Northwestern Polytechnic University
-
బుల్లి పేస్ మేకర్
ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మమైన, బియ్యం గింజ కంటే కూడా బుల్లి పేస్ మేకర్‌ను అమెరికా పరిశోధకులు అభివృద్ధి పరిచారు. నార్త్వెస్ట్ర్న్ యూ నివర్సిటీకి చెందిన ఇంజనీర్లు గుండెను కృత్రిమంగా పనిచేయించే ఈ చిన్న పరికరాన్ని రూపొందించారు. ఉపయో గం తీరాక శరీరంలోనే కలిసిపోవడం దీని మరో ప్రత్యేకత. శరీరంపై గాటు పెట్టాల్సిన అవసరమేమీ లేకుండా ఇంజెక్షన్ ద్వారానే దీనిని లోపలికి పంపించేయొచ్చు. జర్నల్ నేచర్‌లో ఈ వివరాలు తాజాగా ప్రచురితమయ్యాయి. తాత్కాలిక అవసరాలు కలిగిన శిశువులకు ఇది ఎంతో ఉపయోగకరమని నిపుణులు అంటున్నారు. ‘మేం రూపకల్పన చేసిన ఈ డివైజ్ ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన పేస్ మేకర్‌గా భావిస్తున్నాం’అని నార్త్‌వెస్టర్న్ బయో ఎల్రక్టానిక్స్ నిపుణుడు, బృంద సారథి జాన్ ఎ.రోజెర్స్ చెప్పారు. ‘ముఖ్యంగా పీడియాట్రిక్ గుండె సర్జరీలకు సూక్ష్మంగా ఉండటం ఎంతో కీలకం. పేస్ మేకర్ ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది’అని ఆయన చెప్పారు. చిన్నారులను దృష్టిలో ఉంచుకునే ఈ డివైజ్‌ను రూపొందించామని నార్త్‌వెస్టర్న్ కార్డియాలజిస్ట్ ఇగోర్ ఎఫిమోవ్ చెప్పారు. ‘దాదాపు ఒక శాతం శిశువులు పుట్టుకతోనే గుండె సంబంధ లోపాలతో ఉంటున్నా రు. సర్జరీ తర్వాత వీరికి తాత్కాలిక పేస్ మేకర్ అవసరమవుతుంది. దాదాపు వారం పాటు వీరి గుండెలు సొంతంగా రిపేర్ చేసుకుంటాయి. ఆ కీలకమైన సమయంలో ఈ చిన్న పేస్ మేకర్ వారికి సహాయకారిగా ఉంటుంది. ఆ తర్వాత అది శరీరంలో కలిసిపోతుంది. దీనిని తొలగించడానికి మరో సర్జరీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు’అని ఎఫిమోవ్ వివరించారు. ఇదెలా పని చేస్తుందంటే..? ఛాతీపైన అమర్చే చాలా చిన్నగా ఉండే ఫ్లెక్సిబుల్, వైర్లెస్ ప్యాచ్‌లో ఈ పేస్ మేకర్ ఉంటుంది. గుండె స్పందనలు క్రమం తప్పినట్లు గుర్తించిన వెంటనే పేస్ మేకర్‌కు ఈ ప్యాచ్ సిగ్నల్ పంపించి, దానిని యాక్టివేట్ చేస్తుంది. ఇది ఇచ్చే సున్నితమైన స్పందనలు శరీరం, కండరాల ద్వారా అంది గుండె లయను క్రమబద్ధం చేస్తాయి. ఇందులోని అత్యంత సూక్ష్మమైన బ్యాటరీ శరీరంలోని ఫ్లూయిడ్లను ఉపయోగించుకుని విద్యుత్ శక్తిని తయారు చేస్తుంది. దీనికి సాధారణంగా ఉండే ఎలాంటి వైర్లు అవసరం లేదు. దీని వల్ల ఇది చాలా సురక్షితంగా ఉంటుంది. సులభంగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు తయారైన పేస్ మేకర్లు రేడియో సిగ్నళ్లపై ఆధారపడగా, ఈ కొత్త డివైజ్ కేవలం కాంతిని ఉపయోగించుకుని గుండె లయను నియంత్రించ గలుగుతుందని రోజెర్స్ చెప్పారు. జంతువులపైన, దాతల ద్వారా అందిన గుండెలపైన చేసిన ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చాయని చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ వర్సిటీల్లో అంతా భారత విద్యార్థులే
కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ వర్సిటీ, నార్త్‌వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్సిటీల్లో చేరుతున్న వారిలో 90 శాతానికిపైగా భారత విద్యార్థులే. గత ఏడాది జూన్-ఆగస్టు మధ్య ఈ వర్సిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల జీఆర్ఈ 275 లోపే. ఆంగ్ల భాషలో పట్టు తెలుసుకోవడానికి పెట్టే టోఫెల్ పరీక్షలో ఈ విద్యార్థుల స్కోర్ 60 లోపే. అంతేకాదు ఈ కాలేజీల్లో చేరిన భారత విద్యార్థుల్లో బ్యాక్లాగ్ (నాలుగేళ్ల బీటెక్ కోర్సులో ఫెయిలై మళ్లీ పరీక్ష రాసిన) లేకుండా ఉత్తీర్ణులైన వారు ఒక్కరు కూడా లేరు. ఈ రెండు విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థులందరూ కనిష్టంగా 11, గరిష్టంగా 16 బ్యాక్‌లాగ్‌లు ఉన్నవారే. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఈ వర్సిటీల్లో చదువుతున్న 90 శాతం మంది భారత విద్యార్థుల్లో 67 శాతం తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే. అమెరికా వస్తే ఏదో ఒక ఉద్యోగం చేసి నాలుగు డాలర్లు వెనకేసుకోవచ్చన్నదే వీరి మొదటి ప్రాధాన్యత. అందువల్లే తరగతుల్లో చేరిన నాటి నుంచే వారి గ్రాడ్యుయేషన్ కంటే ముందే పార్ట్‌టైమ్ ఉద్యోగాల వెతుకులాట మొదలవుతుంది. ఆ ఉద్యోగం కాస్త బాగుండి నెలకు 2 వేల డాలర్లు వస్తాయనుకుంటే తరగతులకు కూ డా డుమ్మా కొడతారు. ఒక్క కాలిఫోర్నియాలోనే కాదు న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో వేల మంది భారత విద్యార్థులకు ‘ఐ20’ సమకూర్చే వర్సిటీలు ఎన్నో ఉన్నాయి. కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూయార్క్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో చదువుకునేందుకు వెళుతున్న వారిని అక్కడి సీబీటీ అధికారులు ప్రశ్నించి, అసలు కూపీ లాగుతున్నారు. విద్యార్థులు పొంతన లేని జవాబులు చెబితే ఇంటర్వ్యూ చివర్లో వీసా రద్దు చేస్తున్నామని, వెనక్కి పంపుతున్నామని చెప్పేస్తారు. అంతేకాదు పాస్‌పోర్టులో ఎఫ్-1 వీసా స్టాంపింగ్‌పై అడ్డంగా స్కెచ్పెన్నుతో గీతలు పెట్టి, ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తారు. పొంతన లేని జవాబులు చెప్పిన ఓ విద్యార్థినిని అలాగే వెనక్కి పంపేశారు.