Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TDP coalition government fails to pay fee arrears for Poor Students1
ఫీజుల షెడ్యూల్‌కు బూజు!

ఫీజు కోసం కూలీ పనికి నా ఏడేళ్ల వయసులో నాన్న చనిపోయారు. బతుకుదెరువు కోసం అమ్మమ్మ వాళ్ల ఊరు కోసిగికి వచ్చాం. మా అమ్మ భాగమ్మ కూలీ పనులకు వెళుతూ నన్ను చదివిస్తోంది. సొంతిల్లు లేదు. ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లించలేదు. ఫీజు చెల్లిస్తేనే ప్రాజెక్టు వర్క్‌కు అనుమతిస్తామని యాజమాన్యం చెప్పడంతో ఒకవైపు ఇంటర్న్‌షిప్‌ చేస్తూ మరోవైపు భవన నిర్మాణ పనులకు వెళుతూ ఫీజు డబ్బులు జమ చేసుకుంటున్నా. ప్రభుత్వం స్పందించి సకాలంలో ఫీజులు చెల్లిస్తే నా చదువు పూర్తి చేసుకుని ఏదైన చిరుద్యోగంతో బతుకుతా. – ఎం.రాకేష్‌, బీటెక్‌ ఈసీఈ ఫైనల్‌ ఇయర్, హెచ్‌.మురవణి, కర్నూలు జిల్లా.సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు పాలనలో గతి తప్పిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఊసేలేని వసతి దీవెనతో పేద కుటుంబాల్లోని పిల్లల చదువులు అగమ్యగోచరంగా మారాయి. ఒకపక్క విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా.. ఫీజులు చెల్లించకుండా పరీక్షల ముంగిట పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఫీజులు కట్టాకే సర్టిఫికెట్లు, హాల్‌ టికెట్లు తీసుకోవాలని కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తుండటంతో గత్యంతరం లేక తల్లిదండ్రులు అప్పులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరికొన్ని కుటుంబాల్లో డబ్బులు కట్టలేక, అప్పులు పుట్టక కాలేజీ విద్యార్థులు కూలీలుగా మారుతున్న దుస్థితి దాపురించింది. ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే క్రమం తప్పకుండా పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన చెల్లింపులు జరిపి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దాదాపు రూ.18,663.44 కోట్లతో 27 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకారం త్రైమాసికం ముగిసిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసి విద్యా సంస్థలకు వారే స్వయంగా చెల్లించడం ద్వారా జవాబుదారీతనానికి బాటలు వేసింది. గత ప్రభుత్వంలో ఐదేళ్లూ సజావుగా, చింత లేకుండా సాగిన పిల్లల చదువులు ఒక్కసారిగా కుదుపులకు లోనయ్యాయి. విద్యార్థుల చదువుల విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం రాజకీయ ధోరణి అవలంబిస్తుండటం విద్యావేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం స్కాలర్‌షిప్‌ల పేరుతో ఫీజుల్లో కొంత మొత్తమే ఇచ్చి మిగిలిన భారాన్ని పేదింటి బిడ్డలపైనే వదిలేసింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే క్రమం తప్పకుండా పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని అమలు చేశారు. విద్యార్థి కష్టపడి చదువుకుంటే ఎంత ఫీజు అయినా సరే చెల్లించేందుకు వెనుకాడలేదు. తద్వారా ఐదేళ్లలో లక్షలాది మంది విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకునేలా చదువులకు పూర్తి అండగా నిలిచారు.మళ్లీ చేటు కాలం దాపురించింది..!గత ఐదేళ్లూ ఉజ్వల ప్రగతితో పురోగమించిన ఉన్నత విద్య ప్రతిష్ట కూటమి సర్కారు నిర్వాకాలతో మసకబారుతోంది. వెంటాడుతున్న ఫీజుల భయంతో విద్యార్థులు దినదిన గండంలా కళాశాలలకు వెళ్తున్నారు. హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న వారు మెయింటెనెన్స్‌ ఖర్చులు అందక అలమటిస్తున్నారు. కన్న బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కూలినాలి చేసైనా, మెడలో పుస్తెలు తాకట్టు పెట్టైనా అప్పులు తెచ్చి కళాశాలలకు రూ.వేలకు వేలు ఫీజులు కడుతున్నారు. కూటమి ప్రభుత్వ కుటిల పన్నాగంతో పేద పిల్లలకు ఈ దుర్గతి దాపురించింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఫీజుల చెల్లింపులపై షెడ్యూల్‌ విధానాన్ని గాలికొదిలేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కళాశాలలకు జమ చేస్తామని ప్రకటించింది. త్రైమాసికం విధానాన్ని పూర్తిగా ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తోంది.ముగుస్తున్న విద్యా సంవత్సరం..షెడ్యూల్‌ ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులకు టీడీపీ కూటమి సర్కారు స్వస్తి పలికింది. 2024 – 25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.2,800 కోట్లు, హాస్టల్‌ మెయింటెనెన్స్‌ ఖర్చులు కింద రూ.1,100 కోట్లు కలిపి మొత్తం రూ.3,900 కోట్లు చెల్లించాలి. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి మరో రూ.3,900 కోట్లు కూడా కలిపితే మొత్తం రూ.7,800 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. ఫీజుల కింద ఇప్పటివరకు రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇటీవల ఇచ్చిన రూ.300 కోట్లు పాక్షికంగా మాత్రమే జమ అయినట్లు కాలేజీలు చెబుతున్నాయి. ఇక 2025–26 విద్యా సంవత్సరానికి రూ.3,900 కోట్లు అవసరం అయితే బడ్జెట్‌లో కూటమి సర్కారు కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిపింది. బడ్జెట్‌లో తగిన మేరకు కేటాయింపులు చేయకపోవడం విద్యా వ్యవస్థపై సర్కారు నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. హాస్టల్‌ మెయింటెనెన్స్‌ డబ్బులేవి?కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకపక్క ఫీజుల గండంతోపాటు మరోపక్క వసతి దీవెన (పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌–ఎంటీఎఫ్‌) ఊసే లేకపోవడం విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో వసతి దీవెనలో విద్యార్థులకు ఖర్చుల కింద రూ.4 వేల నుంచి రూ.10 వేల మధ్య స్లాబ్‌ పెట్టి మాత్రమే ఇవ్వగా వైఎస్‌ జగన్‌ పాలనలో ఆ విధానాన్ని తొలగించి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు. జగనన్న వసతి దీవెన ద్వారా రూ.4,275.76 కోట్లు అందచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ (హాస్టల్‌ మెయింటెనెన్స్‌ చార్జీలు) రూ.1,100 కోట్లు చెల్లించకపోవడంతో ఖర్చుల కోసం పిల్లలు అగచాట్లు ఎదుర్కొంటున్నారు.నాడు నిశ్చింతగా చదువులు..వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా విద్యా వ్యవస్థలో పారదర్శకత, పేదింటి తల్లిదండ్రుల పట్ల విద్యా సంస్థలు జవాబుదారీతనంతో నడుచుకోవడం, ప్రైవేట్‌ విద్యా సంస్థలు సైతం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు త్రైమాసికాల వారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించేలా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏటా షెడ్యూల్‌ ప్రకారం సకాలంలో నిధులను విడుదల చేస్తూ చింతలేని చదువులు అందించింది. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బిల్లులను ఏప్రిల్‌లో ప్రాసెస్‌ చేసి షెడ్యూల్‌ ప్రకారం మే నెలలో చెల్లింపులు చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్‌ కారణంగా నిలిచిపోయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకారం చెల్లింపులు చేయకుండా, పిల్లల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తుంగలో తొక్కింది. 2024 ఏడాదికి సంబంధించి మే, ఆగస్టు, నవంబర్‌ నెలల్లో చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు, ఏప్రిల్‌–మేలో ఇవ్వాల్సిన వసతి దీవెన (హాస్టల్‌ మెయింటెనెన్స్‌ చార్జీలు) నిధులను తొక్కిపెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. ప్రైవేటులో పీజీకి సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని చెప్పి విద్యార్థులను నిలువునా ముంచేసింది.ఫీజుల అప్పు ప్రభుత్వమే తీర్చాలి ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్నా. గత ప్రభుత్వలో టంచన్‌గా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందేది. రెండేళ్ల పాటు చదువుకు ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఈ ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు ఇవ్వలేదు. దీంతో పరీక్షలకు హాజరయ్యేందుకు ఇంట్లో వాళ్లు అప్పు చేసి డబ్బు కట్టారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తేగానీ ఆ అప్పు తీరదు. మా అప్పును వడ్డీతో సహా తీర్చడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. – నిద్దాన తిరుమల ప్రసాద్, విద్యార్ధి, విజయనగరం జిల్లా మా పాలిట శాపం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ఇంజనీరింగ్‌ కళాశాలలకు ఇవ్వడం లేదు. కౌన్సిలింగ్‌లో ఉచిత సీటు వచ్చినా ఫీజు కింద రూ.22 వేలు చెల్లించాం. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం మాలాంటి పేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది. – రెడ్డి మహమ్మద్, ఈఈఈ, సెకండ్‌ ఇయర్‌ విద్యార్ధి, అన్నమయ్య జిల్లా అప్పులు చేయాల్సి వస్తోంది నూజివీడులోని ఇంజనీరింగ్‌ కాలేజీలో సీఎస్‌ఈ నాలుగో సంవత్సరం చదువుతున్నా. నాన్న ట్రాక్టర్‌ డ్రైవర్‌. అమ్మ ఫ్యాక్టరీలో రోజువారీ కూలీ. జగనన్న విద్యాదీవెన పథకంతో రెండేళ్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందుకున్నా. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజులు చెల్లించలేదు. ఇప్పటికే రూ.47 వేలు అప్పుచేసి కాలేజీకి కట్టాం. ఈ ఏడాది మళ్లీ అప్పు చేయాల్సి వస్తోంది. – జలసూత్రం మాధవి, విద్యార్థిని, వడ్లమాను, ఏలూరు జిల్లాపరీక్షలు వస్తున్నాయి.. భయంగా ఉంది శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నా. నాన్న లేడు. అమ్మ వ్యవసాయ పనులు చేసుకుంటూ నన్ను చదివిస్తోంది. ఏడాది నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాలేదు. ఈనెల 22 నుంచి పరీక్షలున్నాయి. హాల్‌టికెట్‌ జారీ చేస్తారో లేదో తెలియని పరిస్థితి. కళాశాలకు రూ.35 వేల వరకు కట్టాల్సి ఉంది. పేద కుటుంబం కావడంతో అప్పులు పుట్టే పరిస్థితి లేదు. – కె.మోహన్‌ కందా, డిగ్రీ విద్యార్ధి, శ్రీకాళహస్తి రెడ్‌బుక్‌లో విద్యార్థులూ ఉన్నారేమో! రామచంద్రపురంలోని కళాశాలలో బీటెక్‌ చదువుతున్నా. నాకు మూడు టర్మ్‌లకు రూ.38 వేలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావాలి. విద్యా సంవత్సరం అయిపోతున్నా ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదు. బహుశా విద్యా శాఖ మంత్రి రెడ్‌బుక్‌లో విద్యార్థులు కూడా ఉన్నారేమో! కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి. విద్యార్థులకు న్యాయం చేయాలి. – కె.భాస్కర్, బీటెక్‌ విద్యార్ధి, రాజమహేంద్రవరం సర్టిఫికెట్లు ఇవ్వలేదు డిగ్రీ పూర్తి చేశా. ఇంకా రూ.9 వేలు కాలేజీకి ఫీజు చెల్లించాలి. ఫీజు మొత్తం చెల్లించాకే సర్టిఫికెట్లు తీసుకెళ్లమని చెబుతోంది. నాన్న అహమ్మద్‌ హుస్సేన్‌ దినసరి కూలి. డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకోలేక పీజీ చదవాలన్న కోరిక కలగానే మిగిలిపోయేలా ఉంది. ప్రస్తుతం ఓ ఎరువుల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నా. – షేక్‌ రిజ్వాన్‌ బాషా, డిగ్రీ విద్యార్ధి, ప్రకాశం జిల్లా

