మీరైతే ఏం చేస్తారు? నలుగురితో మాట్లాడి ఒక నిర్ధిష్టమైన ప్రణాళికతో ఒకేసారి ఇల్లు కట్టిస్తారా? లేక తొలుత తాత్కాలికంగా ఒక ఇల్లు కట్టించి.. ఆ తర్వాత శాశ్వతంగా మరో ఇల్లు కట్టిస్తారా? ఎవరైనా అన్నీ సరిచూసుకుని ఒకేసారి ఇల్లు కట్టిస్తారు. ఘనత వహించిన మన సీఎం చంద్రబాబు మాత్రం రెండు సార్లు కడతానంటున్నారు. తొలుత రూ.353 కోట్లు అప్పు చేసి తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక అసెంబ్లీ భవనాలను నిర్మించారు. ఇప్పుడు మళ్లీ అప్పు చేసి శాశ్వత హైకోర్టు, శాశ్వత అసెంబ్లీ నిర్మిస్తున్నారు. ఇందుకుగాను ఏకంగా రూ.1,649.33 కోట్లు వ్యయం చేయడానికి సిద్ధమై పోయారు. అధికారంలోకి వచ్చి ఏడాది తిరక్కుండానే లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసిన ఈ పెద్దమనిషి నిర్వాకమిది. రేపు ఇదే అమరావతిలో ఆయన సొంతంగా నిర్మించుకునే ఇంటిని కూడా ఇలా రెండు మార్లు కడతారా.. అని మాత్రం అడగొద్దు! సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల టెండర్లలో కమీషన్లు దండుకోవడమే లక్ష్యంగా సర్కారు పెద్దలు అడుగులు ముందుకు వేస్తున్నారు. 2016–18 మధ్య అప్పుగా తెచ్చిన రూ.353 కోట్లతో తాత్కాలిక అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మించి కమీషన్లు దండుకున్న ఇదే చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు), జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కో (హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) నుంచి తెస్తున్న అప్పులో రూ.1,649.33 కోట్లతో శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి పూనుకుంది. ఇలా నిధులు దుబారా చేస్తూ.. నచ్చిన సంస్థలకు ఏకపక్షంగా టెండర్లను కట్టబెడుతూ మళ్లీ కమీషన్లు కొట్టేయడానికి పన్నాగం పన్నింది. ఇందులో భాగంగా ముందే రూపొందించిన స్కెచ్‌ మేరకు రెండు టెండర్లలో తనకు నచ్చిన రెండు సంస్థలే పాల్గొని అధిక ధరలకు బిడ్‌లు దాఖలు చేసేలా చక్రం తిప్పారు. ఆపై ఆ సంస్థలకే టెండర్లు కట్టబెట్టి అనుకున్న మేరకు నిధులు దోచుకోవడానికి రూట్‌ క్లియర్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణ పనులకు వేర్వేరుగా పిలిచిన టెండర్లలో ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌సీసీ సంస్థలు రెండే బిడ్లు దాఖలు చేశాయి. హైకోర్టు భవన నిర్మాణ పనులను రూ.924.64 కోట్లతో ఎన్‌సీసీ సంస్థ దక్కించుకుంది. అసెంబ్లీ భవన నిర్మాణ పనులను రూ.724.69 కోట్లతో ఎల్‌ అండ్‌ టీ సంస్థ చేజిక్కించుకుంది. తద్వారా హైకోర్టు, అసెంబ్లీ భవనాల కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు రెండు సంస్థలు కోట్‌ చేయడంతో ప్రభుత్వ ఖజానాపై రూ.వందల కోట్ల మేర భారం పడింది. మొత్తంగా రెండు భవనాల కాంట్రాక్టు విలువ రూ.1,649.33 కోట్లు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) అథారిటీ సమావేశంలో ఈ రెండు టెండర్లను ఆమోదించి, కాంట్రాక్టు సంస్థలకు పనులు అప్పగించనున్నారు. రాజధాని ప్రాంతంలో 2015లో వెలగపూడి వద్ద 45.12 ఎకరాల్లో ఆరు లక్షల చదరపు అడుగుల్లో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులు చదరపు అడుగుకు రూ.17,183 చొప్పున వెచ్చించారు. ఈ లెక్కన ఇప్పుడు చేపట్టిన శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందో ఊహించుకోవచ్చు. 20,32,231 చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు » హైకోర్టు శాశ్వత భవనాన్ని అమరావతి ప్రభుత్వ శాశ్వత భవనాల సముదాయం (కాంప్లెక్స్‌)లోని ‘ఎఫ్‌’ బ్లాక్‌లో 42.36 ఎకరాల్లో.. బేస్‌మెంట్, గ్రౌండ్‌ ప్లోర్, ఏడు అంతస్తుల్లో (బీ+జీ+7) 20,32,231 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. » ఫోస్టర్స్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ ఈ భవన నిర్మాణ డిజైన్‌ను రూపొందించింది. ఈ భవన నిర్మాణ పనులకు రూ.752.06 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్‌ విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి.. మరో మూడేళ్లు భవనాన్ని నిర్వహించాలనే షరతుతో మార్చి 1న సీఆర్‌డీఏ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తంగా హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ అంచనా వ్యయం రూ.924.64 కోట్లకు ఎన్‌సీసీ సంస్థ దక్కించుకుంది. చేస్తోంది అప్పు.. ఆపై దుబారా ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని రూ.180 కోట్లతో, తాత్కాలిక హైకోర్టు భవనాన్ని రూ.173 కోట్లతో ప్రభుత్వం నిర్మించింది. ఇప్పుడు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టడంతో తాత్కాలిక భవనాలకు వెచ్చించిన రూ.353 కోట్లు వృథా అవుతాయి. అది కూడా అప్పు తెచ్చిందే కావడం గమనార్హం. ప్రస్తుతం శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్నది కూడా అప్పుగా తెచ్చిన నిధులతోనే. సుప్రీంకోర్టు కంటే పెద్దగా హైకోర్టు.. పార్లమెంటు కంటే పెద్దగా అసెంబ్లీ భవనాలను నిర్మిస్తుండటం వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఇదంతా దుబారా వ్యయమేనని, అప్పుగా తెచ్చిన నిధులను వృథా చేయడమేనని.. ఇలా దుబారా చేయడం సీఎం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 11,21,975 చదరపు అడుగుల్లో అసెంబ్లీ » అసెంబ్లీ శాశ్వత భవనాన్ని అమరావతి ప్రభుత్వ శాశ్వత భవనాల సముదాయం(కాంప్లెక్స్‌)లో ‘ఈ’ బ్లాక్‌లో బేస్‌మెంట్, గ్రౌండ్‌ ఫ్లోర్, 3 అంతస్తులు(బీ+జీ+3)లో 11,21,975 చదరపు అడుగుల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భవన డిజైన్‌ను ఫోస్టర్స్‌ అండ్‌ పార్టనర్స్‌ సంస్థే రూపొందించింది. » ఈ భవన నిర్మాణ పనులకు రూ.590.86 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్‌ విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి.. మరో మూడేళ్లు నిర్వహించాలనే షరతుతో ఈనెల 1న సీఆర్‌డీఏ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అసెంబ్లీ శాశ్వత భవనం నిర్మాణ పనులను రూ.724.69 కోట్లకు ఎల్‌ అండ్‌ టీ దక్కించుకుంది.

Growing pressure within the party on Chandrababus approach to the Waqf Bill9
వక్ఫ్‌ బిల్లుకు మద్దతుపై ముసలం!

సాక్షి, అమరావతి: వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుకు జేడీయూ మద్దతివ్వటాన్ని నిరసిస్తూ బిహార్‌లో పలువురు నేతలు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. ఎన్డీఏ కీలక భాగస్వామ్య పక్షంగా కొనసాగుతున్న జేడీయూకు బిహార్‌ ఎన్నికలకు ముందు ఇది అతి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇదే మాదిరిగా సీఎం చంద్రబాబు వక్ఫ్‌ సవరణకు బిల్లుకు మద్దతివ్వడం పట్ల టీడీపీకి చెందిన మైనార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుంటోంది. బిల్లుకు అనుకూలంగా ఓటే­యడం ద్వారా ముస్లిం సమాజానికి టీడీపీ ఎంత ద్రోహం తలపెట్టిందో పార్లమెంట్‌ సాక్షిగా తేటతెల్లమైందనే చర్చ జరుగుతోంది. దీంతో పలువురు నేతలు పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు గ్రహించడంతో ఒత్తిడి పెరిగిన సీఎం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర తీశారు. ఈ క్రమంలో ఏమాత్రం ఉపయోగం లేని మూడు సవరణలను ప్రతిపాదించి గొప్పగా ప్రచారం చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ద్వారా కుటుంబ వ్యవహారాలను మాట్లాడించడంతోపాటు రుషికొండ గురించి టీడీపీ కరపత్రంలో తప్పుడు కథనాలు రాయించారు. వైఎస్సార్‌ సీపీ వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిందని పొద్దున టీడీపీ సోషల్‌ మీడియాలో ప్రచారం చేయించిన చంద్రబాబు సాయంత్రాని కల్లా అనుకూలంగా ఓటు వేసిందంటూ మరో ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ముస్లిం సమాజానికి సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు డైవర్షన్‌ రాజకీయాలు చేస్తుండటం గమనార్హం.పెరుగుతున్న ఒత్తిళ్లతో ఉక్కిరిబిక్కిరి..వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేసిన ఎన్డీఏ పక్షాలు జేడీయూ, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు బిహార్, యూపీలో పలువురు నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తుండటం.. టీడీపీ రెండు నాలుకల వైఖరిపై ముస్లిం సమాజంలో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో సీఎం చంద్రబాబు మరో డ్రామాకు తెర తీశారు. తనకు అలవాటైన డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా వైఎస్సార్‌ సీపీపై సోషల్‌ మీడియాలో తలా తోకా లోకుండా దుష్ప్రచారానికి పచ్చ కూలీలను రంగంలోకి దించారు. హైదరాబాద్‌లోని ‘సాక్షి’ కార్యాలయం వక్ఫ్‌ బోర్డునకు చెందినదని, అందుకే లోక్‌సభలో వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లును వైఎస్సార్‌ సీపీ ఎంపీలు వ్యతిరేకించారని.. రాజ్యసభలో మాత్రం అనుకూలంగా ఓటు వేయించారని.. విప్‌ జారీ చేయలేదని.. ఇలా పరస్పర విరుద్ధంగా, పొంతన లేని ప్రచారం చేయించుకున్నారు. సవరణ బిల్లులో ఏమాత్రం సత్తాలేని మూడు సవరణలు ప్రతిపాదించి ముస్లింలను మభ్యపుచ్చేందుకు యత్నించి బోనులో నిలబడ్డ చంద్రబాబు తన నిర్వాకాలకు సమాధానం చెప్పకుండా బురద చల్లేందుకు విఫల యత్నాలు చేశారు.మైనార్టీలకు నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోనని ఎన్నికల సమయంలో చంద్రబాబు గంభీరంగా ప్రకటనలు చేయగా గుంటూరు ఎంపీ అభ్యర్థి అయితే మైనార్టీలకు నష్టం జరిగితే ఏకంగా రాజీనామా చేస్తానని చెప్పారు. వక్ఫ్‌ బిల్లు నేపథ్యంలో ముస్లిం మైనార్టీలంతా టీడీపీని నిలదీస్తుండటంతో దీని నుంచి బయట పడేందుకు చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు నుంచి నేడు పీ 4 కార్యక్రమం దాకా నోరు తెరిస్తే చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్‌ బిల్లుపై స్పందించాల్సి పోయి కుటుంబ విషయాలను ప్రస్తావించటాన్ని బట్టి చంద్రబాబు స్క్రిప్టు ప్రకారమే నడుచుకుంటున్నట్లు మరోసారి స్పష్టమైందని, ఇదంతా డైవర్షన్‌ రాజకీయాల్లో భాగమేనని వ్యాఖ్యానిస్తున్నారు.స్పష్టంగా వ్యతిరేకించిన వైఎస్సార్‌ సీపీ.. ఆది నుంచి అదే విధానంవక్ఫ్‌ చట్ట సవరణ బిల్లు విషయంలో వైఎస్సార్‌ సీపీ మొదటినుంచి తన విధానాన్ని చాలా స్పష్టంగా చెబుతూ వచ్చింది. రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఎప్పుడో ప్రకటించారు. ఆ మేరకు మొన్న లోక్‌సభలో.. నిన్న రాజ్యసభలోనూ బిల్లుకు వ్యతిరేకంగా పార్టీ ఓటు వేసింది.వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్సార్‌ సీపీ తన ఎంపీలకు విప్‌ జారీ చేసింది. బిల్లును పార్టీ వ్యతిరేకించిందనేందుకు లోక్‌సభ, రాజ్యసభల్లో రికార్డయిన ఉభయ సభల కార్యకలాపాలే తిరుగులేని రుజువు. వక్ఫ్‌ బిల్లుపై పార్లమెంట్‌లో వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి ప్రసంగాలే మరొక సాక్ష్యం.టీడీపీ ప్రతిపాదించిన నిస్సత్తువ సవరణలివీ..వక్ఫ్‌ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వవద్దన్న తమ విజ్ఞప్తిని పట్టించుకోకపోగా.. సత్తువ లేని సవరణలు ప్రతిపాదించి వాటికి జేపీసీ (పార్లమెంట్‌ సంయుక్త కమిటీ) ఆమోదం తెలిపిందని, అది తమ ఘనతేనని టీడీపీ ప్రచారం చేసుకోవడంపై ముస్లిం సమాజం మండిపడుతోంది. జేపీసీకి టీడీపీ సవరణలు ప్రతిపాదించినట్లు ఆ పార్టీ గొప్పలు చెప్పుకోవడం, జాతీయ మీడియాలో ప్రచారం చేసుకోవటమేగానీ దీనికి సంబంధించి ఎక్కడా కనీసం కసరత్తు చేసిన దాఖలాలు లేవని, ఏ ఒక్కరినీ సంప్రదించలేదని పేర్కొంటున్నారు. అసలు టీడీపీ ప్రతిపాదించిన మూడు సవరణలు ఏమాత్రం పస లేనివని, ముస్లింల పట్ల ఆ పార్టీ మొసలి కన్నీళ్లు కారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా బిహార్‌ ఎన్నికల ముంగిట ఎన్డీఏ కీలక భాగస్వామ్య పక్షం ఎన్డీఏకి ఆ పార్టీ నేతలు షాకులిస్తున్నారు. వక్ఫ్‌ సవరణ బిల్లుకు సీఎం నితీష్‌ సారథ్యంలోని జేడీయూ మద్దతివ్వటాన్ని నిరనిస్తూ పలువురు నేతలు మూకుమ్మడి రాజీనామాలు సమర్పిస్తున్నారు.1) సాధారణంగా కొత్త చట్టాలన్నీ అవి రూపుదిద్దుకుని ఆమోదం పొందిన నాటి నుంచే అమలులోకి వస్తాయి. అంతేగానీ పాత తేదీలకు వర్తించవు. అలాంటప్పుడు ఆస్తుల పునఃపరిశీలనకు అవకాశం లేదంటూ టీడీపీ ప్రతిపాదించిన సవరణకు ఏం విలువ ఉంటుందని ముస్లిం పెద్దలు నిలదీస్తున్నారు.2) రెండో సవరణ కింద.. వక్ఫ్‌ ఆస్తుల నిర్థారణలో జిల్లా కలెక్టర్‌కు తుది అధికారం ఉండరాదని, రాష్ట్ర ప్రభుత్వం హయ్యర్‌ ర్యాంకింగ్‌ అథారిటీ ఉన్న అధికారిని నియమిస్తుందని ప్రతిపాదించారు. అధికారులు ఎవరైనప్పటికీ ఆయా ప్రభుత్వాల విధానాలకు అనుగుణంగానే వ్యవహరిస్తారు. అలాంటప్పుడు కలెక్టర్‌ అయినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా ఒకటే కదా! ఏ అధికారిని నియమించినా ప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకుంటారు కదా!! మరి ఈ సవరణ సత్తువ లేని సవరణ కాదా?3) మూడో సవరణ పేరుతో.. డిజిటల్‌ పత్రాలను సమర్పించేందుకు ఆర్నెళ్లకుపైగా గడువు పొడిగింపును ప్రతిపాదించారు. వక్ఫ్‌ ఆస్తుల డిజిటలైజేషన్‌ ప్రక్రియ ఇప్పటికే పూర్తైందని ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ లాంటి బీజేపీ నేతలే చెబుతున్నారు. అంటే.. ఇప్పటికే పూర్తయిన ప్రక్రియకు టీడీపీ సవరణలను ప్రతిపాదించిందని భావించాలా??

Indian Exporters start talks with buyers on US tariffs10
టారిఫ్‌ల భారంపై బేరసారాలు

న్యూఢిల్లీ: భారీ టారిఫ్‌ల విధింపుతో ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై ప్రభావం పడనున్న నేపథ్యంలో అమెరికా సంస్థలతో భారతీయ ఎగుమతిదారులు సంప్రదింపులు ప్రారంభించారు. ఈ అసాధారణ పరిస్థితిని ఎదుర్కొనే మార్గాలపై వారితో చర్చలు జరుపుతున్నట్లు ఎగుమతిదారుల సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్‌ ఎస్‌సీ రాల్హన్‌ తెలిపారు. దేశీయంగా ఉక్కు రేట్లు ఇప్పటికే భారీగా ఉన్న తరుణంలో అధిక సుంకాల భారాన్ని ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల పరిశ్రమ భరించే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, టారిఫ్‌లతో అమెరికాలో మన లెదర్‌ ఉత్పత్తులకు డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని ఫుట్‌వేర్‌ ఎగుమతి సంస్థ ఫరీదా గ్రూప్‌ చైర్మన్‌ రఫీక్‌ అహ్మద్‌ చెప్పారు. అమెరికాలోని లెదర్‌ ఉత్పత్తుల దిగుమతిదారులు, టారిఫ్‌లపరమైన నష్టాల్లో కొంత భరించాలని తమను కోరుతున్నారని తెలిపారు. కొన్నాళ్ల పాటు ఉత్పత్తిని నిలిపివేయాలని కూడా వారు అడిగినట్లు వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే దీర్ఘకాలంలో మన ఎగుమతులకు అమెరికాలో మార్కెట్‌ గణనీయంగా కుదించుకుపోవచ్చని పేర్కొన్నారు. ఇక, అమెరికా అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా ఉన్నందున అక్కడి నుంచి కొన్ని దిగుమతులపై సుంకాలను తగ్గించడం మనకు కూడా శ్రేయస్కరమని ఎఫ్‌ఐఈవో వైస్‌ ప్రెసిడెంట్‌ రవికాంత్‌ కపూర్‌ తెలిపారు. కార్పెట్లు, హోమ్‌ ఫరి్న షింగ్‌ ఉత్పత్తులపై అధిక టారిఫ్‌ల వల్ల పరిశ్రమలో గణనీయంగా ఉద్యోగాలు పోయే ముప్పు ఉందని వివరించారు. బియ్యంపై ప్రభావం తాత్కాలికమే.. దీర్ఘకాలికంగా చూస్తే బియ్యం ఎగుమతులపై సుంకాల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. తాత్కాలికంగా ధరలు పెరిగినా, రెండు–మూడు నెలల్లో అంతా సర్దుకోగలదని ఇండియన్‌ రైస్‌ ఎక్స్‌పోర్టర్స్‌ ఫెడరేషన్‌ (ఐఆర్‌ఈఎఫ్‌) జాతీయ అధ్యక్షుడు ప్రేమ్‌ గర్గ్‌ తెలిపారు. వ్యూహాత్మక ప్రణాళికలతో మన పరిశ్రమలను కాపాడుకోవడంతో పాటు అమెరికాలో కార్యకలాపాలను కూడా విస్తరించవచ్చని ఆయన చెప్పారు. టారిఫ్‌లు పెంచినప్పటికీ మిగతా పోటీ దేశాలతో పోలిస్తే ఇప్పటికీ భారత్‌ వైపే మొగ్గు ఉంటుందని వివరించారు. మరోవైపు, ప్రస్తుత కాంట్రాక్టులను సమీక్షించుకోవాల్సి రావచ్చని, అమెరికా దిగుమతిదారులు మరింత ఎక్కువ కాలం క్రెడిట్‌ ఇవ్వాలని కోరవచ్చని వ్యాపారవర్గాలు చెప్పాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 52.4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి చేయగా అందులో 2.34 లక్షల టన్నులను అమెరికాకు పంపింది. 2024 ఏప్రిల్‌–నవంబర్‌ మధ్య కాలంలో 42 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతుల్లో అమెరికా వాటా 2.04 లక్షల టన్నులుగా ఉంది. బియ్యం ఎగుమతులకు పశి్చమాసియా ప్రధాన గమ్యస్థానంగా ఉంటోంది.టారిఫ్‌ల ఎఫెక్ట్‌ స్వల్పమే నితి ఆయోగ్‌ సభ్యులు విర్మాణీ న్యూఢిల్లీ: యూఎస్‌ విధించిన ప్రతీకార టారిఫ్‌ల ప్రభావం భారత్‌పై స్వల్పమేనని నితి ఆయోగ్‌ సభ్యులు అరవింద్‌ విర్మాణీ పేర్కొన్నారు. దేశీ ఆర్థిక వ్యవస్థ విదేశీ వాణిజ్యంపై అతితక్కువగా ఆధారపడుతుండటమే దీనికి కారణమని తెలియజేశారు. మధ్యకాలానికి టారిఫ్‌లతో తలెత్తనున్న ప్రతికూలతలు ప్రతిపాదిత యూఎస్‌ భారత్‌ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(బీటీఏ) తొలి దశ అమలుతో తొలగిపోనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇక దీర్ఘకాలంలో చూస్తే తుది బీటీఏ కారణంగా రానున్న 5–10ఏళ్లలో లబ్ది పొందేందుకు వీలున్నట్లు తెలియజేశారు. అమెరికా వస్తువులపై అధిక సుంకాలు విధిస్తున్నట్లు పేర్కొంటూ భారత్‌పై యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తాజాగా 26 శాతం ప్రతీకార టారిఫ్‌లకు తెరతీసిన విషయం విదితమే. అయితే ఆయా దేశాల వాణిజ్య లోటుతోపాటు.. దిగుమతులను పరిగణించి చేసిన మదింపు ద్వారా టారిఫ్‌లు అమలుకానున్నట్లు వివరించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement