ఖరీఫ్‌లో మాదిరి రబీలోనూ పెసర పంట సాగు అన్ని విధాలా అనుకూలమని దర్శి ఏడీఏ మాలకొండారెడ్డి చెప్పారు.
కొనకనమిట్ల :ఖరీఫ్‌లో మాదిరి రబీలోనూ పెసర పంట సాగు అన్ని విధాలా అనుకూలమని దర్శి ఏడీఏ మాలకొండారెడ్డి చెప్పారు. సాధారణంగా మెట్ట రైతులు ఖరీఫ్‌కు సంబంధించి జూన్ నెలలో పెసర సాగు చేస్తారు... రబీలో సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో సాగుకు అనుకూలంగా ఉంటుంది... బోర్లు ఉన్న రైతులు వేసవిలో ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ పెసర సాగు చేసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు.
ప్రశ్న : పెసర సాగుకు ఏయే నేలలు అనుకూలం?
జవాబు : పెసర సాగుకు చౌడు, మురుగు నీరు నిలిచే భూములు కాకుండా మిగతా అన్ని భూములు అనుకూలమే.
ప్రశ్న : విత్తనశుద్ధి ఎలా చేయాలి, ఏయే రకాలు అనుకూలం?
జవాబు : ఎకరాకు 6 నుంచి 12 కేజీల విత్తనాలను 30 గ్రాముల కార్బోసల్ఫాన్, 5 గ్రాములు ఇమిడాక్లోఫ్రిడ్, 5 గ్రాములు ధమోమితాక్షిమ్‌తో కలిపి శుద్ధి చేయాలి. ఎల్ జి.జి-407, 460, 450, 410 రకం విత్తనాలు అనువైనవి. 5 నుంచి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.
ప్రశ్న : ఏయే ఎరువులు వాడాలి?
జవాబు : పశువుల ఎరువు అయితే రెండు టన్నులు, నత్రజని 8 కేజీలు, భాస్వరం 20 కేజీలు చొప్పున వాడాలి.
ప్రశ్న : పెసరలో అంతర పంటలు సాగు చేయవచ్చా?
జవాబు : పెసర పంటలో పత్తి, కంది సాగు చేసుకుంటే మంచిది.
ప్రశ్న : పైరులో వచ్చే తెల్లదోమ నివారణకు ఏమి చేయాలి?
జవాబు : తెల్లదోమ నివారణకు మోనోక్రొటోఫాస్ 1.5 ఎంఎల్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి లేదా ట్త్రెజోపాస్ రెండు ఎంఎల్‌ను లీటరు నీటికి, లేదా ఎసిటామిఫ్రెడ్‌ను రెండు లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
ప్రశ్న : లద్దె పురుగు నివారణకు ఏమి చర్యలు చేపట్టాలి?
జవాబు : లద్దె పురుగు నివారణకు మోనోక్రోటోపాస్ ఒక ఎంఎల్ లీటరు నీటికి, క్లోమోపైరీపాస్ రెండు ఎంఎల్ లీటరు నీటికి, నొవాల్యురాన్ ఒక ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ప్రశ్న : ఏయే తెగుళ్లు వ్యాపిస్తాయి. నివారణ ఎలా?
జవాబు : పెసరలో బూడిద తెగులు, ఆకు ముడత తెగులు, పల్లాకు తెగులు సోకే ప్రమాదం ఉంది. వీటి నివారణకు కార్బెండైజమ్, మైక్రోబూటానిల్, డైఫిన్ కానోజోల్, ఎసిఫెట్, ప్రొఫినిల్, మోనోక్రోటోపాస్, ఎసిటామఫ్రైడ్, ఇమిడా క్లోఫైర్ మందులు వాడితే ఫలితం ఉంటుంది.