Earthquake Strikes Afghanistan Magnitude 6.42
ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున హిందూకుష్‌ ప్రాంతంలో రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూమి కంపించినట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ తెలిపింది. అయితే, దీని ప్రకంపనలు భారత్‌ను తాకాయి.వివరాల ప్రకారం.. ఆఫ్ఘనిస్థాన్‌లో హిందూకుష్‌ ప్రాంతం కేంద్రంగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇక​, ఈ భూకంప తీవ్రత ప్రకంపనలు భారత్‌ను తాకాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. 55 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ తెలిపింది. భూకంపానికి సంబంధించి వీడియోలను నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.A 6.1 magnitude earthquake shook the Hindu Kush region of Afghanistan, and another 6.9 magnitude earthquake shook Tajikistan. pic.twitter.com/HcvpzSd0Cl— Niv Calderon (@nivcalderon) April 16, 2025

Rasi Phalalu: Daily Horoscope On 16-04-2025 In Telugu3
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధన,వస్తులాభాలు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.తదియ ఉ.10.23 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: అనూరాధ రా.3.11 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.11.35 నుండి 12.25 వరకు, అమృతఘడియలు: ప.3.41 నుండి 5.26 వరకు, సంకటహర చతుర్థి.సూర్యోదయం : 5.48సూర్యాస్తమయం : 6.11రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం....పనుల్లో స్వల్ప ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొంత ఒత్తిడులు. ఆరోగ్యభంగం. బంధుమిత్రులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.వృషభం....కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.మిథునం...ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. అవార్డులు దక్కుతాయి.కర్కాటకం...దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్య సూచనలు. పనులు మందకొడిగా సాగుతాయి. నిర్ణయాలలో కొన్ని మార్పులు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.సింహం...ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో కొన్ని చిక్కులు. ఉద్యోగాలలో మరింత పనిభారం. ఆరోగ్యభంగం..కన్య....ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.తుల....ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు. ముఖ్యమైన పనులు కొన్ని నిదానంగా సాగుతాయి. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి.వృశ్చికం....చిన్ననాటి మిత్రులతో చర్చలు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత. విందువినోదాలు.ధనుస్సు....కుటుంబసభ్యులతో విభేదాలు నెలకొనవచ్చు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. వ్యవహారాలలో ఆటంకాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.మకరం....కుటుంబంలో సందడిగా ఉంటుంది. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధన,వస్తులాభాలు. దైవదర్శనాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త ఆశలు.కుంభం.....పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు కొంతమేర వసూలవుతాయి. విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా కొనసాగుతాయి.మీనం...కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు.

Students Visa Cancel In University of Massachusetts4
అమెరికాలో కొత్త టెన్షన్‌.. వారి వీసా రద్దు

వాషింగ్టన్‌: దేశ వ్యతిరేక భావజాలం నింపుకున్న వాళ్లకు అమెరికాలో నిలువనీడ లేదని ఇప్పటికే చాటిన ట్రంప్‌ సర్కార్‌ పలు విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల వీసాల రద్దు పర్వాన్ని కొనసాగిస్తోంది. శాస్త్రసాంకేతిక పరిశోధనా విద్యలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ది మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) విశ్వవిద్యాలయం పైనా ఈ వీసాల రద్దు ప్రభావం పడింది.ఇప్పటికే పలు వర్సిటీల్లో విద్యార్థులతోపాటు పరిశోధకులు, బోధనా, బోధనేతర సిబ్బందిపైనా వీసాల రద్దు వేటువేసిన రిపబ్లికన్‌ ప్రభుత్వం కనీసం ఎందుకు వీసా రద్దు చేస్తున్నారో చెప్పకపోవడం దారుణమని ఎంఐటీ వర్సిటీ పేర్కొంది. తమ వర్సిటీలో 9 మంది విదేశీ విద్యార్థుల వీసాలను కారణం చూపకుండానే రద్దుచేశామని వర్సిటీ తాజాగా వెల్లడించింది. అమెరికాలో సీబీఎస్‌ మీడియాసంస్థ సమాచారం మేరకు ఇప్పటిదాకా అక్కడి 88 కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో దాదాపు 530 మంది విద్యార్థులు, సిబ్బంది, పరిశోధకుల వీసాలను ట్రంప్‌ ప్రభుత్వం ఆకస్మికంగా రద్దుచేసింది. తమ వర్సిటీలో విదేశీ విద్యార్థుల వీసాల రద్దుపై ఎంఐటీ వర్సిటీ అధ్యక్షురాలు సలీ కార్న్‌బ్లూత్‌ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.వర్సిటీ వర్గాలకు ఈ మేరకు సోమవారం ఆమె ఒక లేఖ రాశారు. ‘‘ఏప్రిల్‌ 4వ తేదీ తర్వాత హఠాత్తుగా విద్యార్థుల చదువులను కాలరాస్తూ తీసుకున్న ఈ విధానాలు ఏమాత్రం ఆమోదనీయం కాదు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వలేదు. వీసాల రద్దుకు కారణం చెప్ప లేదు. అత్యంత ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను ఆకర్షించగల వర్సిటీ సామర్థ్యాన్ని ఈ నిర్ణయాలు దెబ్బతీస్తాయి. వర్సిటీ కార్యకలాపాలూ కుంటుపడతాయి. అప్పుడు అంతర్జాతీయంగా వర్సిటీల్లో శాస్త్రసాంకేతిక పరిశోధనలకు సంబంధించి మా వర్సిటీలో ప్రపంచ అగ్రగామిగా కొనసాగడం కష్టసాధ్యమవుతుంది. నూతన పరిశోధనలు, ఆవిష్కరణలతో దేశాన్ని మరింత సుసంపన్నం చేసే క్రతువు కుంటువుడుతుంది’’ అని ఆమె అన్నారు.పరిశోధనా వ్యయాలకు పరిమితిపైనా వర్సిటీల ఆగ్రహం అధునాతన అధ్యయనాలకు సంబంధించిన పరోక్ష పరిశోధనా వ్యయాలను పరిమితం చేసుకోవాలని ప్రభుత్వ ఇంధన శాఖ ప్రకటించడంపై వర్సిటీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. పరోక్ష పరిశోధనా ఖర్చులు ఎంత పెరిగినాసరే ప్రభుత్వం మాత్రం 15 శాతం మాత్రమే రీయింబర్స్‌ చేస్తుందని పేర్కొనడాన్ని వర్సిటీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. విద్యాసంస్థలకు నిధులు తగ్గిస్తే ఆయా విభాగాల సిబ్బందికి జీతభత్యాల చెల్లింపు దాదాపు ఆగిపోతుందని వర్సిటీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనర్జీ(డీఓఈ)పై బోస్టన్‌ ఫెడరల్‌ కోర్టులో ప్రిన్స్‌టన్, కాల్‌టెక్, ఇల్లినాయీ, ఎంఐటీ వర్సిటీలు కోర్టులో దావా వేశాయి.

Several parties, public associations, and NGOs Fires On Election Commission5
ఈసీ తీరు పూర్తిగా.. అనుమానాస్పదం

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పలు పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మండిపడ్డాయి. ఎన్నికల నిర్వహణలో పారదర్శ­కతకు సంస్థ పూర్తిగా తిలోదకాలిస్తోందంటూ ధ్వజమెత్తాయి. ‘‘ఓటింగ్‌కు సంబంధించి పౌరులందరికీ తెలియాల్సిన గణాంకాలను అడి­గినా బయటపెట్టడం లేదు. ఎన్నికల ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయన్న అను­మా­నాలు ఈసీ తీరుతో నానాటికీ బలపడుతు­న్నాయి’’ అంటూ దుయ్యబట్టాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల శాతానికి సంబంధించిన పూర్తి గణాంకాలను బయట పెట్టాల్సిందిగా అవి చిరకాలంగా డిమాండ్‌ చేస్తుండటం తెలిసిందే. ఈ విషయమై అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌)తో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో నమో­దైన మొత్తం ఓట్లకు సంబంధించి 17సీ పార్ట్‌–1 తాలూకు ప్రతులన్నింటినీ వెల్లడించేలా ఈసీని ఆదేశించాలని కోరారు. దీనిపై తొలుత ఈసీని సంప్రదించాల్సిందిగా గత నెల కోర్టు వారికి సూచించింది. దాంతో ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ ఆహ్వానం ఆ మేరకు మంగళవారం సమావేశం జరిగింది. ఏడీఆర్‌ ప్రతినిధులతో పాటు సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వొకేట్‌ ప్రశాంత్‌ భూషణ్, మొయిత్రా తదితరులు భేటీలో పాల్గొన్నారు. తమ డిమాండ్లను మరోసారి ఈసీ ప్రతినిధుల ముందుంచారు. అనంతరం వారంతా మీడియాతో మాట్లాడారు. ఈసీ తీరుపై పెదవి విరిచారు. తమ డిమాండ్లకు ఎలాంటి సానుకూల స్పందనా రాలేదంటూ ఆక్షేపించారు.సీఈసీ, ఈసీ ఎక్కడ: భూషణ్‌సీఈసీ గానీ, ఎన్నికల కమిషనర్లు గానీ భేటీలో పాల్గొనకపోవడాన్ని ప్రతినిధులు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఏదో అత్యున్నత న్యాయస్థానం సూచించింది గనుక తప్పలేదన్నట్టుగా వ్యవహరించారు. భేటీకి కేవలం ఈసీ ప్రతినిధులను పంపి సరిపెట్టారు. సంస్థ విశ్వసనీయతకు సంబంధించిన అతి కీలకమైన సమస్య విషయంలో వారి చిత్తశుద్ధి ఏపాటిదో దీన్నిబట్టే తేలిపోతోంది. అయినా సుప్రీంకోర్టుపై గౌరవంతో మా అనుమానాలన్నింటినీ ఈసీ ప్రతినిధుల ముందుంచాం. 2019 లోక్‌సభ ఎన్నికల ఓటింగ్‌ శాతానికి సంబంధించిన డేటాలో చాలా అవకతవకలున్నట్టు వారి దృష్టికి తీసుకెళ్లాం. వాటిపై సమాధానాలు కోరాం. ఫాం 17(సీ), 20 వంటివాటిని వెబ్‌సైట్లో అందరికీ అందుబాటులో ఉంచాల్సిందిగా సూచించాం. ఇది ఈసీ విశ్వసనీయతకే పెనుసవాలు అన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరాం. కానీ వారినుంచి సానుకూల స్పందనే లేదు’’ అంటూ ప్రశాంత్‌ భూషణ్‌ పెదవి విరిచారు. దీనిపై తమ తదుపరి వాదనలను ఇక సుప్రీంకోర్టు ముందే ఉంచుతామని స్పష్టం చేశారు. ఓటింగ్‌ సంబంధిత డేటాను ఎన్నికల ఏజెంట్లకు అందించడంలో లేని అభ్యంతరం వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయడానికి ఎందుకని ఆయన ప్రశ్నించారు. ‘‘ఓటింగ్‌ విషయంలో తప్పిదాలు, అవకతవకలు జరుగుతున్నాయని, ఈవీఎంల టాంపరింగ్‌ జరుగుతోందని దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా అనుమానాలున్నాయి. అవి వాస్తవమేనంటూ దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు గళమెత్తుతున్నారు. ఈసీ ప్రవర్తన ఆ అనుమానాలకు మరింతగా బలం చేకూరుస్తోంది’’ అంటూ భూషణ్‌ దుయ్యబట్టారు.2024లోనూ అవకతవకలు: మొయిత్రా2019లోనే గాక 2024 లోక్‌సభ ఎన్నికల విషయంలో కూడా ఓటింగ్‌కు సంబంధించి భారీ అవకతవకలు జరిగాయని మొయిత్రా ఆరోపించారు. ‘‘గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ చాలా నియోజకవర్గాల్లో ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు పొంతనే లేదు. సాయంత్రం దాకా ఉన్న పోలింగ్‌ శాతాలు రాత్రికల్లా అనూహ్యంగా భారీగా పెరిగిపోయాయి. చాలాచోట్ల ఈ పెరుగుదల ఏకంగా 20 శాతం దాకా ఉంది’’ అని గుర్తు చేశారు. ఫలితంగా ప్రస్తుతం ఈసీ విశ్వసనీయత ఎన్నడూ లేనంతగా అడుగంటిందని విమర్శించారు. ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఈసీ పూర్తిగా అప్రతిష్టపాలైందన్నారు. ‘‘మేం కోరుతున్నది రహస్య వివరాలేమీ కాదు. దేశప్రజలందరికీ వాటిని తెలుసుకునే హక్కుంది. అంతేకాదు, వాటిని తెలుసుకుని తీరాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది’’ అని ఆమె స్పష్టం చేశారు.

Farmers Likely To Move High Court For Lands Captures Of Capital6
విస్తరణ డ్రామాపై అమరావతి రైతులు కోర్టుకు !

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి విషయంలో ఇప్పుడు సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఇప్పుడు తీసుకున్న భూములన్నీ చాలడం లేదు.. అన్నిటికీ కేటాయించేయగా.. అన్నీ కట్టేయగా.. మహా అయితే రెండు వేల ఎకరాలు మాత్రమే మిగలబోతున్నాయి. ఇంత పెద్ద నగరం కట్టడానికి ఆ భూమి ఏమూలకూ చాలదు. ఇంకా 44 వేల ఎకరాలను సేకరించి మహా రాజధాని కడతాం అని.. చంద్రబాబునాయుడు ఈ కొత్త డ్రామాకు స్క్రిప్టు సిద్ధం చేశారు. కొత్తగా 44 వేల ఎకరాలు లాండ్ పూలింగ్ ద్వారా సేకరించడానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రకటనలు కూడా వస్తున్నాయి. అయితే.. ఆయన సొంత వర్గానికి చెందిన అమరావతి ప్రాంత రైతులే ఈ ఆలోచన మీద ఆగ్రహంతో నిప్పులు కక్కుతున్నారు. తా దూరను కంత లేదు.. మెడకో డోలు అన్నట్టుగా.. ఆల్రెడీ రాజధానిగా నోటిఫై చేసిన భూముల్లో ఏడాదిగా ఒక్క పని మొదలుపెట్టలేకపోయారు గానీ.. ఇప్పుడు ఇంకో 44 వేల ఎకరాలు అంటున్నారు. తమ వద్ద నుంచి సేకరించిన భూములలో తమకు హామీ ఇచ్చిన రాజధాని నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదాకా, నగర విస్తరణ పేరిట కొత్త భూసేకరణ/ పూలింగ్ ప్రయత్నాలను నిలుపుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ.. అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అమరావతి రాజధానిని ఇప్పుడు చంద్రబాబునాయుడే వంచించడానికి పూనుకున్నారు. అమరావతి ని రాజధానిగా పూర్తిగా అభివృద్ధి చేసి, ఆ ప్రాంతంలో.. భూములు ఇచ్చిన రైతులకు దామాషా ప్రకారంగా భూములకంటె విలువైన స్థలాలుగా మార్చి ఇస్తాం అని చంద్రబాబునాయుడు లాండ్ పూలింగ్ సందర్భంగా చాలా చాలా మాటలు చెప్పారు. ప్రజలందరూ కూడా దానిని నమ్మారు. నమ్మి ఇచ్చిన వారు కొందరైతే.. బెదిరించి ప్రలోభ పెట్టి బలవంతంగా మరికొందరితో కూడా భూములు లాక్కున్నారు. మొత్తానికి 54 వేల ఎకరాల వరకు సమీకరించారు. తొలి అయిదేళ్ల పాలనలో కేవలం డిజైన్ల పేరుతో వందల కోట్ల రూపాయలు తగలేసి.. బొమ్మ చూపించి మాయచేస్తూ వచ్చారు. ప్రజలు నమ్మకం లేక ఓడించిన తర్వాత.. జగన్ ప్రభుత్వం ఏర్పడింది. మంచి పాలనలో అధికారవికేంద్రీకరణ ఉండాలనే ఉద్దేశంతో జగన్ ఆలోచన చేసి, శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించారు తప్ప.. దానిని వ్యతిరేకించలేదు. అయితే.. చంద్రబాబునాయుడు అమరావతి రైతులను రెచ్చగొట్టి వారితో హైకోర్టులో కేసులు వేయించి.. అసలు ఏ పనీ ముందుకు సాగకుండా అడ్డుపడ్డారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటిదాకా ఆ ప్రాంత క్లీనింగ్ పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారు. నిర్మాణ పనులు ఇంకా మొదలు కూడా పెట్టలేదు. అప్పుడే మరో 44 వేల ఎకరాలు రాజధాని విస్తరణకు సేకరిస్తాం అంటూ మరో పాట అందుకోవడంపై అమరావతి రైతులు రగిలిపోతున్నారు. ముందు మాకు మాట ఇచ్చిన విధంగా ఈ 54 వేల ఎకరాల రాజధాని పూర్తిగా అభివృద్ధి చేసి.. మాకు కేటాయించిన స్థలాలు మాకు అప్పగించిన తర్వాతే.. మరో పూలింగ్ కు వెళ్లాలని వారు మొండికేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తమను పక్కన పెట్టేసి, ఇంకో నగరం మాయతో తిరగకుండా అడ్డుకోవడానికి అమరావతి రైతులు తమ స్వబుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారి డిమాండు సహేతుకమైనదే గనుక.. కోర్టులో అనుకూల తీర్పు వస్తుందని భావిస్తున్నారు. 44 వేల ఎకరాలంటూ చంద్రబాబు ఎంచుకున్న కొత్త డ్రామాకు ఆదిలోనే బ్రేకులు పడేప్రమాదం కనిపిస్తోంది. సొంత సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ.. తమ పట్ల చంద్రబాబు తలపెడుతున్న ద్రోహాన్ని జీర్ణించుకోలేక అమరావతి రైతులు కోర్టు గడప తొక్కడానికి సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది...ఎం. రాజేశ్వరి

Kolkata Knight Riders lost to Punjab Kings by 16 runs7
111 తోనే పంజాబ్‌ పండుగ

సొంత మైదానంలో బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై పంజాబ్‌ కింగ్స్‌ పడుతూ లేస్తూ 111 పరుగులు చేసింది. మరో 27 బంతులు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్‌ ముగిసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) విజయంపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. 14.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తే కోల్‌కతా జట్టు పాయింట్ల పట్టికలో నంబర్‌వన్‌ స్థానానికి కూడా దూసుకుపోతుంది. ఎంత వేగంగా ఛేదిస్తారనే దానిపైనే చర్చ. 62/2 స్కోరుతో జట్టు గెలుపు దిశగా సాగింది. కానీ ఒక్కసారిగా అనూహ్యం జరిగింది. యుజువేంద్ర చహల్‌ పదునైన స్పిన్‌తో కేకేఆర్‌ పతనానికి శ్రీకారం చుట్టాడు. 17 పరుగుల వ్యవధిలో కోల్‌కతా 6 వికెట్లు కోల్పోయింది. అయితే రసెల్‌ ఒకే ఓవర్లో 16 పరుగులు రాబట్టడంతో మళ్లీ కేకేఆర్‌ విజయంపై అంచనాలు... కానీ యాన్సెన్‌ బంతితో రసెల్‌ ఆట ముగిసింది... మరో 29 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా ఆలౌట్‌... పంజాబ్‌ అభిమానులతో మైదానం ఒక్కసారిగా హోరెత్తింది. శనివారం 245 పరుగులు చేసి కూడా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓడిన పంజాబ్‌ కింగ్స్‌...ఇప్పుడు ఐపీఎల్‌ చరిత్రలోనే అతి తక్కువ లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా నిలిచింది. ముల్లాన్‌పూర్‌: ఐపీఎల్‌లో అరుదుగా కనిపించే తక్కువ స్కోర్ల మ్యాచ్‌ అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసింది. మంగళవారం జరిగిన ఈ పోరులో పంజాబ్‌ కింగ్స్‌ 16 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌ 15.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (15 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం కోల్‌కతా 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. రఘువంశీ (28 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ యుజువేంద్ర చహల్‌ (4/28) ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. ఓపెనింగ్‌ మినహా... తొలి 19 బంతుల్లో 39/0... తర్వాతి 17 బంతుల్లో 15/4... పవర్‌ప్లేలో పంజాబ్‌ ఆటతీరు ఇది. ఓపెనర్ల ఆటతీరు చూస్తే ఈ మైదానంలో జరిగిన గత రెండు మ్యాచ్‌ల తరహాలోనే భారీ స్కోరు ఖాయమనిపించింది. కానీ ఆ తర్వాత జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. నోర్జే ఓవర్లో ప్రియాన్ష్ఆర్య (12 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రెండు ఫోర్లు కొట్టగా... అరోరా వేసిన తర్వాతి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్‌ వరుసగా 4, 6, 4 బాదాడు. అదే ఓవర్లో ప్రియాన్ష్ కూడా ఫోర్‌ కొట్టడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. రాణా తొలి బంతిని ప్రియాకూ సిక్స్‌ కొట్టే వరకు అంతా బాగుంది. కానీ ఆ తర్వాతి బంతి నుంచే కోల్‌కతా బౌలర్ల జోరు మొదలైంది. అదే ఓవర్లో ప్రియాన్ష్ , శ్రేయస్‌ అయ్యర్‌ (0)లను అవుట్‌ చేసిన రాణా తన తర్వాతి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్‌ను కూడా వెనక్కి పంపాడు. అంతకు ముందే సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన ఇన్‌గ్లిస్‌ (2) కూడా వరుణ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 6 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 54/4కు చేరింది. ఇక ఆ తర్వాత పంజాబ్‌ కోలుకోలేకపోయింది. నైట్‌రైడర్స్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ ముందు బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. పవర్‌ప్లే తర్వాత ఆడిన 57 బంతుల్లో 57 పరుగులు మాత్రమే చేసిన జట్టు 6 వికెట్లు కోల్పోయింది. వధేరా (10), మ్యాక్స్‌వెల్‌ (7), ఇంపాక్ట్‌ సబ్‌గా వచ్చిన సూర్యాంశ్‌ (4) ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా, శశాంక్‌ సింగ్‌ (17 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్‌) కూడా విఫలమయ్యాడు. టపటపా... ఛేదనలో కోల్‌కతాకు సరైన ఆరంభం లభించలేదు. మూడు బంతుల వ్యవధిలో ఒకే స్కోరు వద్ద ఓపెనర్లు నరైన్‌ (5), డికాక్‌ (2) వెనుదిరిగారు. అయితే అజింక్య రహానే (17), రఘువంశీ కలిసి కొన్ని చక్కటి షాట్లతో మూడో వికెట్‌కు 38 బంతుల్లో 55 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే రహానే వెనుదిరిగిన తర్వాత కేకేఆర్‌ పతనం వేగంగా సాగిపోయింది. ఒక్కరు కూడా పట్టుదలగా నిలబడి జట్టును గెలిపించే ప్రయత్నం చేయలేకపోయారు. చివర్లో రసెల్‌ (11 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. రహానే దురదృష్టవశాత్తూ ఎల్బీపై రివ్యూ కోరకపోవడం కూడా కేకేఆర్‌కు నష్టం కలిగించింది. అతని అవుట్‌ తర్వాతే పరిస్థితి మారింది. బాల్‌ ట్రాకింగ్‌లో ప్రభావం ఆఫ్‌ స్టంప్‌ బయట కనిపించింది. రివ్యూ కోరితే అతను నాటౌట్‌గా తేలేవాడు. చహల్‌ మ్యాజిక్‌ టోర్నీ తొలి 5 మ్యాచ్‌లలో ఏకంగా 83.50 సగటు, 11.13 చెత్త ఎకానమీతో కేవలం 2 వికెట్లు... 2 మ్యాచ్‌లలో మాత్రమే ఓవర్ల కోటా పూర్తి... వేలంలో రూ.18 కోట్లతో అమ్ముడుపోయిన చహల్‌ పేలవ ఫామ్‌ ఇది. కచ్చితంగా రాణించాల్సిన తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగిన అతను మ్యాజిక్‌ చూపించాడు. వరుస ఓవర్లలో రహానే, రఘువంశీలను అవుట్‌ చేసి పంజాబ్‌ శిబిరంలో ఆశలు రేపిన అతను కీలక సమయంలో వరుస బంతుల్లో రింకూ, రమణ్‌దీప్‌లను వెనక్కి పంపి విజయానికి బాటలు వేశాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా తనకున్న గుర్తింపును నిలబెట్టుకుంటూ మళ్లీ రేసులోకి వచ్చాడు. ఐపీఎల్‌లో నేడుఢిల్లీ X రాజస్తాన్‌ వేదిక: న్యూఢిల్లీరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారంస్కోరు వివరాలు పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్(సి) రమణ్‌దీప్‌ (బి) రాణా 22; ప్రభ్‌సిమ్రన్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) రాణా 30; శ్రేయస్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) రాణా 0; ఇన్‌గ్లిస్‌ (బి) వరుణ్‌ 2; వధేరా (సి) వెంకటేశ్‌ (బి) నోర్జే 10; మ్యాక్స్‌వెల్‌ (బి) వరుణ్‌ 7; సూర్యాంశ్‌ (సి) డికాక్‌ (బి) నరైన్‌ 4; శశాంక్‌ (ఎల్బీ) (బి) అరోరా 18; యాన్సెన్‌ (బి) నరైన్‌ 1; బార్ట్‌లెట్‌ (రనౌట్‌) 11; అర్ష్ దీప్ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.3 ఓవర్లలో ఆలౌట్‌) 111. వికెట్ల పతనం: 1–39, 2–39, 3–42, 4–54, 5–74, 6–76, 7–80, 8–86, 9–109, 10–111. బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 2.3–0–26–1, నోర్జే 3–0–23–1, హర్షిత్‌ రాణా 3–0–25–3, వరుణ్‌ చక్రవర్తి 4–0–21–2, నరైన్‌ 3–0–14–2. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) సూర్యాంశ్‌ (బి) బార్ట్‌లెట్‌ 2; నరైన్‌ (బి) యాన్సెన్‌ 5; రహానే (ఎల్బీ) (బి) చహల్‌ 17; రఘువంశీ (సి) బార్ట్‌లెట్‌ (బి) చహల్‌ 37; వెంకటేశ్‌ (ఎల్బీ) (బి) మ్యాక్స్‌వెల్‌ 7; రింకూ సింగ్‌ (స్టంప్డ్‌) ఇన్‌గ్లిస్‌ (బి) చహల్‌ 2; రసెల్‌ (బి) యాన్సెన్‌ 17; రమణ్‌దీప్‌ (సి) శ్రేయస్‌ (బి) చహల్‌ 0; రాణా (బి) యాన్సెన్‌ 3; అరోరా (సి) ఇన్‌గ్లిస్‌ (బి) అర్ష్ దీప్ 0; నోర్జే (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.1 ఓవర్లలో ఆలౌట్‌) 95. వికెట్ల పతనం: 1–7, 2–7, 3–62, 4–72, 5–74, 6–76, 7–76, 8–79, 9–95, 10–95. బౌలింగ్‌: యాన్సెన్‌ 3.1–0–17–3, బార్ట్‌లెట్‌ 3–0–30–1, అర్ష్ దీప్ 3–1–11–1, చహల్‌ 4–0–28–4, మ్యాక్స్‌వెల్‌ 2–0–5–1.

Thaman Respond On Pushpa 2 Music Dispute Latest Interview8
'పుష్ప 2'కి నా మ్యూజిక్ పెట్టుకోలేదు.. ‍అయినా బాధ లేదు

గతేడాది డిసెంబరులో రిలీజైన పుష్ప 2 మూవీ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో తెగ ఆడేసింది. అధికారికంగా చెప్పలేదు గానీ రూ.2000 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయని టాక్. సరే ఇవన్నీ పక్కనబెడితే పుష్ప 2కి తన మ్యూజిక్ వాడుకోకపోవడం గురించి తమన్ ఇన్నాళ్లకు స్పందించాడు.(ఇదీ చదవండి: సీరియల్ నటి వైష్ణవి నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్)పుష్ప 2 విడుదలకు ముందు మ్యూజిక్ విషయంలో పలువురు పేర్లు వినిపించాయి. అందులో తమన్ కూడా ఒకరు. ఈ విషయాన్ని ఓ మూవీ ఫంక్షన్ లో ఇతడే స్వయంగా బయటపెట్టాడు. తాను కూడా పనిచేస్తున్నానని అన్నాడు. కట్ చేస్తే టైటిల్స్ లో తమన్ పేరు ఎక్కడా కనిపించలేదు. తాజాగా సుమ ఇంటర్వ్యూలో ‍అసలేం జరిగిందనే విషయాన్ని బయటపెట్టాడు.'పుష‍్ప 2 కోసం నేను 10 రోజుల పాటు కష్టపడ్డా. మూడు వెర్షన్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాను. టీమ్ కి అది నచ్చింది కూడా. కాకపోతే ఫైనల్ గా డీఎస్పీ, సామ్ సీఎస్ ఇచ్చిన మ్యూజిక్ ఓకే చేశారు. అయినా సరే నాకేం బాధ లేదు. అందరి ఒప్పందంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు' అని తమన్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: బన్నీ కోసం ముగ్గురు బ్యూటీస్.. కాకపోతే!)

Experts on China Mineral Export Ban9
ట్రంప్‌కు కీలెరిగి వాత

అరుదైన ఖనిజాల ఎగుమతుల నిలిపివేత ద్వారా అమెరికాను చైనా నేరుగా కుంభస్థలంపైనే కొట్టిందని పరిశీలకులు అంటున్నారు. దీని ప్రభావం అమెరికా రక్షణ శాఖపై భారీగా ఉండనుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫైటర్‌ జెట్లు తదితరాల తయారీని ఇది తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న మొత్తం అరుదైన ఖనిజాల్లో ఏకంగా 70 శాతం వాటా చైనాదే! అమెరికా వాటా 11.4 శాతం.కానీ దేశీయ, ముఖ్యంగా రక్షణ అవసరాలను తీర్చేందుకు ఆ నిల్వలు ఏ మూలకూ చాలవు. మలేసియా, జపాన్‌ సహా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నా అవి 30 శాతం అవసరాలనే తీర్చగలుగుతున్నాయి. దాంతో మరో దారిలేక అగ్ర రాజ్యం ఇంతకాలంగా చైనా దిగుమతులపైనే ప్రధానంగా ఆధారపడుతూ వస్తోంది. తన అరుదైన ఖనిజ అవసరాల్లో 70 శాతం అక్కడినుంచే దిగుమతి చేసుకుంటోంది. చైనా ఇప్పుడు సరిగ్గా గురి చూసి ఆ కీలకమైన సరఫరా లింకును మొత్తానికే తెగ్గొట్టింది.17 రకాల అరుదైన ఖనిజాల్లో సమారియం, గాడోలినియం, టెర్బియం, డైస్పోరియం, లుటేటియం, స్కాండియం, ఇత్రియం రూపంలో ప్రస్తుతానికి ఏడింటికి ఎగుమతుల నిషేధాన్ని వర్తింపజేసింది. వీటితో పాటు పలు కీలక లోహాలు, అయస్కాంత వస్తువులను కూడా ఈ జాబితాలో చేర్చింది. ఇకపై చైనా కంపెనీలు వీటిని ఎగుమతి చేయాలంటే ప్రత్యేక లైసెన్సులు తీసుకోవాల్సిందే. చైనా నిర్ణయం పలు అమెరికానే గాక చాలా దేశాలనూ ప్రభావితం చేయనుంది. ముఖ్యంగా యూరప్‌ దేశాలకైతే పిడుగుపాటే. వాటి అరుదైన ఖనిజాల అవసరాల్లో సగటున 46 శాతం దాకా చైనా దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి.అనుమానమే నిజమైందిఅత్యంత కీలకమైన ఖనిజ అవసరాల కోసం చైనాపై ఆధారపడటం ఎప్పటికైనా ప్రమాదమేనని అమెరికా రక్షణ శాఖ ముందునుంచీ మొత్తుకుంటూనే ఉంది. ఇది జాతీయ భద్రతకే ముప్పని 2024 మార్చి 11న అధ్యక్షునికి పంపిన ఓ నోట్‌లో స్పష్టంగా పేర్కొంది కూడా. ఈ విషయంలో అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో చాలావరకు చైనామీదే ఆధారపడాల్సి రావడంపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఆ భయాలే ఇప్పుడు నిజమయ్యాయి. రక్షణ పాటవం పెంచుకోవడంలో అమెరికా, చైనా కొన్నేళ్లుగా నువ్వా, నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి.కీలక ఖనిజాలపై ఆంక్షలతో ఈ పోటీలో అగ్ర రాజ్యాన్ని దాటి చైనా దూసుకెళ్లేలా కన్పిస్తోంది. ఈ సమస్యను అధిగమించే మార్గాలపై అమెరికా రక్షణ శాఖ కొంతకాలంగా గట్టిగా దృష్టి సారించింది. దేశీయంగా అరుదైన ఖనిజాల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇతోధికంగా పెంచుకునేలా ‘మైన్‌ టు మాగ్నెట్‌’ పేరిట ఐదేళ్ల ప్రణాళికను సిద్ధం చేసింది. కానీ ఆలోగా జరిగే అపార నష్టాన్ని భర్తీ చేసుకునే మార్గాంతరాలు కన్పించక ట్రంప్‌ సర్కారు తలపట్టుకుంటోంది.అన్నింట్లోనూ అవే కీలకంఫైటర్‌ జెట్లు మొదలుకుని కీలకమైన రక్షణ వ్యవస్థలన్నింట్లోనూ అరుదైన ఖనిజాలది కీలక పాత్ర. ఎఫ్‌–35 యుద్ధ విమానాలు, వర్జీనియా–కొలంబియా శ్రేణి జలాంతర్గాములు, తోమహాక్‌ క్షిపణులు, రాడార్‌ వ్యవస్థలు, ప్రిడేటర్‌ శ్రేణి మానవరహిత వైమానిక వాహనాలు, మ్యునిషన్‌ సిరీస్‌ స్మార్ట్‌ బాంబులు... ఇలా దేని తయారీకైనా అవి కావాల్సిందేనని సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ వివరించింది.⇒ ఒక ఎఫ్‌–35 యుద్ధ విమానం తయారీకి 900 పౌండ్ల (400 కిలోల) మేరకు అరుదైన ఖనిజాలు కావాలి.⇒ అర్లే బ్రూక్‌ శ్రేణి డీడీజీ–51 డిస్ట్రాయర్‌ యుద్ధనౌక తయారీకి ఏకంగా 5,200 పౌండ్లు (2,300 కిలోలు) అవసరం.⇒ అదే వర్జీనియా శ్రేణి జలాంతర్గామి నిర్మాణానికి 9,200 పౌండ్ల (4,173 కిలోల) అరుదైన ఖనిజాలు అవసరం.ఆందోళనకరమే⇒ ఖనిజాలపై చైనాతో చర్చిస్తాం ⇒ ట్రంప్‌ ఆర్థిక సలహాదారువాషింగ్టన్‌: అరుదైన ఖనిజాలు, కీలక లోహాలు, అయస్కాంత పదార్థాల ఎగుమతులను నిలిపేస్తూ చైనా తీసుకున్న నిర్ణయం అమెరికాను తీవ్ర ఆందోళనకు గురిచేసే అంశమేనని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆర్థిక సలహాదారు కెవిన్‌ హసెట్‌ అంగీకరించారు. సోమవారం ఆయన వైట్‌హౌస్‌ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఆ అరుదైన ఖనిజాల అవసరం రక్షణ, టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్‌ తదితర రంగాలకు చాలా ఉంటుంది.చైనా నిర్ణయాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నాం. ఈ విషయమై మాకు అందుబాటులో ఉన్న అన్ని ఇతర అవకాశాలనూ పరిశీలిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. బహుశా డ్రాగన్‌ దేశంతో తాము చర్చలు జరిపే అవకాశాలు లేకపోలేదన్నారు. చైనా నిర్ణయంతో పలు యూరప్‌ దేశాల్లో కూడా ఆటోమొబైల్స్, సెమీ కండక్టర్లు తదితర కంపెనీలు తీవ్రంగా ప్రభావితమవుతాయని అభిప్రాయపడ్డారు. ట్రంప్‌ ప్రతీకార సుంకాల వల్ల అమెరికా ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుతుందన్న వాదనను హసెట్‌ తోసిపుచ్చారు. అమెరికా, చైనా మధ్య తీవ్రస్థాయి టారిఫ్‌ల పోరు సాగుతున్న విషయం తెలిసిందే.

India to receive above normal monsoon rains: IMD10
ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం

న్యూఢిల్లీ: రైతన్నలకు శుభవార్త. ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) మంగళవారం ప్రకటించింది. వర్షపాతం 96 శాతం నుంచి 104 శాతం నమోదైతే సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. ఈసారి దేశంలో మొత్తం దీర్ఘకాల సగటు వర్షపాతం 105 శాతంగా ఉంటుందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మోహపాత్ర తెలియజేశారు.సాధారణ వర్షపాతానికి 30 శాతం, సాధారణం కంటే అధిక వర్షపాతానికి 33 శాతం, సాధారణం కంటే అత్యధిక వర్షపాతానికి 26 శాతం అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ స్పష్టంచేసింది.తమిళనాడుతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. మొత్తం సీజన్‌లో ఎల్‌నినో పరిస్థితులు నెలకొనే అవకాశం లేదని తెలియచెప్పింది. 1971 నుంచి 2020 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సీజన్‌ వర్షపాతం దీర్ఘకాల సగటు 87 సెంటీమీటర్లుగా నమోదైందని ఐఎండీ తెలియజేసింది. నైరుతి రుతుపవనాలు ప్రతిఏటా జూన్‌ 1వ తేదీకల్లా కేరళలో ప్రవేశిస్తుంటాయి. సెప్టెంబర్‌ రెండోవారం కల్లా రుతుపవనాల సీజన్‌ ముగుస్తుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement