Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Key Comments AT YSRCP local bodies Representatives Meeting Updates1
హ్యాట్సాఫ్‌.. మీ నిబద్ధతకు ఎప్పుడూ రుణపడి ఉంటా: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ పాలనలో పేదల నోట్లోకి నాలుగు ముద్దలు వెళ్లేవని.. కానీ కూటమి ప్రభుత్వం వాళ్ల ముందు నుంచి ఉన్న కంచం లాగిపడేసిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బుధవారం తాడేపల్లిలోని కేంద్రకార్యాలయంలో భేటీ అయిన ఆయన.. ఈ సందర్భంగా కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వాళ్ల తెగువను అభినందించారు.‘‘మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటాను, పార్టీకూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను. ఉప ఎన్నికల్లో మీరు చూసిన తెగువకు, ధైర్యానికి హాట్సాఫ్‌. మొత్తం 50 చోట్ల ఎన్నికలు జరిగితే, 39 స్థానాలు వైఎస్సార్‌సీపీ గెలిచింది. కార్యకర్తలు తెగింపు చూపారు. తెలుగుదేశం పార్టీకి ఈ స్థానాల్లో ఎక్కడా గెలిచే నంబర్లు లేవు. వారికి సంఖ్యా బలం లేనే లేదు. కానీ.. భయాందోళనల ఈ ప్రభుత్వం మధ్య ఎన్నికలు నిర్వహించాలనుకుంది. పోలీసులతో భయపెట్టి, బెదిరించారు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకుంటున్న చంద్రబాబుకి బుద్ధిలేదు. వాస్తవంగా ఈ ఎన్నికలను టీడీపీ వదిలేయాలి. కానీ అధికార అహంకారంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూశారు. నిజంగా ఇది ధర్మమేనా? న్యాయమేనా?. చంద్రబాబు(Chandrababu) అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా చంద్రబాబు వ్యవహరించలేదు. ప్రజలకిచ్చిన హామీల విషయంలో మోసం చేశారు. ప్రజలకు 143 హామీలు ఇచ్చి మభ్యపెట్టారు. చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలే కనిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ పాలనలో ఏదో ఒక బటన్‌ నొక్కేవాళ్లం. ఏదోరూపంలో ప్రతి కుటుంబానికీ మంచి జరిగింది. నాలుగువేళ్లూ నోట్లోకి పోయే పరిస్థితి ఉండేది. చంద్రబాబు ఇప్పుడు ఉన్న ప్లేటును కూడా తీసేశాడు. ప్రజల్లోకి టీడీపీ కార్యకర్తలను కూడా పంపే పరిస్థితి ఆయనకు లేదు. తిరుపతి మున్సిపల్‌ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలను ప్రజలంతా చూశారు. విశాఖపట్నంలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి, అక్కడ అక్రమాలు చేస్తున్నారు. మన కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నం మనవాళ్లు చేశారు. అక్కడ 40వ వార్డు కార్పొరేటర్‌ ఇంటికి వెళ్లి.. ఆయన భార్యను భయపెట్టే ప్రయత్నం పోలీసులు చేశారు. రామగిరిలో 10 ఎంపీటీసీల్లో 9కి వైయస్సార్‌సీపీవే. కాని అక్కడ ఎన్నిక జరగనీయకుండా అడ్డుకుంటున్నారు. భద్రత పేరుతో పోలీసులు తీసుకెళ్లి.. దారి మళ్లించి, స్వయంగా ఎస్సై ఎంపీటీసీలను కిడ్నాప్‌చేసే పరిస్థితి కనిపిస్తోంది. అప్పటికీ వినకపోతే, ఏకంగా మండల కార్యాలయంలో నిర్బంధించి బైండోవర్‌ చేశారు. అంతటితో ఆగకుండా లింగమయ్య అనే బీసీ నాయకుడ్ని చంపేశారు. ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు ఇలాంటి దారుణాలు చేయిస్తున్నారు. ప్రభుత్వం అంటే ఇలాంటి పాలన చేస్తుందా?.. .. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 16కు 16 ఎంపీటీసీలు మనవాళ్లే. ఆరుగుర్ని ప్రలోభపెట్టి.. తీసుకెళ్లిపోయాడు. మరో 9 మంది వైఎస్సార్‌సీపీతోనే ఉన్నారు. వాళ్లను ఎన్నికల కేంద్రానికి వెళ్లనీయకుండా పోలీసులు, టీడీపీ వాళ్లు అడ్డుకున్నారు. కోరం లేకపోయినా.. గెలిచామని డిక్లేర్‌ చేయించుకున్నారు. రాష్ట్రానికి సీఎం, కుప్పంకు ఎమ్మెల్యే చంద్రబాబే.. అయినా సరే ఒక చిన్నపదవికోసం ఇన్ని దారుణాలు చేశారు.ఈ ఎన్నికల్లో నా చెల్లెమ్మలు, నా అక్కలు మరింత గట్టిగా నిలబడ్డారు. దీనికి నేను గర్వపడుతున్నాను. ఇలాంటి ఘటనలు జరుగుతున్న పార్టీ ప్రజాప్రతినిధులు గట్టిగా నిలబడి స్ఫూర్తిని చూపించారు. వీరు చూపించిన స్ఫూర్తి చిరస్థాయిగా ఉంటుంది. కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ జగన్‌ ఎప్పుడూ రుణపడి ఉంటాడు. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాయి. P-4 అనే కొత్త మోసాన్ని మొదలుపెట్టాడు. సమాజంలో ఉన్న 20శాతం పేదవాళ్ల బాగోగులకు 10శాతం మందికి అప్పగిస్తాడంట!. రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డులు ఎన్ని ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా?. రాష్ట్రంలో 1.61 కోట్ల కుటుంబాలు ఉంటే అందులో 1.48శాతం కుటుంబాలకు తెల్ల రేషన్‌ కార్డుదారులు ఉన్నారు. వీరంతా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రంలో ఇన్‌కం ట్యాక్స్‌ కట్టేవారు ఎంతమంది ఉన్నారో చంద్రబాబుకు తెలుసా?. రాష్ట్రంలో 8.6 లక్షల మంది ఇన్‌కంట్యాక్స్‌ కడుతున్నారు. ఆయన చెప్పిన ప్రకారం.. ఈ 1.48 కోట్ల మంది కుటుంబాలను 8.6 లక్షల మందికి అప్పగించాలి కదా?. ఇన్ని రకాలుగా మోసాలు చేస్తాడు చంద్రబాబు. చివరకు చంద్రబాబు మీటింగ్‌ల నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు. చంద్రబాబుకు అన్నీ తెలుసు, కాని కావాలనే మోసం చేస్తాడు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ గురించి అడిగితే రాష్ట్రం అప్పుల పాలు అంటాడు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ ఎగరగొట్టడానికి అప్పులపై అబద్ధాలు చెప్తున్నాడు. ప్రజలకు సమస్యలు వస్తే వాటి పరిష్కారంకోసం తపించే ప్రభుత్వం రావాలని ప్రజలు మళ్లీ కోరుకుంటారు. మాటచెప్తే.. ఆ మాటమీద నిలబడే ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తుంటారు. రాబోయే రోజులు మనవి. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. వైఎస్సార్‌సీపీ(YSRCP) అఖండ మెజార్టీతో గెలుస్తుంది. ఈసారి కార్యకర్తలకోసం కచ్చితంగా పార్టీ నిలబడుతుంది. కోవిడ్‌ కారణంగా నేను కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోవచ్చు. జగన్‌ 2.O దీనికి భిన్నంగా ఉంటుంది. కార్యకర్తలకోసం గట్టిగా నిలబడతాను’’ అని జగన్‌ అన్నారు.

Sakshi Editorial On Uttar Pradesh Bulldozer demolitions2
ఇకనైనా అరాచకం ఆగేనా!

రాచరికాల్లో అధికారానికీ, దర్పానికీ, దానిద్వారా లభించే న్యాయానికీ రాజదండం చిహ్నం. ఈమధ్యకాలంలో బుల్‌డోజర్‌ అలాంటి పాత్ర పోషిస్తున్న వైనం కనబడుతోంది. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ పాలన మొదలయ్యాక బుల్‌డోజర్‌ అర్థం, దాని పరమార్థం మారిపోయాయి. ఆ రాష్ట్రాన్ని చూసి మరికొన్ని రాష్ట్రాలు వాతలు పెట్టుకోవటం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో 2021 మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అమానవీయంగా, చట్టవిరుద్ధంగా ఆవాసాలను కూల్చేసిన అధికారగణంపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయటంతోపాటు, ఇళ్లు కోల్పోయిన ఆరుగురు పిటిషనర్లకూ ఆరువారాల్లో రూ. 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు... ఈ ఉదంతం తమ అంతరాత్మను తీవ్రంగా కలవరపరిచిందని ధర్మాసనం తెలియజేసింది. అధికారమంటే ఇష్టానుసారం ఏదైనా చేయడానికి దొరికిన లైసెన్స్‌గా భావించే సంస్కృతి దేశంలో ముదిరిపోయింది. ఒక్క యూపీలోనేకాదు... మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌ వగైరాల్లో ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకున్న తీరు గమనిస్తే ఇదో అంటువ్యాధిగా మారిందన్న అభిప్రాయం కలుగుతుంది. ఏదైనా కేసులో నిందితులుగా ఉన్నా లేదా శిక్షపడినా... అధికార పక్షానికి అనుకూలంగా లేకపోయినా అలాంటివారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చేయడానికి బుల్‌డోజర్‌లు అత్యుత్సాహంతో ఉరుకుతున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. నిర్మాణ నిబంధనల్ని తీవ్రంగా ఉల్లంఘించారని తేలినా, ప్రభుత్వ భూమినో, మరొకరి భూమినో దురా క్రమించి కట్టారని తేలినా అలాంటివాటిని కూల్చేయటాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ అందుకొక విధానం ఉండాలి. చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. తప్పు చేశారని ఆరోపణ లొచ్చినవారికి తగిన నోటీసులిచ్చి వారి సంజాయిషీ కోరాలి. సంతృప్తి చెందనట్టయితే ఆక్రమణ దారులకు హేతుబద్ధమైన వ్యవధినిచ్చి కూల్చివేత ప్రక్రియ ప్రారంభించాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు విచారిస్తున్న కేసు సంగతే తీసుకుంటే 2021 మార్చి 1న మొదటిసారి అక్కడ నివాసముంటున్నవారికి నోటీసులు వచ్చాయి. వారికి అంతకు దాదాపు మూణ్ణెల్ల ముందే... అంటే జనవరి 8న నోటీసులిచ్చినట్టు, అందులో ఆ నెల 27లోగా ఎవరికివారు సొంత ఖర్చులతో ఇళ్లు కూల్చేయాలని ఆదేశించినట్టు ఉంది. దానికి స్పందన రాకపోవటంతో తాజాగా నోటీసులు జారీచేశామని అందులో పేర్కొన్నారు. మరో ఆరు రోజుల్లో బుల్‌డోజర్‌లతో వచ్చి ఇళ్లు కూల్చేశారు. తొలుత నోటీసులు వ్యక్తిగతంగా ఇవ్వటానికి చేసిన ప్రయత్నం విఫలం కావటంతో ఇళ్ల దగ్గర అతికించామన్న ప్రభుత్వ వాదనను న్యాయమూర్తులు జస్టిస్‌ అభయ్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ లతో కూడిన బెంచ్‌ విశ్వసించలేదు. పిటిషనర్లకు సహేతుకమైన వ్యవధినిచ్చిన దాఖలా కనబడటం లేదని, ఇది పౌరులకు రాజ్యాంగంలోని 21వ అధికరణ ద్వారా సమకూరిన ఆవాస హక్కును ఉల్లంఘించటమేనని తేల్చిచెప్పింది. ఈ తీర్పు అనేకవిధాల ఎన్నదగినది. పిటిషనర్లకు ఆ స్థలంపై చట్టబద్ధమైన హక్కుందా లేదా అన్న అంశంలోకి ధర్మాసనం పోలేదు. దానిపై వారు విడిగా న్యాయస్థానాల్లో తేల్చుకోవాల్సిందే! 2023 ఏప్రిల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన రాజకీయ నాయకుడు, పలు కేసుల్లో నింది తుడైన అతీఖ్‌ అహ్మద్‌ అక్రమంగా ఆక్రమించుకున్న భూమిలో ఈ ఇళ్లున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఎన్నడో 1906లో అప్పటి అలహాబాద్‌ జిల్లా కలెక్టర్‌ షకీర్‌ అహ్మద్‌ అనే వ్యక్తికి 30 ఏళ్లకు లీజుకిచ్చి మరో రెండు దఫాలు పొడిగించుకునే వీలు కల్పించారని రికార్డులు చెబు తున్నాయి. 1960లో జిల్లా మేజిస్ట్రేట్‌ అనుమతితో షకీర్‌ దాని హక్కుల్ని వేరేవారికి బదలాయించాడు. ఆ తర్వాత క్రమంలో అది మరికొందరి చేతులు మారింది. చివరకు ప్రస్తుత పిటిషనర్లు దాన్ని కొనుగోలు చేశారు. ప్రభుత్వం వాదిస్తున్నట్టు ఆ కొనుగోలు చెల్లకపోవచ్చు. అది ప్రజా ప్రయోజనం కోసం వినియోగించాల్సిన భూమే కావొచ్చు. అంతమాత్రాన నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇళ్లు కూల్చటం సరైన చర్య కాదు. సుప్రీంకోర్టు తీర్పు దీన్ని తేటతెల్లం చేసింది.ఈ సందర్భంగా వేరేచోట బుల్‌డోజర్‌ కూల్చివేతలు సాగిస్తుండగా ఒకటో తరగతి బాలిక అనన్యా యాదవ్‌ తన స్కూల్‌ బ్యాగ్‌ను రక్షించుకోవటానికి మంటలంటుకున్న షెడ్‌ సమీపానికి వెళ్లిన వీడియోను న్యాయమూర్తులు ప్రస్తావించటం గమనార్హం. అలాంటి ఉదంతాలు అందరినీ దిగ్భ్రాంతిపరుస్తాయన్న వారి వ్యాఖ్యలతో ఏకీభవించని వారుండరు. గత నవంబర్‌లో జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం ఇటువంటి వ్యాఖ్యలే చేసింది. ‘ఇళ్లు కూల్చినప్పుడల్లా నిశిరాత్రిలో నడిరోడ్లపై చిన్నారులూ, మహిళలూ విలపిస్తున్న దృశ్యాలు అరాచకానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి’ అని ధర్మాసనం గుర్తు చేసింది. ఇలాంటి సంద ర్భాల్లో కూల్చివేతలకు పాల్పడిన అధికారుల నుంచి ఇళ్ల, దుకాణాల పునర్నిర్మాణానికి అయ్యే వ్యయం వసూలు చేయాలని కూడా చెప్పింది. ఇతర మార్గదర్శకాలు కూడా రూపొందించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలైనా ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. కేవలం అయిదేళ్ల కోసం ఎన్నికై అధి కారంలోకొచ్చిన ప్రభుత్వాలు శాశ్వతంగా నిలిచే రాజ్యాంగ విలువలను కాలరాయటం, ఇష్టాను సారం ప్రవర్తించటం తప్పుడు సంకేతాలిస్తుంది. సాధారణ పౌరుల్ని కూడా చట్ట ఉల్లంఘనలకు ప్రోత్సహిస్తుంది. అందుకే ప్రభుత్వాలు ఎంత త్వరగా మేల్కొంటే అంత మంచిది. నాలుగేళ్లు ఆలస్యమైనా సర్వోన్నత న్యాయస్థానంలో బాధితులకు సరైన న్యాయం దక్కటం హర్షించదగ్గది.

IPL 2025: Gujarat Titans Beat RCB By 8 Wickets3
IPL 2025: ఉతికి ఆరేసిన బట్లర్‌.. ఆర్సీబీపై గుజరాత్‌ ఘన విజయం

చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు) వేదికగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్‌ 2) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి గుజరాత్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. లివింగ్‌స్టోన్‌ (40 బంతుల్లో 54; ఫోర్‌, 5 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మధ్యలో జితేశ్‌ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్‌) కూడా ఓ మోస్తరుగా బ్యాట్‌ ఝులిపించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో వీరు మినహా ఎవరూ రాణించలేదు. సాల్ట్‌ 14, విరాట్‌ కోహ్లి 7, పడిక్కల్‌ 4, పాటిదార్‌ 12, కృనాల్‌ పాండ్యా 5 పరుగులు చేసి ఔటయ్యారు. గుజరాత్‌ బౌలర్లలో సిరాజ్‌ 3 వికెట్లు తీయగా.. సాయికిషోర్‌ 2, అర్షద్‌ ఖాన్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, ఇషాంత్‌ శర్మ తలో వికెట్‌ పడగొట్టారు.170 పరుగుల నామ మాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్‌ బట్లర్‌ (39 బంతుల్లో 73 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్‌ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్‌), షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (18 బంతుల్లో 30 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు) గుజరాత్‌ను గెలిపించారు. తొలుత నిదానంగా ఆడిన బట్లర్‌.. ఆతర్వాత గేర్‌ మార్చి ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆఖర్లో రూథర్‌ఫోర్డ్‌ (ఇంపాక్ట్‌ ప్లేయర్‌) తనదైన శైలితో చెలరేగిపోయాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ తలో వికెట్‌ తీశారు. ఈ గెలుపుతో గుజరాత్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకి​ంది. టాప్‌ ప్లేస్‌లో ఉండిన ఆర్సీబీ మూడో స్థానానికి పడిపోయింది.

Sakshi Guest Column On Justice Nirmaljit Kaur4
ఎంత ‘నిర్మల’మైన న్యాయం?!

ఇంట్లో గోనె సంచుల్లో నోట్ల కట్టలు తగులబడిన జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ కథ ఇంకా మరిచిపోక ముందే, దాని అడుగుజాడల్లోనే, థ్రిల్లర్‌ సినిమాను మైమరపింపజేసే మరొక న్యాయమూర్తి రసవత్తరమైన కథ గురించి చెప్పుకోవ లసి వస్తున్నది. ‘తీగలాగితే డొంక కదిలింది’ అనే సామెతను అక్షరాలా నిజం చేసే వాస్తవ కథనం ఇది. సినిమా కథలు తిరిగినన్ని మలుపులు, అనూహ్య సంఘ టనలు, తారుమారు పరిణామాలు ఎన్నో ఉన్న ఈ అవినీతి కథ ఒక తారుమారు తమాషాతో మొదలయింది. పంజాబ్‌– హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ నిర్మల్‌జిత్‌ కౌర్‌ 2008 జూలై 10న పదవి స్వీకరించారు. తర్వాత నెల రోజు లకు, 2008 ఆగస్ట్‌ 13న ఆమె ఇంటికి ఒక వ్యక్తి వచ్చి ‘నిర్మల్‌ జీకి ఇమ్మని ఢిల్లీ నుంచి ఈ పార్సెల్‌ వచ్చింది’ అని ఒక ప్లాస్టిక్‌ కవర్‌ ఇచ్చాడు. అమ్రిక్‌ సింగ్‌ అనే వాచ్‌మన్‌ ఆ పార్సెల్‌ లోపలికి తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు విప్పితే, అందులో నుంచి అక్షరాలా పదిహేను లక్షల రూపాయలు బైటపడ్డాయి. ఆ పార్సెల్‌ తెచ్చిన ప్రకాష్‌ అనే వ్యక్తిని పోలీసులకు అప్పగించి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విషయం తెలియజేశారు. పోలీసులు ప్రకాష్‌ను ప్రశ్నించగా, అతను పంజాబ్‌ హైకోర్టులో అడ్వకేట్‌ జనరల్‌గా ఉన్న సంజీవ్‌ బన్సాల్‌ దగ్గర గుమాస్తా అని తేలింది. పోలీసులు బన్సాల్‌ను ప్రశ్నించగా, అవి తన డబ్బులు కావని, ఢిల్లీకి చెందిన హోటల్‌ యజమాని రవీందర్‌ సింగ్‌ తనకు పంపి, జస్టిస్‌ నిర్మల్‌ యాదవ్‌కు అంద జేయమని చెప్పాడని, తన గుమాస్తాకు ‘జస్టిస్‌ నిర్మల్‌ జీకి ఇవ్వు’ అని పంపిస్తే, పొరపాటున జస్టిస్‌ నిర్మల్‌జిత్‌ జీకి ఇచ్చా డని చెప్పాడు. అంటే ఆ సొమ్ము వాస్తవంగా చేరవలసింది జస్టిస్‌ నిర్మల్‌ యాదవ్‌ అనే మరొక న్యాయమూర్తికన్నమాట. గుమాస్తా చేసిన చిన్న పొరపాటువల్ల, ఇద్దరు న్యాయమూర్తుల పేర్లలో నిర్మల్‌ ఉండడం వల్ల ఈ అవినీతి బయటపడింది. జస్టిస్‌ నిర్మల్‌జిత్‌ కౌర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో, రెడ్‌ హ్యాండెడ్‌గా పదిహేను లక్షల రూపాయలు, అది పట్టుకొచ్చి ఇచ్చిన వారు, పంపించినవారు దొరికారు గనుక పోలీసు కేసు నమోదయింది. కాని, న్యాయమూర్తి, అడ్వకేట్‌ జనరల్‌లకు ఇందులో భాగం ఉంది గనుక పది రోజుల్లో ఈ కేసును పోలీ సుల నుంచి సీబీఐకి బదిలీ చేశారు. తర్వాత సీబీఐ చేసిన దర్యాప్తులో సంజీవ్‌ బన్సాల్, రాజీవ్‌ గుప్తా కలిసి హరియాణా లోని పంచ్‌ కులాలో కొన్న ఒక భూమి కేసులో, జస్టిస్‌ నిర్మల్‌ యాదవ్‌ వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, అందుకు ప్రతిఫలంగా ఈ లంచం పంపించారని తేలింది. అది మాత్రమే కాక, జస్టిస్‌ నిర్మల్‌ యాదవ్‌ విదేశీ ప్రయాణపు టికెట్లు, విదే శాలలో ఆమె వాడిన మొబైల్‌ ఫోన్‌ కార్డ్‌ కూడా సంజీవ్‌ బన్సాల్‌ కొనిపెట్టాడని సీబీఐ సాక్ష్యాధారాలు సేకరించింది. నిందితులకు, న్యాయమూర్తికి మధ్య జరిగిన సంభాషణల ఫోన్‌ రికార్డులను కూడా సీబీఐ సేకరించింది. చివరికి అవినీతి నిరోధక చట్టం కింద, భారత శిక్షా స్మృతి కింద జస్టిస్‌ నిర్మల్‌ యాదవ్‌ మీద, మిగిలిన నిందితుల మీద కేసు పెట్టవచ్చునని సీబీఐ నిర్ధారించింది. ఇక్కడిదాకా సాఫీగా సాగిన కథ తర్వాత ఎన్నో ఉత్కంఠ భరితమైన మలుపులు తిరిగింది. న్యాయమూర్తి మీద ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇమ్మని కోరుతూ సీబీఐ స్థానిక అధికా రులు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఆ నివేదికకు జవాబిస్తూ సీబీఐ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ నిందితుల మీద కేసు నడపడానికి తగిన ఆధారాలు లేవని అన్నారు. కాని ఆ సమయంలో సీబీఐకి డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి ఇది తప్పకుండా ప్రాసిక్యూట్‌ చేయవలసిన అవినీతి నేరమే అన్నారు. సీబీఐ ఉన్నతాధికారులిద్దరు ఇలా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, మూడో అభిప్రాయం కోసం అప్పటి అటార్నీ జనర ల్‌కు పంపారు. అదే ప్రతిని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు కూడా పంపారు. అటార్నీ జనరల్‌ కూడా ఈ కేసులో పస లేదు అన్నారు. ఈ వ్యవహారం బయటకు పొక్కి, ‘హైకోర్టు న్యాయమూర్తి మీద కేసు నడపడానికి తిరస్కరించిన సీబీఐ’ అని హిందుస్థాన్‌ టైమ్స్‌ 2009 జూన్‌ 6న ఒక వార్త రాసింది. అది చూసిన అప్పటి న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ, ఇంత తీవ్రమైన వ్యవహారంలో కేసు నడపకపోవడం తప్పు అనీ, అలా చేస్తే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుందనీ తీవ్ర పదజాలంతో న్యాయశాఖ కార్యదర్శికి నోట్‌ పెట్టి, దర్యాప్తు చేసి నివేదిక ఇమ్మన్నారు. అప్పుడు సీబీఐ మళ్లీ కొత్తగా వచ్చిన అటార్నీ జనరల్‌ సలహా కోసం వెళ్లింది. కొత్త అటార్నీ జనరల్‌ కూడా కేసు అవసరం లేదు అంటూ పాత అటార్నీ జనరల్‌ అభిప్రాయాన్నే ప్రకటించారు. దానితో తర్వాత సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో కేసును ఉపసంహరించుకుంటున్నానని (క్లోజర్‌ రిపోర్ట్‌) సీబీఐ తెలిపింది. ఇక్కడ కథ మరొక మలుపు తిరిగి, సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి క్లోజర్‌ రిపోర్ట్‌ను తిరస్కరించి, కేసు నడపవల సిందే అన్నారు. అప్పుడు సీబీఐ మరొకసారి అనుమతి కోసం దరఖాస్తు... పైకి పంపించింది. దాన్ని పరిశీలించిన న్యాయ శాఖ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని నిర్ణయించగా, రాష్ట్రపతి 2011 మార్చ్‌లో అనుమతి ఇచ్చారు. అంటే రెడ్‌ హ్యాండెడ్‌గా అవినీతి పట్టు బడినా కేసు ప్రారంభించడానికే మూడు సంవత్సరాలు పట్టిందన్న మాట. అప్పుడు సీబీఐ చార్జిషీట్‌ వేసింది. అప్పటికే ఈ కేసు నడపడానికి వీలులేదని ఎన్నో పిటిషన్లు దాఖలు చేసిన జస్టిస్‌ నిర్మల్‌ యాదవ్‌ ఇప్పుడు ఈ అనుమతి చెల్లదని హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు అనుమతి చెల్లుతుందని తేల్చి చెప్పింది. ఆ తీర్పును నిర్మల్‌ యాదవ్‌ సుప్రీం కోర్టులో సవాలు చేయగా, అక్కడ కూడా ఆమెకు చుక్కెదురయింది. కేసును తాత్సారం చేయడానికి ఆమె వేసిన మరెన్నో పిటిషన్లు కూడా గడిచిన తర్వాత, చివరికి 2013 మేలో నెల లోపు దర్యాప్తు, చార్జెస్‌ ఫ్రేమ్‌ ప్రక్రియలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలా అవినీతి సొమ్ము దొరికిన ఐదు సంవత్సరాల తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టులో కేసు మొదలయింది. ఏడున్నర సంవ త్సరాల తర్వాత చార్జెస్‌ ఫ్రేమ్‌ అయి విచారణ మొదలయింది. ఈలోగా జస్టిస్‌ నిర్మల్‌ యాదవ్‌ పదవీ విరమణ జరిగింది. సంజీవ్‌ బన్సాల్‌ మరణించాడు. డబ్బు పట్టుకొచ్చిన గుమాస్తా మరణించాడు. నలుగురు కీలక సాక్షులు అడ్డం తిరిగారు. న్యాయస్థానం దాదాపు 70 మంది సాక్షులను విచారించింది. ఇలా ఎన్నెన్నో అవరోధాలు దాటి, ఘటన జరిగిన 17 సంవత్సరాల తర్వాత, కేసు మొదలైన 14 సంవత్సరాల తర్వాత... ఎట్టకేలకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అల్కా మాలిక్‌ సరిపోయినన్ని సాక్ష్యాధారాలు లేవని, సాక్షుల వాఙ్మూలాల్లో వైరుద్ధ్యాలున్నాయని కేసు కొట్టేశారు. ఎంత నిర్మలమైన న్యాయం!!ఎన్‌. వేణుగోపాల్‌ వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Major Earthquake In Japan5
జపాన్‌లో భారీ భూకంపం

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. జపాన్‌లోని క్యూషు కేంద్రంగా భూమి కంపించింది. ఈ ఏడాది జనవరిలో కూడా జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. భూకంపం ప్రభావంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, ఆస్తి నష్టం జరిగింది.గత ఏడాది ఆగస్టులోనూ జపాన్‌లో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. 6.9, 7.1 తీవ్రతతో ఏర్పడిన రెండు శక్తిమంతమైన భూకంపాలు నైరుతి దీవులైన క్యూషు, షికోకులను ప్రభావితం చేశాయి. గత ఏడాది జనవరి 1న 7.6 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో 300 మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, భూకంపాల పరంగా జపాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జోన్‌లో ఉంది. ఇక్కడి సముద్ర తీరప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం 80 శాతం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి.ఏఎఫ్‌పీ (Agence France-Presse) తెలిపిన వివరాల ప్రకారం జపాన్ ప్రభుత్వ సంస్థ భవిష్యత్‌లో మెగా భూకంపం రానున్నదని అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ భారీ భూకంపం భూమిపై అపరిమిత వినాశనాన్ని కలిగిస్తుందని, మూడు లక్షల మంది మరణానికి కారణమవుతుందని తెలిపింది. ఈ భారీ భూకంపం కారణంగా సునామీ సంభవిస్తుందని, ఇది అనేక నగరాలను సముద్రంలో కలిపేస్తుందని పేర్కొంది. ‘మెగా క్వేక్ అనేది చాలా శక్తివంతమైన భూకంపం. దీని తీవ్రత 8 లేదా అంతకన్నా అధిక తీవ్రతతో ఉంటుంది. ఇది భారీ విధ్వంసానికి కారణంగా నిలుస్తుంది. సునామీని కూడా సృష్టిస్తుందని పేర్కొంది.కాగా, ఇటీవల మయన్మార్‌ (Myanmar)లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. వేలాది మంది ప్రస్తుతం ఆస్పత్రులలో జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నారు. లెక్క లేనంత మంది గల్లంతయ్యారు. పలు నగరాల్లో, ఎత్తైన భవనాలు, ఇళ్లు, దేవాలయాలు శిథిలమయ్యాయి. మయన్మార్‌లో సంభవించిన భూకంపం థాయిలాండ్‌లోనూ వినాశనాన్ని మిగిల్చింది. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చింది.

Poonam Gupta appointment as RBI Deputy Governor6
ఆర్‌బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్‌.. ఎవరీ పూనమ్‌ గుప్తా?

ఢిల్లీ : కేంద్రం మరో మహిళా అధికారిణికి కీలక బాధ్యతలు అప్పగించింది. ఇటీవల 2014 బ్యాచ్‌కు చెందిన ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌ అధికారిణి నిధి తివారీని ప్రధాని మోదీ ప్రైవేట్‌ సెక్రటరీగా నియమించింది. తాజాగా, పూనమ్ గుప్తా అనే అధికారిణిని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 7 నుంచి 9 మధ్య మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముందు ప్రస్తుతం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకానమిక్ రీసెర్చ్ డైరెక్టర్‌ జనరల్‌ పూనమ్‌ గుప్తాను ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆమె ఈ ఏడాది జనవరిలో రిటైరైన ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైకల్ పత్రా స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్‌ గుప్తా మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. పూనమ్ గుప్తా ఎవరు?కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ పూనమ్ గుప్తా నియామకాన్ని ఆమోదించింది. ఆమె ప్రస్తుతానికి ప్రధానమంత్రికి ఆర్థిక సలహా కౌన్సిల్ సభ్యురాలు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకానమిక్ రీసెర్చ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా బాధత్యలు స్వీకరించే ముందు ఆమె ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో గ్లోబల్ మాక్రో, మార్కెట్ రీసర్చ్ లీడ్ ఎకానమిస్ట్‌గా పనిచేశారు. భారత అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల పరిశోధనా మండలిలో ప్రొఫెసర్‌గా, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌ బోధించడంతో పాటు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌లో పరిశోధకురాలిగా పనిచేశారు. ఆమె 16వ ఫైనాన్స్ కమిషన్ సలహా మండలిలో సభ్యురాలిగా ఉన్నారు.ఇక ఆమె చదువు విషయానికి వస్తే ఎకానమిక్స్‌లో పీహెచ్‌డీ : యూనివర్శిటీ ఆఫ్ మారీల్యాండ్, కాలేజ్ పార్క్ (1998)స్పెషలైజేషన్: మాక్రో ఎకానమిక్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ,ఇంటర్నేషనల్ ట్రేడ్ఎం.ఎ ఎకానమిక్స్ : యూనివర్శిటీ ఆఫ్ మారీల్యాండ్, కాలేజ్ పార్క్ (1995)ఎం.ఎ ఎకానమిక్స్‌ : ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ (1991)బీఏ ఎకానమిక్స్‌ : హిందూ కాలేజ్, ఢిల్లీ యూనివర్శిటీ (1989)ఆమె 1998లో అంతర్జాతీయ ఆర్థికశాస్త్రంపై చేసిన పీహెచ్‌డీకి EXIM బ్యాంక్ అవార్‌ను గెలిచారు

Team India Upcoming Home Season Schedule Released, India To Play West Indies, South Africa At Home7
భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్‌, సౌతాఫ్రికా.. షెడ్యూల్‌ విడుదల

ఈ ఏడాది భారత క్రికెట్‌ జట్టు హోం సీజన్‌ (స్వదేశంలో ఆడే మ్యాచ్‌లు) షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (ఏప్రిల్‌ 2) ప్రకటిం​చింది. అక్టోబర్‌లో వెస్టిండీస్‌.. నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో సౌతాఫ్రికా క్రికెట్‌ జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి.విండీస్‌ క్రికెట్‌ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో తొలి టెస్ట్‌ అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 2-6 మధ్య తేదీల్లో జరుగనుంది. రెండో టెస్ట్‌ కోల్‌కతా వేదికగా అక్టోబర్‌ 10-14 మధ్య తేదీల్లో జరుగుతుంది. టెస్ట్‌ సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ భారత్‌లో పర్యటించడం 2018 తర్వాత ఇదే మొదటిసారి. ఆ సిరీస్‌లో భారత్‌ 2-0 తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది.అనంతరం నవంబర్‌ నెలలో సౌతాఫ్రికా జట్టు మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా రెండు టెస్ట్‌లు.. మూడు వన్డేలు.. ఐదు టీ20లు ఆడనుంది. నవంబర్‌ 14-18 మధ్య తేదీల్లో న్యూఢిల్లీలో తొలి టెస్ట్‌ జరుగనుంది. నవ​ంబర్‌ 22 తేదీన గౌహతి వేదికగా రెండో టెస్ట్‌ ప్రారంభం కానుంది.నవంబర్‌ 30, డిసెంబర్‌ 3, డిసెంబర్‌ 6 తేదీల్లో రాంచీ, రాయ్‌పూర్‌, వైజాగ్‌ వేదికలుగా మూడు వన్డేలు జరుగనున్నాయి. డిసెంబర్‌ 9, 11, 14, 17, 19 తేదీల్లో కటక్‌, చండీఘడ్‌, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్‌ వేదికలుగా ఐదు టీ20లు జరుగనున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో భారత్‌, శ్రీలంకల్లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ దృష్ట్యా ఈ టీ20 సిరీస్‌ను షెడ్యూల్‌ చేశారు.కాగా, భారత క్రికెట్‌ జట్టు ఐపీఎల్‌ 2025 తర్వాత ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన నెలన్నర పాటు సాగనుంది. మధ్యలో భారత్‌ జట్టు ఆగస్ట్‌, సెప్టెంబర్‌ నెలల్లో ఖాళీగా ఉంటుంది. ఆతర్వాత హోం సీజన్‌ ప్రారంభమవుతుంది. భారత్‌లో వెస్టిండీస్‌ పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌ల షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ఇటీవలే విడుదల చేసింది.ఆస్ట్రేలియాలో భారత్‌ పర్యటన షెడ్యూల్‌..అక్టోబర్‌ 19- తొలి వన్డే (డే అండ్‌ నైట్‌)- పెర్త్‌అక్టోబర్‌ 23- రెండో వన్డే (డే అండ్‌ నైట్‌)- అడిలైడ్‌అక్టోబర్‌ 25- మూడో వన్డే (డే అండ్‌ నైట్‌)- సిడ్నీఅక్టోబర్‌ 29- తొలి టీ20- కాన్‌బెర్రాఅక్టోబర్‌ 31- రెండో టీ20- మెల్‌బోర్న్‌నవంబర్‌ 2- మూడో టీ20- హోబర్ట్‌నవంబర్‌ 6- నాలుగో టీ20- గోల్డ్‌ కోస్ట్‌నవంబర్‌ 8- ఐదో టీ20- బ్రిస్బేన్‌

Ysrcp Chief Ys Jagan Condemns Visakha Incident8
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం.. వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

సాక్షి, తాడేపల్లి: విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్కా దీపిక కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని ఘటన మరవకముందే.. విశాఖలో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు.విశాఖలో ప్రేమోన్మాది దాడిలో యువతి తల్లి నక్కా లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం, యువతి దీపిక ప్రాణాపాయ స్థితిలో ఉండటం ఆవేదన కలిగిస్తోందన్నారు. ప్రేమోన్మాది నవీన్‌ను కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లక్ష్మి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Sensational Details Come To Light In The Ameenpur Case9
అమీన్‌పూర్ ముగ్గురు పిల్లల మృతి కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు

సాక్షి, సంగారెడ్డి: అ​మీన్‌పూర్‌ ముగ్గురు పిల్లల మృతి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముగ్గురు పిల్లల్ని తల్లే చంపినట్లు పోలీసులు తేల్చారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. వివాహితర సంబంధంతో భర్తతో పాటు ముగ్గురు పిల్లలను కూడా చంపాలని హంతకురాలు రజిత ప్లాన్ చేసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లల్ని ఊపిరాడకుండా చేసి కన్నతల్లే చంపేసింది.ఇటీవలే పదవ తరగతి విద్యార్థుల గెట్ టుగెదర్‌ పార్టీలో స్నేహితుడితో రజితకు పరిచయం ఏర్పడింది. హంతకురాలు రజిత లావణ్య, ప్రియుడు సూరు శివ కుమార్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య భార్యాపిల్లలతో సహా రాఘవేంద్ర కాలనీకి వచ్చి స్థానికంగా వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మార్చి 28వ తేదీ ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి.. ముగ్గురు పిల్లలు నోటి నుంచి నురగలు కక్కుతూ పడి కనిపించారు. పిల్లలు అచేతనంగా పడి ఉండగా.. భార్య రజిత కడుపు నొప్పితో విలవిలలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫుడ్‌ పాయిజన్‌తో ముగ్గురు పిల్లలు నిద్రలోనే కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి.. ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసిందని తొలుత అంతా భావించారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంతో భర్త చెన్నయ్య పాత్రపై పోలీసులకు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పైగా భార్యాభర్తల మధ్య గతకొన్నేళ్లుగా తరచూ గొడవలు జరుగుతుండడంతో.. రజిత తల్లితో పాటు స్థానికులు ఈ విషయాన్ని నిర్ధారించడంతో ఆ కోణంలోనూ పోలీసులు దృష్టిసారించారు.కానీ విచారణలో చెన్నయ్య పాత్ర ఏం లేదని తేలడంతో పోలీసులు వదిలేశారు. ఆపై ఆస్పత్రిలో కోలుకుంటున్న రజితను పోలీసులు విచారించారు. ఆమె కదలికలు అనుమానంగా తోచడంతో లోతైన దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. అదే వివాహేతర సంబంధం. రజిత పదో తరగతి క్లాస్‌మేట్స్‌ ఈ మధ్య గెట్‌ టు గెదర్‌ చేసుకున్నారు. ఆ టైంలో రజిత స్కూల్‌ డేస్‌లో చనువుగా ఉండే ఓ వ్యక్తి మళ్లీ టచ్‌లోకి వచ్చాడు.అలా తన పాత క్లాస్‌మేట్‌తో రజిత చాటింగ్‌, ఫోన్లు మాట్లాడడం చేసింది. ఇది క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త, పిల్లలను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా జీవించవచ్చని అనుకుంది. మార్చి 27వ రాత్రి విషం కలిపిన భోజనం భర్త, పిల్లలకు పెట్టాలనుకుంది. అయితే భర్త మాత్రం పప్పన్నం మాత్రమే తిని పనికి వెళ్లిపోగా.. పిల్లలు ఆఖర్లో విషం ‍కలిపిన పెరుగన్నం పిల్లలు తిన్నారు. అలా ముగ్గురు పిల్లలు సాయి క్రిష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (8) నిద్రలోనే కన్నుమూశారు.

Kantara Chapter 1 Team Clarity On delay rumours October release10
కాంతార ప్రీక్వెల్ విడుదల వాయిదా.. స్పందించిన టీమ్

కాంతార మూవీతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి. 2022లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్-1ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ సినిమాతో రిషబ్ శెట్టి బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే కాంతార చాప్టర్ 1ను ప్రేక్షకుల ముందుకు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్‌ 2వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని డేట్‌ కూడా రివీల్ చేశారు.అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌పై రూమర్స్ వినిపిస్తున్నాయి. కాంతార చాప్టర్-1 సినిమా విడుదల మరింత ఆలస్యం కానుందని శాండల్‌వుడ్‌లో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ వాయిదా పడుతుందా? అని ప్రశ్నించాడు. దీనికి కాంతార టీమ్ స్పందించింది.ఎట్టి పరిస్థితుల్లో కాంతార చాప్టర్‌ -1 మూవీని వాయిదా వేసేది లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని సూచించింది. ముందు అనుకున్నట్లుగానే అక్టోబర్ 02వ తేదీ 2025న థియేటర్లలో విడుదల అవుతుందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది.కాగా.. ఇటీవల 500 మంది యోధులతో ఓ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ ఫైట్ సీక్వెన్స్‌లో దాదాపు 3 వేల మంది భాగమయ్యారు. దీని కోసం రిషబ్ శెట్టి మూడు నెలల పాటు గుర్రపు స్వారీ, కలరి, కత్తియుద్ధం నేర్చుకున్నారు. దాదాపు 50 రోజుల పాటు చిత్రీకరించిన ఈ భారీ సన్నివేశాన్ని కర్ణాటకలోని పర్వతా ప్రాంతాల్లో చిత్రీకరించారు. 2022 చిత్రానికి ప్రీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా బనవాసికి చెందిన కదంబరాజుల కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Kantara (@kantarafilm)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement